పోలీసులకు చిక్కిన ప్రేమోన్మాది!
ఈనెల 14న అక్కాచెల్లెళ్లను హత్య చేసి పరారైన అమిత్‌సింగ్
పోలీసులకు దొరక కుండా 14 రోజులపాటు ఆరు రాష్ట్రాల్లో చక్కర్లు
చివరకు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మేడ్చల్‌లో పట్టివేత
హైదరాబాద్: ప్రేమ పేరుతో వెంటపడి హైదరాబాద్‌లో ఈనెల 14న అక్కాచెల్లెళ్లను హత్య చేసి పరారైన అమిత్ సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు! ఆరు రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టి, సుమారు 5 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన అతడు.. ఎవరికీ అనుమానం రాకుండా అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు వస్తూ మేడ్చల్ వద్ద దొరికిపోయాడు. అడ్వొకేట్‌కు ఫోన్ చేస్తుండగా సిగ్నల్ గుర్తించిన పోలీసులు అమిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
10 సిమ్‌కార్డులు.. రూ.4 వేలు..
హత్య తర్వాత అమిత్ ఏం చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్లాడన్న వివరాలను పోలీసులు వెల్లడించారు. కొత్తపేటలోని గాయత్రీపురంలో అక్కాచెల్లెళ్లు యామిని సరస్వతీ, శ్రీలేఖను వారి ఇంట్లోనే హత్య చేసిన అమిత్‌సింగ్ ఆ తర్వాత తన గదికి వెళ్లాడు. ల్యాప్‌టాప్ తీసుకొని ఆటోలో ఉప్పల్‌కు చేరుకున్నాడు. శ్రీలేఖ, యామినిని హత్య చేశానని, ఇక తాను బతకనని తండ్రికి ఫోన్ చేసి చెప్పి స్విచ్ఛాఫ్ చేశాడు. తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి నాలుగు సిమ్‌కార్డులు కొన్నాడు. అప్పటికే అతడి దగ్గర ఆరు సిమ్‌లు ఉన్నాయి. ఇలా మొత్తం 10 సిమ్ కార్డులతోపాటు స్నేహితుల నుంచి తీసుకున్న రూ.4 వేలతో ఖాజీపేటకు వెళ్లాడు. అక్కడ్నుంచి నాగపూర్‌కు, మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీకి మరో ైరె ల్లో వెళ్లాడు. తర్వాత ఉత్తరప్రదేశ్‌లో సొంతూరైన మథుర చేరుకున్నాడు. అయితే అక్కడ పోలీసులు ఉంటారని అనుమానించి అగ్రాకు వెళ్లాడు. అక్కడ్నుంచి రాజస్థాన్‌లోని జైపూర్ వెళ్లి అజ్మీర్ దర్గాకు చేరుకున్నాడు. అక్కడ ఆత్మలతో మాట్లాడే బాబాలను కలసి శ్రీలేఖతో మాట్లాడించాలని కోరాడు. అయితే ఇప్పుడు ఆత్మ రాదు..40 రోజులకు వస్తుందని బాబాలు చెప్పారు. ఖర్చులు సరిపోకపోవడంతో అప్పటికే ల్యాప్‌టాప్‌ను రూ.12 వేలకు అమ్మాడు. తర్వాత జోధ్‌పూర్‌కు వెళ్లి.. అటు నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకున్నాడు. తర్వాత మధ్యప్రదేశ్‌లోని డీనాకు వెళ్లాడు. అక్కడ్నుంచి బస్సెక్కి షిర్డీ వెళ్లి, మూడ్రోజులు ఉన్నాడు. అక్కడ కూడా ఆత్మలతో మాట్లాడే బాబాల వద్దకు వెళ్లి, వీలుకాకపోవడంతో మన్మాడ్‌లో రెలైక్కి మళ్లీ మథురకు వె ళ్లిపోయాడు.
లొంగిపోయేందుకు బయల్దేరి..
పోలీసులు గాలిస్తున్నారన్న సమాచారం అందడంతో ఆగ్రాలో దిగిన అమిత్.. అక్కడ్నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిరోజాబాద్‌కు వెళ్లాడు. ఆదివారం ఉదయం అక్కడికి తండ్రిని పిలిపించుకున్నాడు. అక్క, బావతో పాటు తల్లి, చెల్లి పోలీసులు అదుపులో ఉన్నారని తండ్రి ద్వారా తెలుసుకున్న అమిత్ సింగ్.. లొంగిపోవాలనుకున్నాడు. హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఫిరోజాబాద్ నుంచి నిజామాబాద్ వరకు క్వాలిస్‌లో వచ్చిన అమిత్ సింగ్ అక్కడే ప్లాన్ మార్చాడు. ఎవరైనా చూస్తే కొట్టి చంపేస్తారన్న భయం, పోలీసులకు దొరికిపోతాననే అనుమానంతో అంబులెన్స్‌ను కిరాయికి మాట్లాడుకున్నాడు. రోగిగా హైదరాబాద్‌కు బయలుదేరాడు. నగర శివారు మేడ్చల్‌కు రాగానే అడ్వొకేట్‌కు ఫోన్ చేశాడు. ఫోన్‌కాల్స్ ఆధారంగా మేడ్చల్ పోలీసులు మంగళవారం ఉదయం పది గంటలకు అదుపులోకి తీసుకున్నారు.
తల్లిదండ్రులకు హోంమంత్రి పరామర్శ
యామిని సరస్వతి, శ్రీలేఖ తల్లిదండ్రులు హైమావతి, కృష్ణారెడ్డిలను మంగళవారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఎల్‌బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్‌లు పరామర్శించారు. అక్కాచెల్లెళ్ల చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన బిడ్డలను హత్య చేసిన అమిత్‌సింగ్‌ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. చైతన్యపురి పోలీసులు అమిత్‌సింగ్‌పై ఐపీసీ 452, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపర్చనున్నారు.