విభజన బిల్లు లోపభూయిష్టం | kiran kumar reddy speech in assembly | Sakshi
Sakshi News home page

విభజన బిల్లు లోపభూయిష్టం

Published Sun, Jan 26 2014 1:14 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

విభజన బిల్లు లోపభూయిష్టం - Sakshi

విభజన బిల్లు లోపభూయిష్టం

సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013’పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం శాసనసభలో ధ్వజమెత్తారు. ‘‘బిల్లు లోపభూయిష్టం. రాజ్యాంగ ఉల్లంఘనలున్నాయి. అసెంబ్లీకి పంపించింది ముసాయిదా బిల్లా? నిజమైన బిల్లా? బిల్లును రాష్ట్రపతి పంపినా అది రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే. ఎందుకు విభజస్తున్నారో కారణాలు, ఉద్దేశాలు చెప్పరు. ఆర్థికాంశాల నివేదిక ఇవ్వరు. ఆదాయ వ్యయాలివ్వరు. అసెంబ్లీ మాత్రం అభిప్రాయం చెప్పాలట. దేనిపై అభిప్రాయం చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఆర్థికాంశాలకు సంబంధించి ఇస్తాం, చూస్తాం, పరిశీలిస్తామంటే కుదరదు’’ అని అన్నారు. బిల్లుపై సభలో పలు దఫాలుగా మాట్లాడిన ఆయన, తన ప్రసంగాన్ని శనివారం ముగించారు.
 
 ‘‘రాష్ట్రపతి పంపించిన లేఖలోనేమో బిల్లు అని పేర్కొంటారు. హోం శాఖ కార్యదర్శిని మరిన్ని వివరాలు కోరితే ఆయనిచ్చిన సమాధానంలోనేమో ఇది ముసాయిదా బిల్లు మాత్రమేనని పేర్కొనడం విచిత్రం. ముసాయిదా బిల్లును అసలు రాష్ట్రపతికి పంపడానికే వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి’’ అన్నారు. విభజనపై నిర్ణయం తీసుకునే సమయంలోనే అన్ని ఉల్లంఘనలూ జరిగాయని ఆరోపించారు. బిల్లుకు సంబంధించి సమస్త సమాచారాన్ని సంబంధిత శాఖల నుంచి తీసుకున్నాక దాని రూపకల్పన సమయంలో న్యాయ మంత్రి సంతకం తీసుకోవాలన్నారు. కానీ ఆయా శాఖల వివరాలేవీ తమ వద్ద లేవని కేంద్ర హోం శాఖ చెప్పడం విడ్డూరమన్నారు. ‘‘బిల్లు తయారీకి సంబంధించిన నియమ నిబంధనలను కూడా కేంద్రం పూర్తిగా విస్మరించింది. రాష్ట్రంపై కేంద్రం అజమాయిషీకి, హైజాక్ చేయడానికి వీల్లేదు. ఎస్‌ఆర్ బొమ్మైకేంద్ర ప్రభుత్వం కేసులో జస్టిస్ జీవన్‌రెడ్డి ఇదే అంశాన్ని స్పష్టం చేశారు’’ అని కిరణ్ గుర్తు చేశారు. విభజన తరువాత ఇరు ప్రాంతాలకు ఏం చేయాలనుకున్నారో కేంద్రం ఎక్కడా చెప్పలేదని విమర్శించారు. దేనికెన్ని నిధులు కేటాయిస్తారో వివరణలు కూడా లేవని ధ్వజమెత్తారు. ‘శాసనసభకు పంపితే ఒరిజనల్ బిల్లు పంపాలే గానీ ముసాయిదా బిల్లు పంపడానికి వీల్లేదు. సభలో చర్చించాలంటే ప్రజలకు ఎలా మేలు చేస్తారన్న వివరణ ఉండాలి’ అన్నారు.
 
 
 రాజ్యాంగంలో లేని ‘ఉమ్మడి’ని ఎలా చేరుస్తారు?
 ఉమ్మడి రాజధాని అన్నది రాజ్యాంగంలో లేదని, అలాంటిదాన్ని బిల్లులో ఎలా చేరుస్తారని కిరణ్ ప్రశ్నించారు. ‘‘మీకు (తెలంగాణ వారికి) ఉమ్మడి రాజధాని ఇష్టమేనా? గవర్నర్‌కు అధికారాలు కల్పించడాన్ని అంగీకరిస్తారా? గవర్నర్‌కు అధికారాల కల్పనకు మేం కూడా వ్యతిరేకం. 371డి అధికరణాన్ని ఎలా సవరిస్తారు? హైదరాబాద్, విద్యుత్, సాగునీరు తదితరాల విషయంలో ఇబ్బందులున్నాయి. ఇన్ని ఇబ్బందులున్న బిల్లును వ్యతిరేకించాలా, సమర్థించాలా? నేను కాంగ్రెస్‌వాదిని. జై ఆంధ్ర ఉద్యమాన్ని కూడా మా తండ్రి సమర్థించలేదు. విభజన చేయాలని అధిష్టానం అన్నప్పుడు నేనెప్పుడూ మౌనంగా ఉండలేదు. మా తండ్రి మరణించినప్పుడు ఎంత బాధపడ్డానో రాష్ట్ర విభజన నిర్ణయంతో కూడా అంతే బాధపడుతున్నానని మా నాయకురాలితో చెప్పాను.
 
 ముఖ్యమంత్రి పదవి విషయంలో తెలంగాణ వారికి అన్యాయం జరిగిందని ఆమె అన్నప్పుడు, ‘అందుకు మేం బాధ్యులం కాదు. సీఎం అభ్యర్థిని నిర్ణయించింది, సీఎంలను మార్చింది అధిష్టానమే అయినందున అది తప్పయితే ఆ తప్పు ఏఐసీసీదే’ అని చెప్పా. విడిపోయిన తరవాత ఏదీ సద్దుమణగదు. 371డి ప్రకారం జిల్లా పోస్టుల్లో 20 శాతం, జోనల్ పోస్టుల్లో 30 శాతం, మల్టీ జోనల్ పోస్టుల్లో 40 శాతం, ఓపెన్ కేటగిరీ కింద ఎవరైనా వచ్చిన పరీక్షలు రాయవచ్చని అలాంటప్పుడు తెలంగాణ యువకులకు లక్షలాది ఉద్యోగాలు ఎక్కడ నుంచి వస్తాయి?’’ అని ప్రశ్నించారు. ‘తెలంగాణ విషయంలో నాకెలాంటి దురుద్దేశమూ లేదు. ఎవరినో బాధపెట్టడానికో, రాష్ట్రం వస్తుంటే అడ్డుకునేందుకో ఈ పని చేయడం లేదు.వాస్తవాలు వివరిస్తున్నా’ అని చెప్పారు.
 
 తెలంగాణకు మూడుసార్లు సీఎం పదవిచ్చినా ఓకే
 
 రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉంచి వరుసగా మూడు పర్యాయాలు తెలంగాణ వారే ముఖ్యమంత్రులుగా ఉన్నా తమకు అభ్యంతరం లేదని సీఎం ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్... ఇలా అన్ని రంగాల్లోనూ ఆంధ్ర, రాయలసీమల కంటే తెలంగాణలోనే అన్ని రంగాల్లోనూ అధికాభివృద్ధి జరిగిందని గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యమంత్రులంతా శ్రద్ధ తీసుకోవడం వల్లే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. ఎవరికీ వివక్ష లేదనే విషయం గమనించాలన్నారు.
 
 కిరణ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
 
 నేను రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రిని. పదవులు శాశ్వతం కాదు. మనమంతా ప్రయాణికులమే. రాష్ట్రాన్ని విభజిస్తే నక్సల్స్, శాంతిభద్రతల సమస్యలు వస్తాయి. రెండు ప్రాంతాలకూ నష్టమే. ప్రత్యేకించి తెలంగాణలో సున్నిత ప్రాంతాలున్నాయి.
 
 ప్రైవేట్ ఉద్యోగావకాశాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఉన్నత విద్య, ప్రభ్వుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రధాన వైద్య సంస్థలన్నీ అక్కడే ఉన్నాయి. విడిపోతే ఉన్నత విద్య, వైద్యం, ఉద్యోగాల కోసం మనం వేరే రాష్ట్రాలకు వెళ్లాలా అనే బాధ సీమాంధ్ర వాసుల్లో ఉంది.
 
 తెలంగాణ వారికి కూడా రాష్ట్రం విడిపోవాలని లేదు. విభజనపై ఇటీవల కర్నూలులో సర్వే సందర్భంగా అలంపూర్ (మహబూబ్‌నగర్ జిల్లా) వాసులు ఇదే చెప్పారు. విడిపోతే రెండు చోట్లా పన్ను చెల్లించాల్సి ఉంటుందనే ఆవేదన వ్యక్తం చేశారు.
 
 రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం అన్ని ప్రాంతాల వారూ వచ్చి స్థిరపడ్డారు. వారికి నగరంతో భావోద్వేగ బంధముంది. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. కలిసుంటే పెట్టుబడులు వస్తాయి. అభివద్ధి చేసుకోవచ్చు. ఆ దిశగా ఆలోచించాలి.
 
 
 సీఎం వ్యాఖ్యలపై అసెంబ్లీలో  వివిధ పార్టీల స్పందన
 
 గడువు ఎందుకు కోరినట్లు?: సీపీఎం
 
 విభజన బిల్లు తప్పుల తడక, రాజ్యాంగ ఉల్లంఘనలు అంటున్న ముఖ్యమంత్రి.. మరో నెల గడువు కావాలని ఎందుకు కోరారని సీపీఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనప్పుడు అప్పుడే ఎందుకు తిప్పి పంపించలేదని నిలదీశారు.
 
 కేంద్రం పనికిమాలిందా?: సీపీఐ
 
 ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు చూస్తే కేంద్రంలో పనికిమాలిన ప్రభుత్వం ఉందనేది ఆయన అభిప్రాయంగా తెలుస్తోందని సీపీఐ నాయకుడు గుండా మల్లేశ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కూడా ఇంత పనికిమాలి మాట్లాడతారని తాను అనుకోలేదని వ్యాఖ్యానించారు.
 
 సీమ గురించి మాట్లాడరెందుకు?: ఎంఐఎం
 
 సీఎం, ప్రతిపక్ష నేత అంతా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటున్నారే కాని.. సీమాంధ్రకు ఏమి కావాలన్న విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని ఎంఐఎం నేత ఒవైసీ ప్రశ్నించారు.  బిల్లులో లోపాలు ఉంటే ఎందుకు సభలో ప్రవేశపెట్టారని అడిగారు. దీనిపై స్పష్టత కోసం ఏజీ, న్యాయనిపుణులతో సమాధానం చెప్పించాలని డిమాండ్ చేశారు.
 
 అభద్రతాభావం పెంచుతున్నారు: టీఆర్‌ఎస్
 
 ముఖ్యమంత్రి రాజ్యాంగానికి లోబడి కాకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ప్రజల్లో అభద్రతా భావం పెంచుతున్నారని టీఆర్‌ఎస్ నాయకుడు ఈటెల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ విడిపోయినా.. భారత సార్వభౌమాధికారం పరిధిలోనే, భారత రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుందన్న విషయం సీఎం తెలుసుకోవాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement