
ఉద్యోగాల కోతపై ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక
ఆటోమేషన్ కారణంగా భారతదేశంలో భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోనున్నట్టు ప్రపంచబ్యాంక్ హెచ్చరిస్తోంది. దాదాపు 69శాతం ఉద్యోగలకు కోతపడుతుందని తెలిపింది.
వాషింగ్టన్: ఆటోమేషన్ కారణంగా భారతదేశంలో భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోనున్నట్టు ప్రపంచబ్యాంక్ హెచ్చరిస్తోంది. దాదాపు 69శాతం ఉద్యోగలకు కోతపడుతుందని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో టెక్నాలజీ సంప్రదాయ ఆర్థిక మార్గం నమూనాకు విఘాతం కలిగిస్తుందని ప్రపంచ బ్యాంకు పరిశోధనలో తేలింది. అలాగే చైనా, ఇథియోపియా 77శాతం ఉద్యోగాలు నష్టపోనున్నాయని అంచనా వేసింది. మొత్తానికి ఆటోమేషన్ ప్రభావంతో 85 శాతం ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని స్పష్టం చేసింది.
తీవ్రమైన పేదరికం పై కిమ్ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ లో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత మూలంగా ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ దాని ప్రభావాలను అంచనా వేస్తున్నా మన్నారు. అభివృద్ధిని ప్రోత్సహించడానికి గాను తమ పెట్టుబడుల ప్రోత్సాహం కొనసాగుతుందన్న ఆయన దేశాల భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన వివిధ రకాల ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా ఆలోచిస్తున్నామన్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పూర్తి స్థాయి పారిశ్రామికీకరణ సాధ్యం కాకపోవచ్చనీ, వ్యవసాయ ఉత్పాదకత పెంచడంద్వారా సంప్రదాయ ఆర్థికవ్యవస్థ వృద్ధికి మార్గం సుగమవుతుందనీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
యాంత్రీకరణ, టెక్నాలజీ కారణంగా సంప్రదాయ పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతిందనీ, మాన్యువల్ ఉద్యోగాలు నష్టపోతున్నామనీ, ఈ ధోరణి అమెరికాకు పరిమితం కాదనీ, ప్రపంచ దేశాల్లో ప్రతిచోటా ప్రజలు దీనికి ప్రభావితమవుతున్నారని కిమ్ చెప్పారు. దీనిపై చైనాలో జరిగిన జీ 20 సమావేశంలో ప్రపంచ నాయకులందరూ ఆందోళన వ్యక్తం చేశారన్నారు. అయితే ఉమ్మడి వాణిజ్యం ద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్దికోసం ప్రపంచ దేశాల సమిష్టి కృషితో కొంత పురోగతి సాధించిన ప్పటికీ తీవ్రమైన ఎదురుగాలి తప్పడం లేదని కిమ్ వ్యాఖ్యానించారు. సరుకుల ధరల క్షీణత ప్రపంచ వాణిజ్యంలో మందగింపు కారణమవుతోందన్నారు. ఇది చారిత్రాత్మక స్థాయిలో ఉందని కిమ్ పేర్కొన్నారు.