ఆపిల్ షాకింగ్ రిజల్ట్స్
Published Wed, Oct 26 2016 3:45 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
సిలికాన్ వ్యాలీ దిగ్గజం ఆపిల్ ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది. గత 15 ఏళ్లలో మొదటిసారి కంపెనీ యాన్యువల్ విక్రయాలు, లాభాలు పడిపోయినట్టు కంపెనీ రిపోర్టు చేసింది. 1997లో దివాలా స్థానం నుంచి ప్రపంచ అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిన ఆపిల్, సెప్టెంబర్తో ముగిసిన ఈ మూడో త్రైమాసికంలో కేవలం 215.6 బిలియన్ డాలర్ల(రూ.14,40,433కోట్ల) విలువైన ఐఫోన్స్, వాచస్ను, మ్యాక్ కంప్యూటర్లు, ఇతరాత్ర ఉత్పత్తులను మాత్రమే విక్రయించినట్టు మంగళవారం రాత్రి పేర్కొంది. గతేడాది ఈ విక్రయాలు 233.7 బిలియన్ డాలర్లు(రూ.15,61,243కోట్ల)గా నమోదయ్యాయి. కంపెనీ యాన్యువల్ విక్రయాల్లో క్షీణత, లాభాలపై దెబ్బకొట్టినట్టు ఆపిల్ ప్రకటించింది.
కంపెనీ లాభాలు దాదాపు 14 శాతం పడిపోయి, 45.7 బిలియన్ డాలర్లు(రూ.3,05,298కోట్ల)గా నమోదైనట్టు తెలిపింది. 2001 తర్వాత మొదటిసారి ఆపిల్ కంపెనీ యాన్యువల్ విక్రయాలు, లాభాలు పడిపోయాయని కంపెనీ వెల్లడించింది.. ఈ మూడు నెలల త్రైమాసికంలో ఆపిల్ విక్రయాలు 9 శాతం క్షీణించి 46.85 బిలియన్ డాలర్లుగా రికార్డయినట్టు పేర్కొంది. ఈ విక్రయాల క్షీణత గతేడాది ఇదే కాలంతో పోలిస్తే క్వార్టర్లీ లాభాలు 9 బిలియన్ డాలర్లు క్షీణించడానికి దోహదం చేశాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ విక్రయాలు పడిపోయినప్పటికీ, భారత్ మార్కెట్లో మాత్రం కంపెనీకి మెరుగైన ఫలితాలనే కంపెనీ నమోదుచేసింది. గతేడాది పోలిస్తే ఈ ఏడాది భారత్లో ఐఫోన్ విక్రయాలు 50 శాతం మేర ఎగబాకాయని ఆపిల్ పేర్కొంది. రిలయన్స్ జియో ఐఫోన్ ఆఫర్తో ఈ వృద్ధి మరింత నమోదవుతుందని కంపెనీ ఆశిస్తోంది. దీంతో ఆపిల్ ప్రస్తుతం భారత్ మార్కెట్పై ఎక్కువగా దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్లో భారత్లో మరింత వృద్ధికి తోడ్పతామని సీఈవో టిమ్ కుక్ తెలిపారు.
యాన్యువల్ విక్రయాలు, లాభాలు పడిపోయినప్పటికీ, కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఫలితాలపై సానుకూల అభిప్రాయాన్నే వ్యక్తంచేశారు. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు ఆపిల్ కంపెనీకి 2016 విజయవంతమైన ఆర్థికసంవత్సరంగా చూపించినట్టు పేర్కొన్నారు. ఇటీవల విడుదల చేసిన కొత్త ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్, ఆపిల్ వాచ్ సిరీస్ 2లకు కస్టమర్ల నుంచి వస్తున్న అనూహ్య స్పందన చూసి తాము మురిసిపోతున్నట్టు తెలిపారు. 2007 జూన్లో మొదటిసారి ఐఫోన్ను ఆవిష్కరించామని, ప్రస్తుతం టెలికాం పరిశ్రమలో గూగుల్ వంటి కంపెనీలతో తీవ్రమైన పోటీ నెలకొన్నట్టు పేర్కొన్నారు. గూగుల్ ఇటీవలే తన సొంత బ్రాండులో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది.
చైనా వంటి కీలకమైన మార్కెట్లలో కూడా చౌకైన ధరల్లో స్మార్ట్ఫోన్లు లభ్యమవుతున్నాయని, దీంతో ఐఫోన్కు తీవ్రమైన పోటీ నెలకొన్నట్టు టిమ్ కుక్ అభిప్రాయం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ 16న మార్కెట్లలలోకి అందుబాటులోకి వచ్చిన ఐఫోన్ 7కు డిమాండ్ అమాంతం పెరగడంతో, సప్లై సమస్యతో కంపెనీ కొంత సతమతమైంది. కానీ స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ గెలాక్సీ నోట్7 పేలిపోవడం ఆపిల్కు అనుకూలించి, విక్రయాలను కంపెనీ పెంచుకోగలిగింది.
Advertisement
Advertisement