మళ్లీ ఏటీఎం చార్జీల బాదుడు!
ముంబై: బ్యాంకులు ఏటీఎం చార్జీల బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిచ్చింది. తమ ఏటీఎం కార్యకలాపాలు నష్టాల్లో నడుస్తున్నాయని... కస్టమర్ల నుంచి లావాదేవీల ఫీజును వసూలు చేయకతప్పదని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. అదేవిధంగా ఏటీఎం నెట్‌వర్క్ విస్తరణకు వాణిజ్యపరమైన లాభదాయక విధానం చాలా అవసరమని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ‘మేం అందించే సేవలకుగాను వినియోగదారుల నుంచి కొంత ఫీజు వసూలు చేయాల్సిన అవసరం ఉంది. ఇరువురికీ ఆమోదయోగ్యమైన పరిస్థితి ఉండాలి. వాణిజ్యపరంగా లాభసాటి విధానం ఉండాలనేదే మా వాదన. ఈ కార్యకలాపాలపై నష్టాలు పెరుగుతూపోతే మావల్లకాదు’ అని ఒక వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఎస్‌బీఐ చీఫ్ అభిప్రాయపడ్డారు.
విస్తరించాలంటే చార్జీల విధింపే మార్గం...
ఎస్‌బీఐకి దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఏటీఎంలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ చివరినాటికి 32,777 ఏటీఎంలు ఎస్‌బీఐ నెట్‌వర్క్‌లో ఉన్నట్లు అంచనా. వీటిని మరింత పెంచే ప్రణాళికల్లో బ్యాంక్ ఉంది. ‘ఎల్లకాలం ఏటీఎంపై మేం నష్టాలను భరించలేం. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా ఏటీఎంలను మూసేయక తప్పదు. అందుకు మేం సిద్ధమే. అయితే, దీనికి సరైన సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుంది’ అని ఆమె చెప్పారు. బెంగళూరులో ఒక ఏటీఎంలో మహిళపై దుండగుడు దాడిచేసిన ఘటన నేపథ్యంలో ఏటీఎంలలో భద్రత పెంపునకు వీలుగా సేవలపై చార్జీలు విధించాలంటూ బ్యాంకింగ్ వర్గాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎస్‌బీఐ చీఫ్ స్పందిస్తూ... తమ సొంత కస్టమర్లపైనా లావాదేవీల ఫీజు వసూలు చేసేందుకు తాము సుముఖమేనని పేర్కొన్నారు. ఏటీఎంల నెట్‌వర్క్‌ను విస్తరించాలంటే లాభదాయక విధానం చాలా అవసరమన్నారు. కాగా, ఈ ఏడాది మార్చిచివరికల్లా ప్రతి ప్రభుత్వ రంగ బ్యాంక్ కూడా తమ బ్రాంచ్‌కు ఆనుకుని ఒక ఏటీఎంను తప్పకుండా ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం విదితమే.
ఆ ప్రతిపాదనతో 5 దాటితే షాకే...!
ప్రస్తుతం బ్యాంకులు తమ ఖాతాదారులకు సొంత ఏటీఎంలలో అపరిమితంగా లావాదేవీలకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికొస్తే... నెలకు ఐదుసార్లు మాత్రమే ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదికూడా గరిష్ట నగదు విత్‌డ్రా పరిమితి రూ.10 వేలు మాత్రమే. అయితే, ఈ సేవలకు గాను ఖాతాదారుడికి చెందిన బ్యాంక్... ఇతర బ్యాంక్‌కు ఒక్కో లావాదేవీకి రూ15 చొప్పున(పన్నులతో కలిపి దాదాపు రూ.17) చొప్పున చెల్లించాల్సి వస్తోంది. అయితే, పరిమితి దాటితే ఆ భారం నేరుగా ఖాతాదారుడిపైనే పడుతోంది. ఇప్పుడు ఐబీఏ ప్రతిపాదన గనుక అమల్లోకి వస్తే... ఖాతాఉన్న బ్యాంక్, ఇతర బ్యాంకులనే తేడాలేకుండా ఐదు ఉచిత లావాదేవీల తర్వాత ప్రతి లావాదేవీపైనా చార్జీ పడుతుంది. గతేడాది మార్చి చివరినాటికి దేశవ్యాప్తంగా 1.4 లక్షల ఏటీఎంలు ఉన్నట్లు అంచనా. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 72,340. ప్రతి ఏటీఎం సెంటర్‌లో సీసీటీవీ కెమెరా, ఆయుధంతో కూడిన సెక్యూరిటీ గార్డును పెట్టాలంటే ఒక్కో ఏటీఎంకు దాదాపు రూ.40 వేల అధిక వ్యయం అవుతుందనేది ఐబీఏ అంచనా.
ఉచిత లావాదేవీల తగ్గింపును పరిశీలిస్తున్నాం: ఆర్‌బీఐ
ఏటీఎంలలో ఉచిత లావాదేవీల సంఖ్యను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ పేర్కొంది. ఒక్కో ఖాతాదారుడికి నెలకు మొత్తం ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని(సొంత, ఇతర బ్యాంకులతోకలిపి) 5కు తగ్గించాలంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ఇటీవలే ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేయడం తెలిసిందే. ఉచిత పరిమితి దాటితే ఒక్కో లావాదేవీపై రూ.20 చొప్పున చార్జీ విధించేలా ఇప్పుడున్న నిబంధనలనే ఆర్‌బీఐ కొనసాగించాలని కూడా ఐబీఏ తన సూచనల్లో పేర్కొంది. తాజా భద్రత పెంపు చర్యలతో బ్యాంకులపై నెలకు రూ.400 కోట్ల భారం పడుతోందనేది ఐబీఏ వాదన. ‘ఏటీఎంల విషయంలో ఐబీఏ సూచనల(నెలకు మొత్తం ఉచిత లావాదేవీలను 5కు తగ్గించడం)ను మేం పరిశీలించనున్నాం. ఇతర ప్రతిపాదనలు కూడా మాకు అందాయి. ప్రధానంగా ప్రజలు నగదు రూపంలో మరీ ఎక్కువగా లావాదేవీలు జరుపుతున్నారు. దీనివల్ల నిర్వహణ వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుంది. అంతేకాకుండా మనీలాండరింగ్ రిస్క్‌లు కూడా పెరుగుతున్నాయి. దీన్ని తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్ పేర్కొన్నారు. అయితే, ఐబీఏ డిమాండ్ చాలా తెలివితక్కువ, అసంబద్ధమైనదంటూ ఆర్‌బీఐ మరో డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి ఇటీవలే వ్యాఖ్యానించడం గమనార్హం. సొంత ఖాతాదారులపైనే ఏటీఎం చార్జీల విధింపు ఎక్కడా ఉండదని, బ్యాంకులు తమ పనితీరు మెరుగుదలపై దృష్టిసారించాలని సూచించారు కూడా.