న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో భారత కుబేరులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర సర్కారు స్వదేశంలో పోగుబడిన నల్లధనంపై కూడా కసరత్తులు ఆరంభించింది. దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికితీయాలని ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారులను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆదేశించారు. ‘‘విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అలాగే, దేశంలోపల దాగి ఉన్న నల్లధనాన్ని కూడా వెలికి తీసేందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కషి చేయాలి’’ అంటూ జైట్లీ పేర్కొన్నారు.
ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారుల 30వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విధించిన లక్ష్యాలను అధిగమిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.7,36,221 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆదాయపన్ను అధికారులు అత్యున్నత విలువలతో పనిచేయాల్సి ఉంటుందన్నారు.