
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ
మూడు రోజులపాటు వర్షాకాల సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్నాయి. తొలిసారిగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇలా ప్రశ్నోత్తరాలు చేపట్టడం ఇదే ప్రథమం. సమావేశాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగుతాయి. మధ్యలో రెండుగంటల విరామం ఉంటుంది.
సమావేశాల నేపథ్యంలో అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం వ్యూహప్రతివ్యూహాలతో సంసిద్ధమయ్యాయి. ప్రజాసమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైన రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మరోవైపు గత బడ్జెట్ సమావేశాల్లో మాదిరిగానే ఈసారీ ప్రజాసమస్యలు సభలో చర్చకు రాకుండా చేసేందుకు అధికారపక్షం సకల ప్రయత్నాలు చేస్తోంది.
చర్చించే అంశాలు బీఏసీలో ఖరారు: ప్రస్తుత సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల్ని గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ ఖరారు చేస్తుంది. స్పీకర్ కోడె ల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీలు తమ పార్టీల తరఫున చర్చించాల్సిన అంశాల్ని ప్రతిపాదించనున్నాయి. సమావేశాల్ని మూడు రోజులపాటు ఐదు లేదా ఆరుపూటలు నిర్వహించి పూర్తిచేయాలని ప్రభుత్వం చూడటంపట్ల వైఎస్సార్‌సీపీతోపాటు మిత్రపక్షం బీజేపీ కూడా అసంతృప్తిగా ఉంది. పదిరోజులు జరపాలని బీఏసీలో బీజేపీ లేఖ ఇవ్వనుంది.
సీఎస్, డీజీపీలతో స్పీకర్ భేటీ: శాసనసభ, శాసనమండలి నిర్వహణపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి బుధవారం వేర్వేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్, డీజీపీ ఎన్.సాంబశివరావు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిలతో సమావేశమయ్యారు. సమావేశాలు అర్థవంతంగా జరిగేందుకు అధికారులు మరింత సమర్థంగా పనిచేయటంతోపాటు సభ్యులకు, సభకవసరమైన సమాచారమందించటంలో అలసత్వం ప్రదర్శించొద్దని సీఎస్‌తో భేటీలో స్పీకర్ స్పష్టంచేశారు.