ఎంత పనిచేశావ్.. సుబ్రహ్మణ్యం!!
అర్ధంతరంగా చైనా నుంచి తిరిగొచ్చిన జైట్లీ..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన చైనా పర్యటనను ఒకరోజు ముందే ముగించుకొని స్వదేశం చేరుకున్నారు. సొంత పార్టీ బీజేపీకి చెందిన ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తనపై, తన మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులపై ఆరోపణల దాడితో విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆయన అర్ధంతరంగా చైనా పర్యటన ముగించుకొని భారత్ వచ్చారు.
నాలుగు రోజుల పర్యటన కోసం జైట్లీ ఈ నెల 24న చైనా వెళ్లారు. ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన తన షెడ్యూల్‌లోని సమావేశాలన్నింటినీ హడావిడిగా చేపట్టి.. ఒకరోజు ముందే స్వదేశం చేరారు. చైనా ఆర్థిక మంత్రి లౌ జీవీ, చైనా జాతీయ అభివృద్ధి, సంస్కరణల కమిషన్ చైర్మన్ జు షావోషితో జైట్లీ నిజానికి సోమవారం సమావేశం కావాల్సి ఉంది. అయితే ఆదివారం రాత్రే భారత్ చేరుకునే ఉద్దేశంతో ఆయన అదే రోజు ఈ ఇద్దరితో సమావేశమయ్యారు.
కారణాలేమిటి?
ఆర్థికమంత్రి జైట్లీ అర్ధంతరంగా చైనా పర్యటన ముగించుకొని భారత్ తిరిగి రావడానికి సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న ఆరోపణలే కారణమని వినిపిస్తోంది. తీవ్ర ఆరోపణలతో సొంత పార్టీలోనే ప్రకంపనలు రేపుతున్న స్వామి తీరుతో జైట్లీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే, జైట్లీ సోమవారం ప్రధాని నరేంద్రమోదీతో జరిపిన భేటీలో మాత్రం స్వామి ఆరోపణల అంశం ప్రస్తావనకు రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
నోరుమూసుకో స్వామీ..!
కాగా జైట్లీపై ఆరోపణలతో చెలరేగిపోతున్న సుబ్రహ్మణ్య స్వామిపై బీజేపీ అధినాయకత్వం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. జైట్లీ, ఆర్థికశాఖ విషయంలో స్వామిని నోరుమెదపకుండా ఉండాలని బీజేపీ అధినాయకత్వం ఘాటుగా సూచించినట్టు తెలిసింది. పార్టీకి ఉపయోగపడతారని గత ఏప్రిల్‌లో ఫైర్‌బ్రాండ్ నాయకుడు స్వామిని బీజేపీ రాజ్యసభకు ఎన్నిక చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఎంపీ అయిన తర్వాత స్వామి మాత్రం సొంత పార్టీని ఇరకాటంలో పెట్టేలా.. జైట్లీ లక్ష్యంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.