పై-లీన్ తుపాను ప్రభావంతో.. భీతిల్లిన బారువ | Baruva village scared by philen cyclone effect | Sakshi
Sakshi News home page

పై-లీన్ తుపాను ప్రభావంతో.. భీతిల్లిన బారువ

Published Sun, Oct 13 2013 2:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

Baruva village scared by philen cyclone effect

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామం...  
 ఉదయం 6 గంటలు: గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు. వాటికి తోడు చిరుజల్లులు. తుపాను ముప్పు హెచ్చరికలు ఉన్నా.. ‘ఆ అవన్నీ మనకు మామూలే కదా’ అన్న భావనే స్థానికుల్లో కనిపించింది. షరామామూలుగా దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయారు.
 
 ఉదయం 7.30 - 10 గంటల మధ్య: వాతావరణంలో కొంత మార్పు. గాలి వేగం.. వర్షం జోరు పెరిగింది. అయినా షాపులు, హోటళ్లు తెరుచుకున్నాయి. ఎవరిలోనూ పెద్దగా ఆందోళన లేదు.
 ఉదయం 10 - 12 గంటల మధ్య: గాలి వేగం గంటకు 60 కిలోమీటర్లు మించింది. దాంతోపాటే స్థానికుల్లో ఆందోళన పెరిగిపోవటం మొదలైంది. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరిగింది.
 మధ్యాహ్నం 12 - 2 గంటల మధ్య: పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సభ్యులు గ్రామానికి చేరుకుని మైకుల్లో హెచ్చరికలు జారీ చేయటం మొదలుపెట్టారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న బీచ్‌ను ఖాళీ చేయించారు. రోడ్లు, వీధుల్లో ఉన్న వారిని ఇళ్లలోకి పంపించేశారు. వాహనాలను కూడా తిరగనివ్వలేదు.
 2 - సాయంత్రం 6 గంటల మధ్య: అంతవరకు కొంత సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారి గంభీరంగా మారిపోయింది. షాపులు మూతపడ్డాయి. రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలి హోరెత్తింది. జనం గుండెల్లో గుబులు రేగింది.
 సాయంత్రం 6 గంటల తర్వాత: పరిస్థితి మరింత భీకరంగా మారింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీస్తున్నాయి. రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. కరెంటు లేదు. అంతటా అంధకారం. ఏం జరుగుతుందో.. బయటకెళితే ఏమైపోతామోనన్న భయం. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు.
  

తుపాను తీరాన్ని తాకకముందు బారువ గ్రామంలో శనివారం నెలకొన్న పరిస్థితి ఇది. సముద్ర తీరంలోనే ఉన్న ఈ మేజర్ పంచాయతీకి ఆనుకొని తీరంలో బారువకొత్తూరు, వాడపాలెం ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఈ రెండు గ్రామాలకు చెందిన సుమారు 3,500 మందిని సోంపేట, బారువల్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. సముద్రపు అలలు కొత్తూరు, వాడపాలెం గ్రామాలను తాకి భీతిగొల్పాయి. ఇద్దివానిపాలెం, ఈదుపురం, కపాసుకుద్ది, నువ్వులరేవు, మంచినీళ్లపేట, బందరువానిపేట, దేవునల్తాడ, ఒంటూరు, పూడివలస తదితర పదుల సంఖ్యలో గ్రామాలు శనివారం నాటి పెను తుపాను విలయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం గడిపాయి. శనివారం రాత్రి గడిస్తే తప్ప.. తుపాను విలయం ఏ స్థాయిలో ఉంది? ఎవరు ఎక్కడున్నారు? ఆస్తులు ఎలా ఉన్నాయో?... నష్టం ఏస్థాయిలో ఉందో తెలుసుకోలేని దయనీయ స్థితి.                      

- న్యూస్‌లైన్, కంచిలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement