సౌర విద్యుత్, రక్షణ రంగాలపై భెల్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తక్కువ వ్యయంతో అధిక విద్యుత్ ఉత్పత్తి అయ్యే కాన్సన్‌ట్రేడెట్ సోలార్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వరంగ బీహెచ్‌ఈఎల్ ప్రకటించింది. ఇందుకోసం స్పెయిన్‌కు చెందిన కంపెనీ అబెన్‌గోవా సోలార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీహెచ్‌ఈఎల్ హైదరాబాద్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎన్.రవిచందర్ తెలిపారు. ఈ విధానంలో మిర్రర్ రిఫ్లెక్టర్ ద్వారా స్టీమ్ టర్బైన్ బాయిలర్లు పనిచేస్తాయన్నారు. ఈ రిఫ్లెక్టర్లను అబెన్‌గోవా సరఫరా చేస్తే బాయిలర్లను బీహెచ్‌ఈఎల్ అందిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఫొటో వోల్టాయిక్ కంటే ఈ విధానంలో యూనిట్ విద్యుత్‌ను రూ.6-7కే ఉత్పత్తి చేయెచ్చని, కానీ దీనికి అధిక భూమి అవసరం అవుతుందన్నారు. తయారీ రంగంపై సీఐఐ శుక్రవారం నిర్వహించిన ‘మానెక్స్ -2013’ కార్యక్రమంలో పాల్గొన్న రవిచందర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రధానంగా రక్షణ, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం చాలా కీలకమైనదని, ప్రస్తుతం జీడీపీలో 15%గా ఉన్న తయారీ రంగ వాటాను 25%కు పెంచితే అదనంగా 92 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం సేవల రంగం పై అధికంగా దృష్టిసారిస్తోందని, 1990 దశకాల్లో లాగా తయారీ రంగంపై దృష్టిసారించాలన్నారు.