
400 థియేటర్లు మూసివేత.. బాహుబలిపై ప్రభావం
సినిమాల పైరసీ నిర్మూలనకు కేరళ ప్రభుత్వం తక్షణమే చర్యలను చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ చేపట్టిన నిరసన కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది.
తిరువంతపురం:సినిమా పైరసీ నిర్మూలనకు కేరళ ప్రభుత్వం తక్షణమే చర్యలను చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ చేపట్టిన నిరసన కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. సినిమా పైరసీ నిర్మూలనకు ప్రభుత్వం తక్షణమే ఓ చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేస్తూ తమ నిరసన కార్యక్రమాన్ని తీవ్రతరం చేశారు. దీనిలో భాగంగానే గురు, శుక్ర వారాల్లో 400 థియేటర్లను మూసివేశారు.
రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లోని థియేటర్లు మూసి వేయడంతో అది కాస్త తెలుగులో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడి మళయాళంలోకి అనువదించబడ్డ బాహుబలి చిత్రంపై పడింది. దీంతో భారీ బడ్జెట్ వ్యయంతో రూపొందించబడ్డ బాహుబలి చిత్రం దేశ వ్యాప్తంగా విడుదలైనా.. కేరళలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో విడుదలకు నోచుకోలేదు. సినిమా పైరసీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై శనివారం కొచ్చి లో ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశం కానుంది. సినిమా విడుదలైన రెండు రోజులకే కొత్త సినిమాలు బయటకు వచ్చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ బ్రతకడం కష్టసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.