మానస సరోవరం..శివుడి నివాసం! | Bhooloka Kailasam 'Manasa Sarovar' Yatra | Sakshi
Sakshi News home page

మానస సరోవరం..శివుడి నివాసం!

Published Sat, Oct 3 2015 7:25 PM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM

మానస సరోవరం..శివుడి నివాసం!

మానస సరోవరం..శివుడి నివాసం!

కైలాస పర్వతం.. సాక్షాత్తూ పరమ శివుడి నివాసమని కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకం.

కైలాస పర్వతం.. సాక్షాత్తూ పరమ శివుడి నివాసమని కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకం. అందుకే జీవితంలో ఒకసారైనా కైలాస పర్వతాన్ని దగ్గర నుంచి వీక్షించి, మానస సరోవరంలో స్నానమాచరించాలని భక్తులు పరితపిస్తుంటారు. కానీ సముద్ర మట్టానికి కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశాన్ని దర్శించడం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కల. ఈ రోజు ఆ ప్రత్యేక యాత్ర విశేషాల గురించి మనమూ తెలుసుకుందాం...!
 
యాత్రలు..
చలికాలంలో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పి ఉంటుంది. ఫలితంగా అక్కడి వాతావరణం యాత్రికులకు ప్రతికూలంగా పరిణమిస్తుంది. కనుక యాత్రికులు సాధారణంగా ఎండాకాలం, రుతుపవనకాలాల్లో మానససరోవాన్ని దర్శిస్తారు. భారతదేశంలో ఉత్తర కాశీ, నేపాల్లోని కఠ్మాండు నుంచి ప్రతి ఏటా కైలాస యాత్రలు జరుగుతున్నాయి.
 
 ఎక్కడ ఉంది..?
 'మానస సరోవరం' అనేది చైనాకు చెందిన టిబెట్ ప్రాంతంలో ఉన్న మంచినీటి సరస్సు. ఇది లాసా నగరానికి 940 కి.మీ దూరంలో భారత్, నేపాల్ దేశాలకు దగ్గరలో ఉంది. చైనాలో ఈ సరస్సును మపం యు, మపం యు ట్సొ.. అనే పేర్లతో పిలుస్తారు.
 
భౌగోళిక స్వరూపం..
మానస సరోవరానికి పశ్చిమాన రాక్షస్తల్ అనే ఉప్పునీటి సరస్సు, ఉత్తరాన హిందువులు పరమశివుని నివాసస్థలంగా భావించే కైలాస పర్వతం ఉన్నాయి. ఈ మంచినీటి సరస్సు సముద్ర మట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉంది. 300 అడుగుల తోతు ఉన్న ఈ సరస్సు 320 చదరపు కిలోమీటర్ల ఉపరితలంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో ఎండాకాలం మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే. రుతుపవనాలు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఉంటాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుంచి -15 డిగ్రీల వరకు నమోదవుతుంటాయి. అతిశీతలమైన ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలు, బండరాళ్లు, చిన్నపాటి గడ్డిమొక్కలు కనిపిస్తాయి.
 
సాంస్కృతిక ప్రాధాన్యం..
సంస్కృతంలో మానస అంటే మనస్సు, సరోవరం అంటే సరస్సు అని అర్థం. పూర్వకాలం భారతదేశం, టిబెట్, నేపాల సరిహద్దులతో సంబం దం లేకుండా కలిసి ఉండటం వల్ల ఇది హిందువులకు, బౌద్ధులకు, జైనులకు కూడా పవిత్రమైన సరస్సు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి ఆలోచనల నుంచి మానససరోవరం ఆవిర్భవించి భూమిపై పడింది. ఇందులో నీరు తాగితే మరణించాక నరకానికి వెళ్లకుండా కైలాసానికి చేరుకుంటారని, వంద జన్మల పాపాలు హిరిస్తాయని.. హిందువుల విశ్వాసం. జ్ఞానం, అందానికి ప్రతిరూపాలైన హంసలు మానస సరోవరంలో విహరించేవని నమ్ముతారు.
 
