ఏపీఎన్జీవోల సమ్మె విరమణ | APNGOs temporarily Call off Strike | Sakshi
Sakshi News home page

ఏపీఎన్జీవోల సమ్మె విరమణ

Published Fri, Oct 18 2013 3:49 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

ఏపీఎన్జీవోల సమ్మె విరమణ - Sakshi

ఏపీఎన్జీవోల సమ్మె విరమణ

సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోలు సమ్మె విరమించారు. అయితే, విరమణ తాత్కాలికమేనని, తెలంగాణ తీర్మానం కోసం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజున సమ్మె మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించారు. శాసనసభను సమావేశపరచాలని నిర్ణయించిన రోజే సమ్మె నోటీసు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో చర్చలు సంతృప్తికరంగా ముగిసినందునే సమ్మెకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు విధుల్లో చేరుతారని తెలిపారు.
 
 దాంతో, రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన 66 రోజుల ఉద్యోగుల సమ్మెకు ప్రస్తుతానికి తెరపడింది. సచివాలయంలో గురువారం సీఎంతో చర్చల అనంతరం ఎపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ఇతర సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తన స్థాయిలో ఇచ్చిన హామీల పట్ల సంతృప్తి చెందామని ఈ సందర్భంగా అశోక్‌బాబు తెలిపారు. విభజన తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, శాసనసభకు తీర్మానం ఎప్పుడు వస్తుందనే విషయంలో కూడా ఇంకా స్పష్టత లేనందున.. సమ్మె విరమించాలని సీఎం విజ్ఞప్తి చేశారని, తమ డిమాండ్లపై కూడా సానుకూలంగా స్పందించారని, అందువల్ల సమ్మె విరమణ నిర్ణయం తీసుకున్నామని వివరించా రు.అయితే, సమ్మెను విరమించినా, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు.

సమ్మె వల్లనే విభజన ప్రక్రియ వేగం తగ్గిందన్నారు. లేదంటే ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం పూర్తయి, బిల్లు పార్లమెంటుకు వచ్చేదన్నారు. సమ్మె విజయవంతమైందని, విభజన నష్టాలను ప్రజలకు వివరించగలిగామని చెప్పారు. సీఎంతో చర్చల్లో ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, ట్రెజరీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రవికుమార్, రెవె న్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంటా వెంకటేశ్వరావు, ఈవోఆర్డీ అసోసియేషన్ నేతలు వేంపల్లి మల్లికార్జున రెడ్డి, చెన్నా రాఘవేంద్రనాథ్, గ్రామీణ నీటి పారుదల ఉద్యోగుల సంఘం నేత ఉమామహేశ్వరరావు, మురళి, పంచాయతీ కార్యదర్శుల సంఘం నేత జనార్థన్‌రెడ్డి, మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణమోహన్, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు కైకాల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున సీఎంతో పాటు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి పాల్గొన్నారు.
 
 ప్రధానికి లేఖ రాస్తా: సీఎం కిరణ్
 ఉద్యోగులు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మేం సమ్మె చేశాం. సమ్మె విరమించమని మీరు అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సమైక్యంపై స్పష్టమైన హామీ ఇప్పించండి.
 సీఎం: కేంద్రం నుంచి హామీ ఇప్పించడం సాధ్యమయ్యే పనిలా లేదు. వారు(కేంద్రం) ఎంత వేగంగా వెళుతున్నారో.. అంతే వేగంగా విభజన ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.
 ఉద్యోగులు: అలాంటప్పుడు సమ్మె ఎందుకు విరమించాలి?
 సీఎం: సమ్మె వల్ల ప్రజలు అల్లాడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయి. విభజన ఆపాలని మా పార్టీ అధ్యక్షురాలికి స్పష్టంగా చెప్పాను. నేను సీఎంగా ఉన్నంత వరకు విభజన జరగదు. ఇంత వరకు మీరు జీతాలు, జీవితాలను పణంగా పెట్టి ఉద్యమాలు చేశారు. ఉద్యమ తీవ్రతను ఢిల్లీ పెద్దలు గుర్తించారు. ఇక నుంచి మేం(రాజకీయ నాయకులం) ఆ బాధ్యతను తీసుకుంటాం.
 
