బాబు గెస్ట్‌హౌస్ ఖర్చు రూ.వంద కోట్లు
* పనులన్నీ నామినేషన్ విధానంలోనే..
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసుకోనున్న అతిథిగృహ ఖర్చుకు రూ.వంద కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పా టు చేసుకున్న సీఎం... రాజధాని ప్రాంతంలోనూ ఓ అతిథిగృహం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు గాను సంబంధిత పనులన్నీ నామినేషన్ విధానంపై చేపట్టేందుకు నిర్ణయించడం ఆరోపణలకు తావిస్తోంది.
లింగమనేని గెస్ట్‌హౌసే అతిథిగృహం
కరకట్టను ఆనుకుని రివర్‌బెడ్‌లో ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ను సీఎం అతిథిగృహంగా మార్చనున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మంగళవారం లింగమనేని గెస్ట్‌హౌస్‌ను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ గెస్ట్‌హౌస్‌కు వెళ్లేందుకు రోడ్లకే అధికారులు రూ.60 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. నాలుగు రోడ్లను జలవనరుల శాఖ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖలు చేపట్టనున్నాయి.
గెస్ట్‌హౌస్ వద్ద విద్యుత్తు సబ్‌స్టేషన్‌కు రూ.5 కోట్లు, సెల్‌టవర్ల నిర్మాణానికి రూ.కోటిన్నర, సీఎం భద్రత కోసం కృష్ణానదిలో బోట్లలో భద్రత పర్యవేక్షణకు రూ.10 కోట్లు, పోలీస్ ఔట్‌పోస్టుల నిర్మాణానికి రూ.కోటి, విద్యుత్తు లైన్లకు రూ.5 కోట్లు, గెస్ట్‌హౌస్ ఆధునీకీకరణకు సుమారు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు రూపొందిం చారు. మొత్తం రూ.వంద కోట్లకు పైగానే గెస్ట్‌హౌస్ పనులు చేపట్టనున్నారు. నామినేషన్ విధానంలో కేటాయిస్తున్నారు.