జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్‌వార్ జిల్లాలో చెలరేగిన మత ఘర్షణల ఫలితంగా, శనివారం కాశ్మీర్ లోయలో జనజీవనం స్తంభించిపోయింది.
జమ్మూ/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్‌వార్ జిల్లాలో చెలరేగిన మత ఘర్షణల ఫలితంగా, శనివారం కాశ్మీర్ లోయలో జనజీవనం స్తంభించిపోయింది. కిస్ట్‌వార్ జిల్లాలో శనివారం రెండోరోజూ కర్ఫ్యూ కొనసాగగా, హింసాత్మక సంఘటనలు చెలరేగడంతో జమ్మూ, రాజౌరీ జిల్లాల్లోనూ కర్ఫ్యూ విధించారు. బంద్ ఫలితంగా కాశ్మీర్ లోయ ప్రాంతంలో విద్యా, వ్యాపార సంస్థలు మూతపడగా, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిరసనల్లో పదిమంది గాయపడ్డారు. కిష్ట్‌వార్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. జమ్మూ నగరంలో పోలీసులు, నిరసనకారుల పరస్పర దాడుల్లో ఏడుగురు గాయపడ్డారు. జమ్మూతో పాటు పరిసర జిల్లాల్లో బంద్ పాటించడంతో పాటు భారీ స్థాయిలో నిరసనలు జరిగాయి. కిష్ట్‌వార్ జిల్లాలోని గులాబ్‌గఢ్ ప్రాంతంలో శనివారం కొందరు దుకాణాలకు నిప్పుపెట్టారు.
కాగా, జమ్మూ బంద్‌ను నిరసనకారులు మరో 48 గంటలకు పొడిగించారు. కిష్ట్‌వార్ జిల్లాలో శుక్రవారం జరిగిన మత ఘర్షణల్లో ఇద్దరు మరణించగా, ఇరవై మందికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈద్ ప్రార్థనల తర్వాత కొందరు దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతో ఘర్షణలు మొదలయ్యాయి. దీనికి నిరసనగా బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగదళ్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో జమ్మూలో శనివారం ర్యాలీ నిర్వహించారు. సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకోవడంతో, వారిపై రాళ్లు రువ్వారు. దీంతో సీఆర్పీఎఫ్ జవాన్లు లాఠీలు ఝుళిపించి, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో జమ్మూ ఎస్పీ సహా ఏడుగురు గాయపడ్డారు.మరోవైపు, హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ గీలానీ ఆదివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.