మొత్తం వ్యవస్థకే ఇది విచారకరం:పల్లంరాజు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన ఘటన మొత్తం వ్యవస్థకే మచ్చతెచ్చేదిగా ఉందని కేంద్రమంత్రి పల్లంరాజు అభిప్రాయపడ్డారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని, కాకపోతే బాధ్యాతాయుతమైన పార్టీగా ఇరు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. లోక్ సభలో బిల్లు ఆమోదించిన తీరు ఏమాత్రం సరిగా లేదన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటనగా పల్లంరాజు అభివర్ణించారు.
తెలంగాణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో సీమాంధ్ర నేతలు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు సీమాంధ్ర నేతలు పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఈ కోవలో కేంద్ర మంత్రి పురందేశ్వరి కూడా చేరారు. తెలంగాణ బిల్లుపై ఏకపక్ష నిర్ణయంతో వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర నేతలు మండిపడుతున్నారు. కాగా, కాంగ్రెస్ వైఖరిని ఎప్పుడూ సమర్థిస్తూ వచ్చిన పల్లంరాజు పార్టీని వీడేందుకే విమర్శలు చేస్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.