బ్యాంకింగ్ లాభాల్లో అద్భుతాలు లేవు!
బీఎంఐ రిసెర్చ్ నివేదిక
రుణ రేట్లు తగ్గడం, మొండి బకాయిల తీవ్రతల ప్రస్తావన
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో భారీ లాభదాయకత అవకాశాలు కనిపించడంలేదని బీఎంఐ రిసెర్చ్ నివేదిక ఒకటి పేర్కొంది. ఫిచ్ గ్రూప్‌కు చెందిన ఈ పరిశోధనా విభాగం.. బుధవారం తాజా నివేదికను విడుదల చేసింది. మొండి బకాయిల భారం, అలాగే రుణ రేట్లు తగ్గించాల్సిన పరిస్థితులు బ్యాంకింగ్ లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు పేర్కొంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది వరకూ ఈ రంగం ఫండమెంటల్స్‌కు సంబంధించి అంశాలను ‘నెగిటివ్ అవుట్‌లుక్’లో ఉంచుతున్నట్లు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రుణ రేటు తగ్గింపు ఒత్తిడి నేపథ్యంలో భారత బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...
బేస్ రేటుకు సంబంధించి రానున్న ప్రతిపాదనలు బ్యాంకుల లాభదాయక పరిస్థితులను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది. {పభుత్వ రంగ బ్యాంకులతో పోల్చిచూస్తే... ప్రైవేటు రంగం బ్యాంకుల పనితీరు బాగుంది. చక్కటి నిర్వహణా తీరు, పటిష్ట మూలధన పరిస్థితులు, అధిక ఆదాయాలు దీనికి కారణం. బ్యాంకుల మొండిబకాయిల సమస్యలు ఇప్పట్లో పరిష్కారమయ్యేట్లు కనిపించడం లేదు. పలు కంపెనీల ఆదాయాలు ప్రతికూలంగా ఉండడం బ్యాంకింగ్‌కు రానున్న కాలంలో ఎదురుదెబ్బే.వాణిజ్య రంగంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి ఇప్పట్లో మెరుగుపడేలా లేదు.