నా 5 కోట్ల కారుపై వివాదమెందుకు?
నా 5 కోట్ల కారుపై వివాదమెందుకు?
Published Thu, Feb 9 2017 3:20 PM | Last Updated on Mon, Jul 30 2018 8:10 PM
సమాజ్వాద్ పార్టీలో ప్రస్తుతం తండ్రికొడుకులు బాగానే ఉన్నప్పటికీ, గత కొన్ని రోజుల క్రితం వరకు తండ్రి ములాయం, పెద్ద కొడుకు అఖిలేష్ మధ్య రాజుకున్న వివాదం అంతాఇంతా కాదు. సైకిల్ గుర్తు కోసం ఆ ఇద్దరి పోరు ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్లో కలవరం సృష్టించింది. అదే సమయంలో ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ లంబోర్గిని కార్లో లక్నో రోడ్లపై చక్కర్లు కొట్టడం పేపర్లలో హెడ్లైన్స్గా నిలిచింది. ఇది కాస్తా ఇంటర్నెట్లో వైరల్ అయింది. తన రూ. 5 కోట్ల లంబోర్గిని కారుపై సోషల్ మీడియాలో తలెత్తిన వివాదంపై ప్రతీక్ యాదవ్ తొలిసారి స్పందించారు. ఆ లంబోర్గిని హురాకాన్ కారును రుణం తీసుకుని మరీ కొనుకున్నానని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పారు. రాజకీయాలంటే పెద్దగా ఇష్టంలేని ప్రతీక్ యాదవ్ రియల్ ఎస్టేట్, జిమ్స్ వంటి బిజినెస్లను కలిగి ఉన్నారు.
ఈ కారుకు సంబంధించిన అన్ని పేపర్లు తన దగ్గరున్నాయని, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నట్టు ప్రతీక్ తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా దీనిపై ఎందుకంత రాద్ధాంతమని ప్రశ్నించారు. ఒకవేళ ఈ రూ.5 కోట్లను ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టుంటే ఎవరూ ఏమి అనేవారు కాదుకదా? అని ప్రశ్నించారు. సమాజ్ వాద్ పార్టీలో చిచ్చు రేగడానికి ఓ వంతు కారణమైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ ఈ సారి ఎన్నికల్లో లక్నో నుంచి పోటీకి దిగబోతున్నారు. తన భార్య అపర్ణ యాదవ్ కచ్చితంగా గెలుస్తారని ప్రతీక్ ధీమా వ్యక్తంచేశారు. తను పోటీకి దిగబోతున్న ప్రాంతంలో అపర్ణ చాలా చేశారని ప్రతీక్ తెలిపారు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో 250 సీట్ల నుంచి 300 సీట్ల వరకు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తనకు రాజకీయాలంటే ఇష్టంలేదని, ఒకవేళ ఆ ఇష్టమే ఉంటే ఎప్పుడో రాజకీయాల్లోకి ప్రవేశించే వాడినని చెప్పారు. ఎక్కువగా తన బిజినెస్ల వైపే దృష్టిసారిస్తానని ప్రతీక్ పునరుద్ఘాటించారు.
Advertisement
Advertisement