కాంగ్రెస్ పార్టీ కలవరపడదు: చిదంబరం
బ్లాక్‌మనీ జాబితా బయటపడితే కాంగ్రెస్‌కే ఇబ్బందన్న జైట్లీ వ్యాఖ్యలపై చిదంబరం
ఒకవేళ పార్టీ నేత ఉంటే ఆ వ్యక్తే ఇబ్బందిపడతారు
న్యూఢిల్లీ: విదేశాల్లోని బ్యాంకుల్లో నల్లధనం దాచిన భారతీయుల జాబితా బయటపడితే కాంగ్రెస్ పార్టీకి కలవరపాటు తప్పదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం శుక్రవారం కొట్టిపారేశారు. ఆ జాబితాలో తమ పార్టీకి చెందిన నేత, నాటి యూపీఏ మంత్రి ఉండొచ్చన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. అయితే ఒకవేళ నిజంగా తమ పార్టీ నేత పేరు బయటపడినా అది ఆ వ్యక్తికే ఇబ్బంది కలిగిస్తుంది తప్ప పార్టీకి కాదని స్పష్టం చేశారు. ‘‘ఇవన్నీ (నల్లధనం దాచుకోవడం) వ్యక్తిగత స్థాయిలో జరిగిన చట్టాల ఉల్లంఘనలు. ఒకవేళ నల్ల కుబేరుల పేర్లు బహిర్గతమైతే ఆ వ్యక్తే ఇబ్బంది పడతారు. ఇందులో పార్టీ కలవరానికి గురికావాల్సినది ఏముం ది? అతనేమీ పార్టీ ఖాతా సొమ్మును దాచలేదు కదా. అలాగే అతన్ని నల్లధనం దాచుకోవాలని పార్టీ చెప్పలేదుగా’’ అని ఎన్డీటీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం పేర్కొన్నారు. నల్లధనం దాచిన వారి పేర్లను వెల్లడించలేమంటూ మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించడం ఈ విషయంలో బీజేపీ తీసుకున్న గత వైఖరి నుంచి వెనకడుగు వేయడమేనని చిదంబరం విమర్శించారు.
నల్ల కుబేరుల పేర్ల బహిర్గతం సాధ్యంకాదంటూ తమ పార్టీ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపినప్పుడు బీజేపీ తమను విమర్శించిందని గుర్తుచేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికలతోపాటు ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలవడంతో క్యాడర్‌లో ఆత్మస్థైర్యం తగ్గిందన్న మాట వాస్తవమేనని చిదంబరం అంగీకరించారు. అయితే అంతమాత్రాన క్యాడర్‌లో ఉత్సాహం నింపడం ఇప్పట్లో సాధ్యం కాదన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ఎక్కువ సభల్లో మాట్లాడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడు కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.