చరిత్ర..
పురాణేతిహాసాల ప్రకారం కైలాసగిరి, హిమాలయాలు భరత ఖండానికి చెందినవి. ఏడో శతాబ్దంలో టిబెట్ స్వతంత్ర దేశంగా పాలన మొదలు పెట్టినప్పటి నుంచి కైలాస్‌గిరి టిబెట్ దేశానికి చెందింది. 1950లో చైనా టిబెట్‌ను ఆక్రమించుకున్నాక భారతీయులకు కైలాస దర్శనం కష్టసాధ్యమయింది. 1959 నుంచి 1978 వరకు, అంటే దాదాపు 20 సంవత్సరాలు ఎవరినీ ఈ గిరిని దర్శించడానికి అనుమతినివ్వలేదు. ఆ తర్వాత 1980 నుంచి భారత ప్రభుత్వ అనుమతి ద్వారా వెళ్లేవారిని అనుమతిస్తున్నారు.


 
యాత్ర జాగ్రత్తలు..
మానసిక సంకల్పంతో పాటు శారీరకంగా కూడా అక్కడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి కావాలి. ఈ యాత్రకి సిద్ధం కావడానికి ముందు నుంచీ ఉదయం, సాయంత్రం నడక.. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, యోగా.. లాంటివి చేయడం మంచివి. మధుమేహం, స్పాండిలైటీస్, ఆస్తమా, సైనస్.. వంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ యాత్ర చేయలేరు. సముద్ర మట్టానికి సుమారు 5000 మీటర్ల ఎత్తుకు వెళ్లాక శరీరానికి తగినంత ప్రాణవాయువు అందడం కష్టం అవుతుంది. దీన్ని నివారించడం కోసం రోజూ రాత్రి 'డైమాక్స్' అనే ట్యాబ్లెట్ వేసుకోవడ తప్పనిసరి. అక్కడి చలిని తట్టుకునే దస్తులు ధరించాలి.
 
 
ఎవరూ అధిరోహించని కైలాస పర్వతం..
కైలాస పర్వతాన్ని టిబెటన్ భాషలో ‘రిస్‌పోచి’ అని పిలుస్తారు. ఏటా వేల మంది హిందూ భక్తులు 52 కి.మీ వరకు మాత్రమే కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తుంటారు. కానీ పర్వతాన్ని పూర్తిగా అధిరోహించరు. పాశ్చాత్య దేశాలకు చెందిన అనేక మంది సాహసికులు దీన్ని అధిరోహించేందుకు ప్రయత్నించినా అనేక కారణాల వల్ల వారి ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి.
 
 

ప్రాంతమంతా శక్తిమయం..
విజ్ఞానశాస్త్రం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఎక్కువ శక్తి ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలు ఉంటాయి. మానస సరోవరం, కైలాస పర్వతం కూడా అలాంటి కోవకు చెందిన ప్రాంతాలే.
 
 

 

 

మరిన్ని విశేషాలు..

  •  బ్రహ్మపుత్ర, గంగ, సింధు, సట్టజ్.. నదులు మానస సరోవరం నుంచే పుట్టాయనే ఒక వాదన ప్రచారంలో ఉంది.   అయితే దానికి  కచ్చితమైన ఆధారాలు లేవు.
  •   సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులు బుద్ధ పూర్ణిమ నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు.
  •   భారత ప్రభుత్వం ఏడాదికి సుమారు 750 మందిని మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా  ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు.
  •  మానస సరోవరం ప్రాంతంలో తెల్లవారు జామున  రెండు నుంచి నాలుగున్నర గంటల సమయంలో ఆకాశంలో చిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానమాచరించేందుకు సరోవరానికి వస్తారని భక్తుల నమ్మకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement