Shopian district
-
ఎన్కౌంటర్లో లష్కరే ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. శుక్రవారం వేకువజామున దక్షిణ కశ్మీర్‌లోని చోటిగామ్ గ్రామంలో ముష్కరుల సంచారం ఉందన్న నిఘా సమాచారం మేరకు బలగాలు కార్డన్ సెర్చ్ చేపట్టాయి. దాక్కున్న ఉగ్రవాది ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. ప్రతిగా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో హతమైన ఉగ్రవాదిని బిలాల్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. చెక్ చొలాన్ ప్రాంతానికి చెందిన భట్ లష్కరే తోయిబాలో సభ్యుడు. ఘటనా స్థలి నుంచి ఏకే రైఫిల్‌తోపాటు మందుగుండు సామగ్రిని స్వా«దీనం చేసుకున్నారు. కుల్గామ్‌లోని సుద్సన్‌కు చెందిన ఫయాజ్(22) రాజ్‌పుటానా రైఫిల్స్ జవానుగా ఉండేవారు. బంధువు ఇంటికి పెళ్లికని వచి్చన ఫయాజ్ను ఉగ్రవాదులు నిర్బంధించి 2017 మేలో కాల్చి చంపారు. ఈ ఘటనలో భట్ ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో కేసు కూడా నమోదైనట్లు షోపియాన్ సీనియర్ ఎస్పీ తనుశ్రీ తెలిపారు. గ్రెనేడ్ విసిరి ఇద్దరు స్థానికేతర కారి్మకులను చంపిన ఘటనలో భట్ హస్తముందని చెప్పారు. -
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాలు... షోపియాన్ జిల్లా తుర్క్‌వాంగమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం అందడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. భద్రతా బలగాల మూమెంట్స్‌ను పసిగట్టిన తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు.(నిత్యం లక్షకు తక్కువ కాకుండా కేసులు) కాగా, సంఘటనా స్థలంలో రెండు ఏకే- 47 తుపాకులు, ఇన్సాస్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం రాష్ట్రీయ రైఫిల్ స్థావరానికి కూతవేటు దూరంలో ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా, పది రోజుల్లో ముష్కరుల ఏరివేతకు భద్రతా బలగాలు జరిపిన నాలుగో ఆపరేషన్ ఇది. ఈ నెలలో జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 19 మంది హతమయ్యారు. -
మరో ఎన్కౌంటర్, నలుగురు హతం
శ్రీనగర్: భారత భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని పింజారా ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పింజారా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమచారంతో భద్రతా బలగాలు అప్రమత్తయ్యాయి. ఆ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించాయి. దీంతో ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో భారత సైనికులు నలుగురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేశారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. కాగా, హతమైన టెర్రరిస్టుల వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఉగ్రవాద గ్రూపులవైపు యువత ఆకర్షితులు కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక షోపియాన్ జిల్లాలోని రేబన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ కమాండర్‌తో సహా ఐదురుగు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. (చదవండి: కార్లు వదిలి.. ఎడ్ల బండ్లు ఎక్కారు!) -
6 గంటల పోరు: హిజ్బుల్ కమాండర్ హతం!
శ్రీనగర్: భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టులు నక్కి ఉన్నారనే సమాచారంతో సోపియాన్ జిల్లాలోని రేబన్ ప్రాంతంలో భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ రేబన్ పేరుతో భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో.. టెర్రరిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య దాదాపు 6 గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. చివరికి భద్రత బలగాలు ఐదుగురు ట్రెరిస్టులను మట్టుబెట్టాయని రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేష్ కాలియ తెలిపారు. తొలుత ఉగ్రవాదులను లొంగిపోవాలని హెచ్చరించినా వారు వినలేదని దాంతో.. ఎన్కౌంటర్ తప్పలేదని కల్నల్ పేర్కొన్నారు. కాగా, మృతుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ ఫారూక్ అసద్ నల్లి, విదేశానికి చెందిన టెర్రరిస్టులు ఉన్నట్టు సమాచారం. ఘటనాస్థలంలో భారీగా తుపాకులు, మందుగుండు సామాగ్రిని సెక్యురిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో కొందరు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారని తెలిసింది. -
లోయలో బస్సు.. 11 మంది విద్యార్థుల దుర్మరణం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిపోవడంతో పదకొండు మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకెళితే.. పూంచ్ జిల్లాలో కంప్యూటర్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మొఘల్ రోడ్డు గుండా షోపియాన్ వెళ్తుండగా పీర్కి గాలి అనే చోటు వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా, ఏడుగురు గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో 9మంది అమ్మాయిలున్నారు. క్షతగాత్రులను అధికారులు షోపియాన్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలియజేస్తూ ఒక్కొక్కరికి ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించి తొందరగా కోలుకునేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. -
కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
శ్రీనగర్: ఉగ్రవాదుల ఏరివేతలో జమ్మూకశ్మీర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. శుక్రవారం జరిపిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ సన్నిహితుడైన లతీఫ్ దార్ అలియాస్ లతీఫ్ టైగర్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఘటన షోఫియాన్ జిల్లా ఇమాన్ సాహిబ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ‘భద్రతా దళాలు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండంగా అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. దీంతో అక్కడ ఉగ్రవాదులున్నారన్న అనుమానం బలపడింది. వారు తప్పించుకోకుండా కాల్పులు జరిపాం’ అని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మృతి చెందిన లతీఫ్ టైగర్ 2014లో ఉగ్రవాద సంస్థలో చేరగా, అతన్ని అరెస్టు చేశారని ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నట్లు తెలిపారు. లతీఫ్ టైగర్ బెయిల్ గడువు పూర్తయిన తర్వాత జిల్లా జడ్జి ముందు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వెళ్లకుండా హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్లో చేరాడని చెప్పారు. అలాగే లతీఫ్ పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడని, దక్షిణ కశ్మీర్‌లోని సర్పంచులను చంపిన కేసుల్లోనూ అతని హస్తముందని అన్నారు. ‘చివరగా మిగిలి ఉన్న ఉగ్రవాదుల్లో లతీఫ్ ఒకడు. లతీఫ్ మృతితో రియాజ్ నైకూ, జకీర్ మూసా వంటి ఉగ్రవాదులు మాత్రమే మిగిలి ఉన్నారు’ అని చెప్పారు. లతీఫ్ బుర్హాన్ వనీతో కలిసి ఉగ్రవాద గ్రూపు హిజ్బుల్ ముజాహిదీన్ పోస్టర్ బాయ్‌గా పనిచేశాడు. 2016 జూలైలో బుర్హాన్ మృతితో లతీఫ్ రియాజ్ నైకూ సహాయకుడిగా ఉన్నాడు. -
ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూలోని షోపియాన్ జిల్లాలోని ఇమామ్ సాహిబ్ ఏరియాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా పుల్వామా ఉగ్రదాడి, బాలకోట్లో జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ సైన్యం పదే పదే కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఉగ్రవాదులు కూడా కాల్పులకు తెగబడుతుండటంతో భారత సైన్యం వారికి ధీటుగా బదులిస్తూ కుట్రలను తిప్పికొడుతోంది. -
ఇంటి ముందే మహిళా పోలీసు హత్య
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తన నివాసం ముందే మహిళా పోలీసు ఆఫీసర్‌ను కాల్చి చంపారు. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని వెహ్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల... దక్షిణ శ్రీనగర్‌లో స్పెషల్ పోలీసు ఆఫీసర్‌గా ఖుష్బూ జాన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కొంతమంది ఉగ్రవాదులు ఆమె ఇంటి వద్దకు వచ్చారు. అనంతరం ఖుష్బూపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించామని, కానీ అప్పటికే ఖుష్బూ ప్రాణాలు కోల్పోయారని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. హేయమైన ఈ చర్చను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఖుష్బూ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ భద్రతా బలగాలు ఘటనాస్థలిని అదుపులోకి తీసుకుని.. హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీ నాయకుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఉగ్రవాదుల చర్యను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి, పోలీసులకు సానుభూతి తెలిపారు. కాగా ఉగ్రవాదులను ఏరిపారేయడానికి కశ్మీర్ పోలీసులు నెలవారీ జీతం ఇచ్చి కొంత మందిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. అయితే వారికి సరైన శిక్షణ ఇవ్వకుండా, ఆయుధాలు సరఫరా చేయకుండానే పని చేయాలంటూ ఆదేశాలు జారీచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడుల అనంతరం కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. A lady special police officer (SPO) was shot & killed outside her home in South Kashmir earlier today. I condemn this act of terror & extend my condolences to her family & all her J&K police colleagues. — Omar Abdullah (@OmarAbdullah) March 16, 2019 -
చిన్నారి పాప.. ఎందుకీ శిక్ష?
‘ఆమె చేసిన తప్పేంటి? లోకం తెలియని పసిపాప. ఆమెకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. నేను దేవుడిని కోరేది ఒక్కటే. దీనంతకీ కారణమైన వారిని కఠిన శిక్ష పడాలి’ ఓ తల్లి ఆవేదన ఇది. తన 20 నెలల కుమార్తె హిబా నిసార్ కంటిపాపను చిదిమేసిన వారిపై మార్సలా జాన్ వ్యక్తం చేసిన ఆక్రందన అందరినీ కదిలిస్తోంది. జమ్మూకశ్మీర్ శ్రీనగర్‌లోని శ్రీ మహరాజ హరిసింగ్ (ఎస్ఎంహచ్ఎస్) ఆస్పత్రి ఆప్తమాలజీ విభాగంలో నాలుగో నంబరు మంచంపై హిబా నిసార్ ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. ఏడుపు మాన్పించేందుకు ఆమె తల్లిదండ్రులు చాకెట్లు, స్వీట్లు ఇచ్చి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కంటి గాయం బాధను తట్టుకోలేక చిన్నారి రోదిస్తూనే ఉంది. షొపియాన్లో ఆదివారం జరిగిన ఘటనలో ఆమె కుడి కంటికి గాయమైంది. ఇంట్లో ఆడుకుంటున్న హిబా కంట్లోకి పెల్లెట్ దూసుకొచ్చింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శత్రచికిత్స చేసి పెల్లెట్‌ను తొలగించారు. అయితే పరిస్థితి విషమంగానే ఉందని, ఆమె కుడి కంటిచూపు పోయే ప్రమాదముందని డాక్టర్లు చెప్పడంతో హిబా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏం జరిగింది? షోపియాన్‌లో ఆదివారం తెల్లవారుజామున అల్లర్లు చెలరేగడంతో భద్రతా దళాలు, అల్లరి మూకలకు మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ ఘటనలో పౌరుడొకరు ప్రాణాలు కోల్పోగా, 50 మందిపైగా గాయపడ్డారు. ఇదే గొడవలు హిబా కంటి గాయానికి కారణమయ్యారు. తమ ఇంటి దీపం హిబాకు గాయమైన క్రమాన్ని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో ఆమె తల్లి జాన్ వివరించారు. ‘మేము ఇంట్లో ఉండగా బయట టియర్ గ్యాస్ కాల్పులు కొనసాగాయి. బయటంతా పొగ కమ్మేయడంతో ఐదేళ్ల నా కుమారుడు శ్వాస పీల్చుకుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో నా పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోవాలని అనుకున్నాను. వెంటనే తలుపులు తీశాను. ముగ్గురు వ్యక్తులు(భద్రతా సిబ్బంది) నేరుగా మాపైకి పెల్లెట్లను ప్రయోగించార’ని వెల్లడించారు. హిబా కుటుంబం షొపియాన్ జిల్లా బాత్గండ్ ప్రాంతంలోని కాప్రిన్ గ్రామంలో నివసిస్తోంది. ఆదివారం ఇక్కడే అల్లర్లు జరిగాయి. వైద్యుల సలహా మేరకు హిబాను షొపియాన్ నుంచి శ్రీనగర్‌కు తీసుకెళ్లారు. కొడుకు ఎలా ఉన్నాడో? తన పిల్లలను కాపాడుకునే క్రమంలో తన చేతికి కూడా గాయమైందని మార్సలా జాన్ తెలిపారు. హిబాను రక్షించేందుకు తన చేతిని ఆమె ముఖానికి అడ్డుగా పెట్టానని చెప్పారు. తన చేతి పక్క నుంచి పెల్లెట్ హిబా కంట్లోకి దూసుకుపోయిందన్నారు. తమ కొడుకు గురించి కూడా జాన్, ఆమె భర్త నిసార్ అహ్మద్ ఆందోళన చెందుతున్నారు. తన కుమారుడి దేహంలోకి పెల్లెట్లు దూసుకెళ్లాయేమో చూడాలని షొపియాన్లోని తన బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. పెల్లెట్ల బారి నుంచి కాపాడేందుకు తన కుమారుడిని మరోవైపుకు తోసేసినట్టు వెల్లడించారు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని దీనంగా చెప్పారు. హిబా ఆరోగ్య పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని ఎస్ఎంహచ్ఎస్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ‘ఆమె పరిస్థితి బాలేదు. చేతి వేళ్లు చూపించి చికిత్సకు చిన్నారి ఏవిధంగా స్పందిస్తుందో పరీక్షిస్తున్నాం. పెల్లెట్ కారణంగా కంటిలోని కార్నియా దెబ్బతింద’ని ఆప్తమాలజీ విభాగం డాక్టర్ ఒకరు వెల్లడించారు. చిన్నారి హిబా పడుతున్న యాతన ఆస్పత్రి సిబ్బందితో పాటు అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆమె కంటిచూపు కలకాలం ఉండాలని అందరూ ప్రార్థిస్తున్నారు. -
ఆ ఉగ్రవాద సంస్థలో ఎక్కువగా చేరుతున్నారు!
శ్రీనగర్: ఉగ్రవాదం వైపు అడుగులేస్తున్న కశ్మీర్ యువత సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గతేడాది 126 మంది వివిధ ఉగ్రవాద సంస్థల్లో చేరగా.. ఈ ఏడాది జూలై నాటికే 131 మంది అటు వైపు ఆకర్షితులైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. జూలై 31 వరకు సేకరించిన సమాచారం ప్రకారం 131 మంది ఉగ్రవాద సంస్థల్లో చేరగా.. వీరిలో సోఫియా జిల్లా నుంచే 35 మంది చేరినట్లు కశ్మీర్ అధికారులు వెల్లడించారు. సోఫియా, పుల్వామా, అనంత్‌నాగ్, కుల్గామ్, అవంతిపురా జిల్లాల యువత ఎక్కువగా ఉగ్ర భూతం వైపు మళ్లుతున్నారని.. ఇప్పటివరకు చేరిన 131 మందిలో ఈ 5 జిల్లాల నుంచే 100 మంది ఉన్నారని తెలిపారు. అల్ కాయిదాకు మద్దతు సంస్థగా చెబుతున్న అన్సార్ ఘజ్వాత్ ఉల్ హింద్ వైపు యువకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని.. దీనికి పుల్వామా జిల్లాకు చెందిన రషీద్ భట్ అలియాస్ జకీర్ ముసా నాయకత్వం వహిస్తున్నాడని చెప్పారు. పాకిస్తాన్ అనుకూల నినాదాలను పక్కనబెడుతూ ముసా ఇచ్చిన సరికొత్త ‘షరియత్ యా షహదత్ (ఇస్లాం చట్టాలను అమలు చేద్దాం లేదా మరణిద్దాం)’ నినాదం వైపు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నాని అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేసిన ముసా.. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన బుర్హన్ వనీ 2016లో హతమైన తర్వాత అక్కడి యువతను ఆకర్షించడంలో సఫలీకృతుడవుతున్నాడని అంటున్నారు. ముసా చదువులో, ఆటల్లో ముందుండేవాడని.. అంతరాష్ట్ర క్యారమ్ పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడాడని చెప్పారు. అన్సార్ ఘజ్వాత్ ఉల్ హింద్ సంస్థ ఇంకా మొదలవలేదని పోలీసులు చెబుతున్నా.. ఆ సంస్థకు అక్కడి యువతలో ఆదరణ మాత్రం పెరుగుతున్నట్లు అనుమానం. -
ఉగ్రవాదిగా మారిన ఐపీఎస్ సోదరుడు..!
