
చిన్నారిని బలిగొన్న కుక్కలు
* పీక్కుతిన్న శునకాలు..
* విశాఖలో దారుణం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో ఏడాదిన్నర వయసున్న బుడతడ్ని కుక్కలు పీక్కుతిన్నాయి. తల్లికి అంతులేని శోకాన్ని మిగిల్చాయి. ఈ హృద య విదారక సంఘటన విశాఖ బీచ్ రోడ్డులో శుక్రవారం జరిగింది.
అలాగే ఉండనిచ్చినా ప్రాణాలు దక్కేవి...
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన గీరి పోతయ్య, రమణమ్మ దంపతులు జీవనోపాధి నిమిత్తం ఆరేళ్లక్రితం విశాఖ వచ్చారు. నగరంలోని బీచ్‌రోడ్డుకు సమీపంలో డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి గెస్ట్‌హౌస్‌కు సమీపంలోని ఎర్రదిబ్బల వద్ద స్థలానికి పోతయ్య వాచ్‌మెన్‌గా ఉంటున్నాడు. అక్కడే కుటుంబంతోసహా జీవిస్తున్నాడు. పోతయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. శుక్రవారం సాయంత్రం రమణమ్మ తాముండే షెడ్డులో చిన్న కుమారుడు శివకేశవ్(20 నెలల వయసు)ను ఉంచి దుస్తులు శుభ్రపర చడానికి బయటికొచ్చిం ది.
కాసేపటికి శివకేశవ్ కూడా వచ్చినా ఆమె వారించి పంపించేసింది. అలా తల్లి తన చిన్నారిని ఇంట్లోకి పంపిన కొద్దిసేపటికే ఘోరం జరిగిపోయింది. వీధికుక్కలు ఇం ట్లోకి వెళ్లి చిన్నారిపై దాడి చేశాయి. బాబును నోటకరుచుకుని ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చి పీక్కుతిన్నాయి. కుక్కల అలికిడి విన్న తల్లి వెళ్లేసరికి ఐదు వీధికుక్కలు కొడుకును చీల్చుకుతింటున్న దృశ్యం కనిపించింది. ఆమె కేకలకు స్థానికులు వచ్చి కుక్కల్ని చెదరగొట్టారు. కొనఊపిరితో ఉన్న చిన్నారిని కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. బాలుని శరీరంపై దాదాపు 200 వరకు గాట్లు ఉన్నట్టు డాక్టర్ అరుణ తెలిపారు.