షీలాదీక్షిత్‌కు లైట్ షాక్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్‌ను సమస్యలు చుట్టుముడుతున్నారుు. ఓ పక్క పార్టీ అధిష్టానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే, మరోపక్క కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఆమెను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. షీలాదీక్షిత్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని ఎన్నికల సమయంలో ఆప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆప్ ప్రభుత్వం.. 2010 కామన్వెల్త్ క్రీడల సమయంలో ఫ్యాన్సీ వీధిదీపాల కొనుగోలులో అవినీతి జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ గురువారం దర్యాప్తు ప్రారంభించింది.
ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేసింది. అరుుతే ఇందులో షీలా దీక్షిత్ పేరు లేదని, తదుపరి దశలో చేర్చే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ మద్దతుతో మనుగడ సాగిస్తుండటం వల్లే ఆప్ సర్కార్ షీలాదీక్షిత్‌పై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతోందని బీజేపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సమావేశమైన ఢిల్లీ కేబినెట్.. కామన్వెల్త్ క్రీడల సమయంలో వీధిదీపాల కొనుగోలు వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు జరపాల్సిందిగా ఏసీబీని ఆదేశించినట్లు పీడ బ్ల్యూడీ మంత్రి మనీష్ సిసోడియా భేటీ అనంతరం విలేకరులకు చెప్పారు. వీధిదీపాల కొనుగోలులో ప్రభుత్వానికి రూ. 31 కోట్ల నష్టం జరిగిందని అప్పట్లో దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయని అన్నారు. దీనిలో ఎమ్సీడీ అధికారుల హస్తం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయని, ఈ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశించామని మనీష్ చెప్పారు.
ఇదీ నేపథ్యం
- కామన్వెల్త్ క్రీడల సమయంలో ఇందిరాగాంధీ స్టేడియం, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఆకర్షణీయమైన వీధిదీపాలను అమర్చారు. అయితే ఈ లైట్లు కాషాయ రంగులో ఉండడం దీక్షిత్‌కు నచ్చలేదు. వాటిని మార్చాలన్న ఆమె ఆదేశాలతో పీడబ్ల్యూడీ ఆదరాబాదరాగా కొత్త దీపాలు ఏర్పాటు చేసింది.
- కాంట్రాక్టు నియమాలను పక్కనబెట్టి సౌదీ అరేబియాకు చెందిన స్పేస్ ఏజ్ కంపెనీ నుంచి తెప్పించిన స్ట్రీట్ లైట్లను అమర్చారని, బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన స్పేస్ ఏజ్ కంపెనీని షీలాదీక్షిత్ జోక్యంతోనే బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించారనేది ఆ ఆరోపణల సారాంశం.
- సీఎం హోదాలో షీలా ఈ ప్రాజెక్టుపై సంతకం చేశారు. ఐదారు వేల రూపాయలకు లభించే లైట్లను ప్రభుత్వం రూ.25,000-రూ.32,000 వెచ్చించి కొనుగోలు చేసిందని ఈ క్రీడల ఏర్పాట్లపై దర్యాప్తు జరిపిన కాగ్ పేర్కొంది.. దీనివల్ల ప్రభుత్వానికి రూ.31 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది.
- 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు జరిపించాలని ఆప్ ప్రభుత్వం గురువారం లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు సిఫారసు చేసింది. సిట్ విచారణలో భాగంగా అల్లర్లకు సంబంధించి మూసేసిన కేసులను, ఆచూకీ తెలియదని పేర్కొన్న కేసులను తిరగదోడి చార్జిషీట్లు దాఖలు చేస్తామని సిసోడియూ చెప్పారు.
- మరోవైపు కాంగ్రెస్ హయూంలో ప్రభుత్వ ప్రకటనల వ్యవహారంపై కూడా దర్యాప్తుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్టు సమాచారం.