prateek yadav
-
ములాయం కొడుకు గోశాలకు సీఎం యోగి
-
ములాయం కొడుకు గోశాలకు సీఎం యోగి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్నకుమారుడు ప్రతీక్ యాదవ్ ఇంటికి వెళ్లనున్నారు. ప్రతీక్ యాదవ్ నిర్వహిస్తున్న కన్హా ఉపవాన్(గోశాల)ను సందర్శించనున్నారు. ఇందులో ప్రతీశ్ చాలా గోవులను సాకుతూ పెద్ద గోశాలగా మార్చారు. సహజంగానే సన్యాసి అయిన యోగి ఆదిత్యానాథ్‌కు గోవులంటే అమితమైన ప్రేమ. వాటిని హింసించేవారంటే ఆయనకు ఏ మాత్రం నచ్చదు. గోవును మాతగా ఆయన భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో గొప్ప గోశాల అయిన కన్హా ఉపవాన్‌ను యోగి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రతీక్, ఆయన భార్య అపర్ణా యాదవ్‌తోపాటు ములాయం సింగ్ సింగ్ ఆయన భార్య సాధనా యాదవ్ కూడా అక్కడికి వెళ్లి ముఖ్యమంత్రి యోగిని కలిసి శుభాభినందనలు తెలియజేయనున్నారు. శుక్రవారం పదిగంటల ప్రాంతంలో కన్హా ఉపవాన్‌ను యోగి సందర్శించే అవకాశం ఉంది. గోశాలను సందర్శించిన తర్వాత ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన 20 నిమిషాలపాటు ప్రతీక్ దంపతులు తదితరులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. -
యూపీ రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ సీన్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్, ఆయన భార్య అపర్ణా యాదవ్ శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు. ఈ ఉదయం వీవీఐపీ అతిథి గృహానికి వచ్చిన ప్రతీక్, అపర్ణ దంపతులు సీఎం యోగితో మంతనాలు జరిపారు. వీరు ఏం చర్చించారన్నది వెల్లడి కాలేదు. తాజాగా ముగిసిన యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైంది. బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అపర్ణా యాదవ్.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో 33,796 ఓట్లతో ఓడిపోయారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోదీతో ములాయం, అఖిలేశ్ మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో సీఎం యోగితో ప్రతీక్, అపర్ణ దంపతుల భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. -
అఖిలేష్, ప్రతీక్.. నాకు రెండు కళ్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ మూడో దశ ఎన్నికల్లో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ములాయం, ఆయన భార్య సాధన గుప్తా.. కుమారులు అఖిలేష్ యాదవ్, ప్రతీక్ యాదవ్.. కోడళ్లు డింపుల్ యాదవ్, అపర్ణా యాదవ్ ఓటు వేశారు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే సాధనా గుప్తా.. ఓటు వేసిన అనంతరం కాసేపు విలేకరులతో మాట్లాడారు. అఖిలేష్, ప్రతీక్ ఇద్దరూ తనకు రెండు కళ్లలాంటివారని అన్నారు. తమ కుటుంబమంతా ఒక్కటేనని చెప్పారు. అఖిలేష్.. ములాయం మొదటి భార్య కొడుకు కాగా, ప్రతీక్.. ములాయం రెండో భార్య సాధన కొడుకు. అఖిలేష్ భార్య డింపుల్ కనౌజ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ప్రతీక్ భార్య అపర్ణ లక్నో కంటోన్నెంట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆ మధ్య ములాయం ఇంట్లో, ఎస్పీలో ఆధిపత్య పోరు సాగినపుడు ఆయన కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. సాధన, అపర్ణ, ములాయం సోదరుడు శివపాల్ ఒకవైపు.. అఖిలేష్, ములాయం మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ మరో వైపు ఉన్నట్టు కథనాలు వినిపించాయి. విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చిన ములాయం కుటుంబ సభ్యులు పలు సందర్భాల్లో తామంతే ఒక్కటేనని చెబుతున్నారు. -
నా 5 కోట్ల కారుపై వివాదమెందుకు?
సమాజ్‌వాద్ పార్టీలో ప్రస్తుతం తండ్రికొడుకులు బాగానే ఉన్నప్పటికీ, గత కొన్ని రోజుల క్రితం వరకు తండ్రి ములాయం, పెద్ద కొడుకు అఖిలేష్ మధ్య రాజుకున్న వివాదం అంతాఇంతా కాదు. సైకిల్ గుర్తు కోసం ఆ ఇద్దరి పోరు ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్‌లో కలవరం సృష్టించింది. అదే సమయంలో ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ లంబోర్గిని కార్లో లక్నో రోడ్లపై చక్కర్లు కొట్టడం పేపర్లలో హెడ్‌లైన్స్‌గా నిలిచింది. ఇది కాస్తా ఇంటర్నెట్లో వైరల్ అయింది. తన రూ. 5 కోట్ల లంబోర్గిని కారుపై సోషల్ మీడియాలో తలెత్తిన వివాదంపై ప్రతీక్ యాదవ్ తొలిసారి స్పందించారు. ఆ లంబోర్గిని హురాకాన్ కారును రుణం తీసుకుని మరీ కొనుకున్నానని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పారు. రాజకీయాలంటే పెద్దగా ఇష్టంలేని ప్రతీక్ యాదవ్ రియల్ ఎస్టేట్, జిమ్స్ వంటి బిజినెస్‌లను కలిగి ఉన్నారు. ఈ కారుకు సంబంధించిన అన్ని పేపర్లు తన దగ్గరున్నాయని, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నట్టు ప్రతీక్ తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా దీనిపై ఎందుకంత రాద్ధాంతమని ప్రశ్నించారు. ఒకవేళ ఈ రూ.5 కోట్లను ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టుంటే ఎవరూ ఏమి అనేవారు కాదుకదా? అని ప్రశ్నించారు. సమాజ్ వాద్ పార్టీలో చిచ్చు రేగడానికి ఓ వంతు కారణమైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ ఈ సారి ఎన్నికల్లో లక్నో నుంచి పోటీకి దిగబోతున్నారు. తన భార్య అపర్ణ యాదవ్ కచ్చితంగా గెలుస్తారని ప్రతీక్ ధీమా వ్యక్తంచేశారు. తను పోటీకి దిగబోతున్న ప్రాంతంలో అపర్ణ చాలా చేశారని ప్రతీక్ తెలిపారు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో 250 సీట్ల నుంచి 300 సీట్ల వరకు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తనకు రాజకీయాలంటే ఇష్టంలేదని, ఒకవేళ ఆ ఇష్టమే ఉంటే ఎప్పుడో రాజకీయాల్లోకి ప్రవేశించే వాడినని చెప్పారు. ఎక్కువగా తన బిజినెస్‌ల వైపే దృష్టిసారిస్తానని ప్రతీక్ పునరుద్ఘాటించారు.