కశ్మీర్‌లో కిరాతకం
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు పెట్రేగిపోయారు. యువ సైనికాధికారిని అపహరించి కిరాతకంగా చంపేశారు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం ఆర్మీలో చేరిన లెఫ్టినెంట్ ర్యాంకు అధికారి ఉమర్ ఫయాజ్(22)ను తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. బుల్లెట్ గాయాలతో పడివున్న ఉమర్ మృతదేహాన్ని హెర్మయిన్ ప్రాంతంలో బుధవారం ఉదయం గుర్తించారు. కుల్గాం జిల్లాకు చెందిన ఉమర్ బంధువుల పెళ్లికి హాజరయేందుకు షోపియాన్ జిల్లాకు వచ్చారని పోలీసులు తెలిపారు. తీవ్రవాదులు మంగళవారం ఆయనను కిడ్నాప్ చేశారు.
యువ సైనికాధికారిని అపహరించి తీవ్రవాదులు కాల్చి చంపడాన్ని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. తీవ్రవాదులు పిరికిపందల్లా దొంగదెబ్బ తీశారని పేర్కొన్నారు. లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ అరుదైన క్రీడాకారుడని వెల్లడించారు. కశ్మీర్‌లోయ తీవ్రవాదాన్ని అంతంచేసేందుకు తన ప్రాణాలను ఆయన ఫణంగా పెట్టారని కొనియాడారు.