ట్రంప్ కు ఒబామా షాక్
తాను అమెరికా అధ్యక్షుడినైతే ముస్లింలపై నిషేధం విధిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డోనాల్డ్ ట్రంప్.. అన్నంత పని చేస్తారా?.
వాషింగ్టన్: తాను అమెరికా అధ్యక్షుడినైతే ముస్లింలపై నిషేధం విధిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డోనాల్డ్ ట్రంప్.. అన్నంత పని చేస్తారా?. ఈ విషయం తెలియడానికి జనవరి 20, 2017 వరకూ ఆగనవసరం లేదు. ట్రంప్ ముస్లింలపై నిషేధం విధించలేరు. ఎందుకంటే టెర్రరిస్టు ప్రభావిత దేశాల నుంచి వచ్చే యాత్రికులను నిరోధించేందుకు 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఎంట్రీ - ఎక్సిట్ రిజిస్ట్రేషన్ సిస్టం(ఎన్ఎస్ఈఈఆర్ఎస్)ను అమెరికా అమల్లోకి తెచ్చింది. ఈ ప్రోగ్రాం ప్రకారం టెర్రరిస్టు దేశాల నుంచి అమెరికాకు వచ్చే సందర్శకులపై 2001-2011ల మధ్య ఆంక్షలు ఉండేవి.
బెర్లిన్ ఉగ్ర దాడి అనంతరం ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ ముస్లిం సందర్శకులపై కొంతకాలం పాటు నిషేధం విధించాలని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ అవునని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ ఒబామా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం దేశాల సందర్శకులపై ఆంక్షలు విధించే ఎన్ఎస్ఈఈఆర్ఎస్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయకుముందు నుంచే ఎన్ఎస్ఈఈఆర్ఎస్ ను రద్దు చేయాలని పలుమార్లు అమెరికా ప్రభుత్వానికి వినతులు వెళ్లాయి.
ఉగ్రవాదులెవరో గుర్తించడానికి విమానాశ్రయాల్లో ఉండే భద్రతా వ్యవస్ధ సరిపోతుందని హోం ల్యాండ్ సెక్యూరిటీ ఐజీ పేర్కొన్నారు. ఎన్ఎస్ఈఈఆర్ఎస్ కింద మొదట ఇరాక్, ఇరాన్, లిబియా, సుడాన్, సిరియాలకు చెందిన వారిపై ఆంక్షలు విధించగా.. తర్వాత ఆఫ్రికా, మధ్య ఆసియాల్లోని మరో 25 దేశాలపై ఆంక్షలు తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాంను పర్యవేక్షించిన హోం ల్యాండ్ సెక్యూరిటీ 2001 నుంచి 2011 వరకూ ఈ దేశాల నుంచి అమెరికాకు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేసి ఉంచింది.