 ఉద్యోగులు: సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ వ్యవస్థ విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.
 సీఎం: తెలంగాణ ఆకాంక్షను దశాబ్దం పైగా ఢిల్లీ పెద్దలకు క్రమంగా ఎక్కించారు. కానీ మనం అందుకు భిన్నంగా.. విభజన జరగదనే నమ్మకంతో మౌనంగా ఉన్నాం.
 
 ఉద్యోగులు: 371 డి అధికరణ పరిస్థితి ఏమిటి?
 సీఎం: ఈ అంశం మీద న్యాయనిపుణులను సంప్రదించాను. ఈ విషయంలో వారికీ స్పష్టత లేదు. 371 డి అధికరణను రద్దు చేయాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ, సగానికిపైగా రాష్ట్రాల ఆమోదం పొందాలని చెబుతున్నారు. 371డి అధికరణను రద్దు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం అసాధ్యమని అంటున్నారు. 371 డి ప్రకారం వచ్చిన జోనల్ వ్యవస్థపై అధికారులు, న్యాయనిపుణుల్లో కొంత అస్పష్టత ఉంది. 371 డి అధికరణ, తెలంగాణ ఏర్పాటు బిల్లు, తీర్మానం శాసనసభకు వస్తాయా? రావా? వస్తే ఎన్నిసార్లు వస్తాయి? శాసనసభలో అభిప్రాయాలే చెప్పాలా? లేక తీర్మానాన్ని ఆమోదానికి పెట్టాలా?... తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాస్తాను. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు అనుసరించిన విధానాన్నే ఇప్పుడు కూడా అనుసరించమని కోరుతాను. శాఖల వారీగా విభజన వల్ల వచ్చే నష్టాలపై మీరు నివేదిక ఇవ్వండి. దాన్ని ప్రధాని, జీవోఎంల దృష్టికి తీసుకెళ్తాను. శాసనసభకు తీర్మానం వస్తే ఓడించడానికి శాయశక్తులా కృషి చేస్తాను.
 
 ఉద్యోగులు: ఉద్యమాన్ని బలహీనపరిచేలా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు. వారిని కట్టడి చేయండి.
 సీఎం: అందరం కూర్చుని మాట్లాడతాం. భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపుల ఆవశ్యకతను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం.
 
 
 ఉద్యోగులు: సమ్మె కాలానికి వేతనాల మాటేమిటి? జీతాలు చెల్లిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వండి.
 సీఎం: జీవో 177 ప్రకారం ‘నో వర్క్ నో పే’ అమల్లో ఉంది. సమ్మె కాలానికి జీతాలు ఇచ్చే విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిస్తుంది.
 
 ఉద్యోగులు: స్పష్టమైన హామీ వస్తేనే విరమణ గురించి ఆలోచిస్తాం. 177 జీవోను రద్దు చేయండి. సకల జనుల సమ్మె కాలానికి జీతాలు ఇచ్చి టీఎన్జీవోలకూ న్యాయం చేయండి.
 సీఎం: అందరూ మన ఉద్యోగులే. ఈ సమయంలో ఉద్యోగులను సంతృప్తిపరిచేందుకు కృషి చేస్తాను. 177 జీవోతో సంబంధం లేకుండా సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించేలా న్యాయ సలహా తీసుకొంటాను.
 ఉద్యోగులు: ఓ వైపు రాష్ట్ర విభజన అంటూ మరోవైపు ఐటీఐఆర్ ప్రతిపాదన అంటే అన్యాయం కాదా?
 సీఎం: హైదరాబాద్ పరిసరాల్లో ఏర్పాటు చేయబోయే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ కోసం 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్ర విభజనతో దానికి సంబంధం లేదు. 90 శాతం ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే ఉన్నందున ఈ జోన్‌ను హైదరాబాద్ పరిసరాల్లో నెలకొల్పాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement