స్థానిక వైద్యులతో అపోలో జట్టు
* ఇప్పటికే దంత వైద్యులతో జేవీ
* త్వరలో మధుమేహ వైద్యులతో ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్ నూతన వ్యాపార విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి వరకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్పెషాలిటీ క్లినిక్స్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థ స్థానిక వైద్యులతో చేతులు కలుపుతోంది. స్థానికంగా పేరు ప్రఖ్యాతులున్న ప్రత్యేక వైద్యులతో సంయుక్త భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. తద్వారా అపోలో బ్రాండ్‌ను విస్తరింపజేయడమేగాక అత్యాధునిక వైద్య సేవలను విస్తృతం చేయాలన్నది సంస్థ ఆలోచన.
ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై సంస్థ ఇప్పుడు దృష్టిసారించింది. ఇప్పటికే దంత వైద్య విభాగంలో ఈ మోడల్‌ను అమలు చేస్తోంది. కొద్ది రోజుల్లో మధుమేహ చికిత్సలో నిమగ్నమైన వైద్యులతో చేతులు కలుపనున్నట్టు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీత రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
పేరున్న వైద్యులతో..
ప్రముఖ వైద్యులతో చేతులు కలపడం ద్వారా అపోలో బ్రాండ్‌ను పాపులర్ చేయొచ్చన్నది కంపెనీ భావన. అటు వ్యాపారపరంగా వృద్ధికి ఆస్కారం ఉంటుంది. వైద్యులకు సైతం పెద్ద బ్రాండ్‌తో భాగస్వామ్యం ఉండడం వల్ల పేషెంట్ల రాక మరింత పెరుగుతుంది. నగరాల్లో ప్రధాన ప్రాంతాల్లో సొంతంగా ఆసుపత్రి నిర్మాణం, నిర్వహణ భారీ వ్యయంతో కూడుకున్నది. అనుభవజ్ఞులైన వైద్యుల నియామకం పెద్దప్రహసనం కూడా. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న క్లినిక్ అయితే ఈ ఇబ్బందులేవీ ఉండవు.
అపోలో టెక్నాలజీ..
దంత వైద్య సేవల్లో ఉన్న అపోలో వైట్ డెంటల్ ప్రస్తుతం 15 క్లినిక్‌లతో జేవీ కుదుర్చుకుంటోంది. వీటిలో మెజారిటీ వాటా అపోలోకు ఉంటుంది. కనీసం 51 శాతం నుంచి కొన్నింటిలో 90 శాతం దాకా వాటా తీసుకుంటున్నట్టు సమాచారం. మధుమేహ చికిత్స సేవల్లో ఉన్న క్లినిక్‌లకూ ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. జేవీలో భాగంగా క్లినిక్‌లకు అత్యాధునిక టెక్నాలజీని అపోలో సమకూరుస్తుంది. తద్వారా రోగులకు మరింత మెరుగ్గా వైద్య సేవలను అందించేందుకు వీలవుతుంది.