శ్రీనగర్: భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టులు నక్కి ఉన్నారనే సమాచారంతో సోపియాన్ జిల్లాలోని రేబన్ ప్రాంతంలో భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ రేబన్ పేరుతో భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో.. టెర్రరిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య దాదాపు 6 గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. చివరికి భద్రత బలగాలు ఐదుగురు ట్రెరిస్టులను మట్టుబెట్టాయని రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేష్ కాలియ తెలిపారు.
తొలుత ఉగ్రవాదులను లొంగిపోవాలని హెచ్చరించినా వారు వినలేదని దాంతో.. ఎన్‌కౌంటర్ తప్పలేదని కల్నల్ పేర్కొన్నారు. కాగా, మృతుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ ఫారూక్ అసద్ నల్లి, విదేశానికి చెందిన టెర్రరిస్టులు ఉన్నట్టు సమాచారం. ఘటనాస్థలంలో భారీగా తుపాకులు, మందుగుండు సామాగ్రిని సెక్యురిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎన్‌కౌంటర్ జరుగుతున్న సమయంలో కొందరు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment