
డల్లాస్ లో అంగరంగ వైభవంగా బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని డల్లాస్‌లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో పదివేల మందికిపైగా తెలుగువారు పాల్గొన్నారు. టీపీఏడీ ఆధ్వర్యంలో శనివారం రోజంతా బతుకమ్మను ఓ ఉత్సవంలా జరుపుకున్నారు. సినీ గాయకుల సాంస్కతిక కార్యక్రమాలు, బతుకమ్మ ఆటలు ఈ కార్యక్రమానికి హైలెట్‌గా నిలిచాయి. డల్లాస్‌లోని తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు ప్రదర్శనగా 600 బతుకమ్మలను ఈ స్టేడియం వద్దకు తీసుకొచ్చారు. పిల్లపాపలతో కలిసి రెండన్నర గంటలపాటు స్టేడియం వద్ద బతుకమ్మ ఆడి.. అనంతరం సంప్రదాయబద్ధంగా సమీపంలోని చెరువు (లేక్)లో నిమజ్జనం చేశారు. 7000 సీటింగ్ సామర్థ్యం ఉన్న స్టేడియం తెలుగువారితో కిక్కిరిసిపోయింది.
ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. టీపీఏడీ వ్యవస్థాపక అధ్యక్షుడు అజయ్‌రెడ్డి ఏలేటి, బోర్డు ట్రస్టీస్ కో ఛైర్మన్ రఘువీర్ బండారు, కన్వీనరు మాధవీ సుంకిరెడ్డి, సమన్వయక కర్త ఉపేందర్ తదితరులు ఆహూతులందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. టీపీఏడీకి చెందిన వాలంటీర్లు రెండు నెలలపాటు కషి చేసి బతుకమ్మ సంబరాలకు విస్తత ఏర్పాట్లు చేశారు. టీపీఏడీ ప్రతినిధులు రావ్ కాల్వల, జానకిరామ్ మందాడి, మహేందర్ కామిరెడ్డి, విజయ్ పిట్టా, లింగారెడ్డి, కారం పోరెడ్డి, ప్రవీణ్ బిల్లా, శారదా సింగిరెడ్డి, అశోక్ కొండాల, గంగదేవర, పవన్ గంగదేవర, రామ్ అన్నాడి తదితరులు తెలిపారు.
గాయకులు రేవంత్, సాయిశిల్ప, సాకేత్, సమీరా భరద్వాజ్, కళాకారిణులు స్వాతీ దీక్షిత్, సందినీ రాయ్, యాంకర్ రమ్యకష్ణ ఆధ్వర్యంలో సాగిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వెంకట్ ములుకుట్ల, సంధ్యా శ్రీవాసు మద్దూరి స్థానిక యువతకు టాలెంట్ షో నిర్వహించారు. అమెరికాలో గతంలో ఎప్పుడూ జరగని స్థాయిలో ఇంతపెద్దస్థాయిలో ఒక ఉత్సవం నిర్వహించడంపై ఆ దేశంలోని మిగతా తెలుగు సంఘాలు అభినందనలు తెలిపాయి. అమెరికాలోని తెలుగు సంఘాలు ఆటా, నాటా, నాట్స్, టీడీఎఫ్, డాటా, టాటా సంఘాల ప్రతినిధులు ఈ ఉత్సవాలను అభినందించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎంపీ ఆత్మచరణ్‌రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి, అమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.