
యాక్సిస్ బ్యాంక్ సంక్రాంతి కానుక
ముంబై: దేశీయ మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు సంక్రాంతి పండుగ కానుకను అందించింది. గృహ రుణాలు సహా రుణాలపై ఎంసీఎల్ ఆర్ ను 0.70 శాతం వరకు తగ్గించినట్టు శుక్రవారం ప్రకటించింది. వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న బ్యాంక్ లెండింగ్ రేటులో 70 బేసిస్ పాయింట్ల కోత పెట్టింది. వార్షిక రుణ రేటులో 0.65 నుంచి 8.25 శాతందాకా తగ్గించింది. ఈ తగ్గింపురేట్లు జనవరి 18నుంచి అమల్లోకి రానున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. శిఖా శర్మ నేతృత్వంలోని యాక్సిస్ బ్యాంక్ నోట్లు రద్దు అనంతరం బ్యాంకు లో అధిక లిక్విడిటీ తో ఈ నిర్ణయం తీసుకుంది
కాగా ఇప్పటికే డీమానిటైజేషన్ అనంతరం మేజర్ బ్యాంకులతో సహా ఇతర బ్యాంకులన్నీ తమ ఎంసీఎల్ఆర్ రేటును తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన బ్యాంక్ ఎస్సెట్స్ అండ్ లయబిలిటీ కమిటీ సమావేశంలో తగ్గింపు రేటు అమలుకు ఆమోదం లభించింది.