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌కు చెందిన యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడానికి ఉగ్ర సంస్థలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఓ ఐపీఎస్ అధికారి సోదరుడు ఉగ్రవాదుల్లో చేరినట్టు వెలువడుతున్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. జమ్ముకశ్మీర్‌కు వెలుపల సేవల అందిస్తున్న ఆ ఐపీఎస్ అధికారి సోదరుడు షామ్సుల్ హక్ మే 26వ తేదీన అదృశ్యమయ్యాడు. దక్షిణ కశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లాకు చెందిన షామ్సుల్ ప్రభుత్వ కళాశాల నుంచి బీయూఎంస్ పట్టా పొందాడు. అయితే షామ్సుల్ అదృశ్యమైనప్పటి నుంచి ఇప్పటివరకు అతని గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అతను తీవ్రవాదం వైపు ఆకర్షితుడైనట్టు అనుమానాలు బలపడుతున్నాయి. కాగా షోఫియాన్ ఎస్ఎస్పీ మాత్రం దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. షామ్సుల్ మిస్సింగ్ గురించి కుటుంబసభ్యులు నుంచి ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. వారు ఫిర్యాదు చేస్తే తాము అధికారికంగా విచారించే అవకాశం ఉంటుందన్నారు. 2017లో 126 మంది యువకులు ఉగ్రవాదం వైపు అకర్షితులైనట్టు అధికారులు వెల్లడించారు. -
కశ్మీర్లో కిరాతకం
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు పెట్రేగిపోయారు. యువ సైనికాధికారిని అపహరించి కిరాతకంగా చంపేశారు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం ఆర్మీలో చేరిన లెఫ్టినెంట్ ర్యాంకు అధికారి ఉమర్ ఫయాజ్(22)ను తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. బుల్లెట్ గాయాలతో పడివున్న ఉమర్ మృతదేహాన్ని హెర్మయిన్ ప్రాంతంలో బుధవారం ఉదయం గుర్తించారు. కుల్గాం జిల్లాకు చెందిన ఉమర్ బంధువుల పెళ్లికి హాజరయేందుకు షోపియాన్ జిల్లాకు వచ్చారని పోలీసులు తెలిపారు. తీవ్రవాదులు మంగళవారం ఆయనను కిడ్నాప్ చేశారు. యువ సైనికాధికారిని అపహరించి తీవ్రవాదులు కాల్చి చంపడాన్ని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. తీవ్రవాదులు పిరికిపందల్లా దొంగదెబ్బ తీశారని పేర్కొన్నారు. లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ అరుదైన క్రీడాకారుడని వెల్లడించారు. కశ్మీర్‌లోయ తీవ్రవాదాన్ని అంతంచేసేందుకు తన ప్రాణాలను ఆయన ఫణంగా పెట్టారని కొనియాడారు. -
దుండగుడి కాల్పులు: కానిస్టేబుల్‌కి గాయాలు
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో కచ్డోరా ప్రాంతంలోని బ్యాంకు వద్ద శుక్రవారం దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ సర్తాజ్ అమ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. స్థానిక జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వద్ద దుండగుడు కాల్పులు జరపడంతో జనం పరుగులు తీశారు.