వెంకయ్యకు ఓటేయబోమన్న బీజేడీ
భువనేశ్వర్: రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు లభించినట్లే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ భారీ మద్దతు లభిస్తుందని భావించిన ఎన్డీఏకి బిజూ జనతాదళ్(బీజేడీ) షాకిచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీనే తాము బలపరుస్తామని బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేడీ.. ఎన్డీఏ అభ్యర్థిని రామ్‌నాథ్ కోవింద్‌ను సమర్థించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి పోలింగ్ ముగిసి 24 గంటలైనా గడవకముందే బీజేపీకి మింగుడుపడని నిర్ణయం తీసుకున్నారు నవీన్ పట్నాయక్. మంగళవారం భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. యూపీఏ అభ్యర్థి గాంధీ తనకు చిరకాల మిత్రుడని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము స్నేహితులమని గుర్తుచేవారు.
ప్రస్తుతం బీజేడీకి పార్లమెంట్‌లో 28 మంది ఎంపీలున్నారు, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడా ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేడీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్‌తో బీజేడీ తెరవెనుక ఒప్పందం కుదుర్చుకుందని ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బసంత పండా ఆరోపించారు.