
చంపేస్తా... నీ పని అయిపోయినట్లే!
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వారం కిందట ఓ ఫ్లాట్ నుంచి బిగ్గరగా అరుపులు వినిపించాయి. భయంతో కూడిన అరుపులు ‘నేను నిన్ను చంపేస్తా. నీ పని అయిపోయింది. చావు... చావు’ అని గట్టిగా కేకలు వినిపించేసరికి అపార్ట్‌మెంటులోని ఇరుగుపొరుగు ఫ్లాట్‌లలో నివసించే వారు కంగారుపడిపోయారు. ఏదో ఘోరం జరుగుతోందనుకొని... పోలీసులకు ఫోన్ కొట్టారు. భార్యాభర్తలో, ప్రేమికులో గొడవ పడుతున్నారని... చంపేస్తాననే కేకలు వినపడుతున్నాయని ఫిర్యాదు చేశారు.
దాంతో ఆగమేఘాల మీద పోలీసులు వచ్చేశారు. సదరు అరుపులు వినిపించిన ఫ్లాట్‌ను చుట్టుముట్టి... డోర్ కొట్టారు. 30లలో ఉన్న వ్యక్తి తలుపుతీసి భారీ సంఖ్యలో ఉన్న పోలీసులను చూసి నివ్వెరపోయాడు. పోలీసులు ఫ్లాట్‌లో వెతుకుతూ... ఎక్కడ నీ భార్య లేక గర్ల్‌ఫ్రెండ్ ఎక్కడ? అంటూ గద్దించారు. వెర్రిమొహం వేసిన అతను... ‘నాకెవరూ లేరు. నేను ఒంటరిగా ఉంటాను’ అంటూ బదులిచ్చాడు. మరి చంపేస్తాననే కేకలేంటి? అని పోలీసులు అడగ్గా.... అప్పుడు విషయం అర్థమైంది మనోడికి.
‘ఓ అదా... పెద్ద సాలీడు ఫ్లాట్‌లో చొరబడింది. దాన్ని చంపుదామని స్ప్రేతో వెంటపడ్డాను. ఆ సందర్భంగా అన్నాను’ అంటూ అసలు విషయం చెప్పాడు. మరి భయంతో కూడిన అరుపులు వినిపించాయి అని అడగ్గా... మనోడు మెలికలు తిరిగిపోతూ ‘సారీ... నాకు సాలీడు అంటే విపరీతమైన భయం. దాంతో మొదట్లో భయంతో అరిచాను. తర్వాత చంపేస్తానంటూ దాని వెంటపడ్డాను’ అని మెలికలు తిరిగిపోతూ చెప్పాడట. ఓరి నీ దుంపతెగ... అనవసరంగా మా సమయం అంతా వృథా చేశావంటూ పోలీసులు ఓ నిట్టూర్పు విడిచి వెళ్లిపోయారట.