
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల మూడో దశకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్న మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 19 చివరి తేదీ.
అలాగే మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నియోజకవర్గంలో వాయిదా పడిన ఎన్నికల కోసం విడిగా మరొక నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. బేతుల్ నియోజకవర్గంలో రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగాల్సి ఉండగా ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఎన్నికలు వాయిదా వేశారు. గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర పార్టీ అభ్యర్థి ఎన్నికలకు ముందు మరణిస్తే ఆ పార్టీ తాజా అభ్యర్థిని గుర్తించి రంగంలోకి దింపేందు కోసం ఎన్నికలను వాయిదా వేస్తారు.
మూడవ దశలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.