ఛత్తీస్‌గఢ్‌ను బీజేపీ దొంగల్లా దోచుకుంటోంది:రాహుల్
ఖార్సియా: కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. బీజేపీని దొంగల పార్టీ అని, ఛత్తీస్‌గఢ్‌లోని సహజ వనరులను అది దోచుకుంటోందని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి త్వరలోనే రెండో దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో శనివారం రాహుల్ గాంధీ ఖార్సియా నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మే 25న జిరామ్ ఘాటీ ప్రాంతంలో నక్సల్స్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నంద కుమార్ పటేల్ సొంత నియోజకవర్గమిది. ఈ స్థానంలో పటేల్ కుమారుడినే కాంగ్రెస్ బరిలో నిలిపింది.
ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నందకుమార్ పటేల్ కుమారుడిని నేను ఒకటి అడగదలచుకున్నా.. ఒకటంటే ఒకటి కాదుగానీ.. నాకు ఒక 500 మంది నంద కుమార్ పటేల్‌లు కావాలి. వాళ్లను నేను ఢిల్లీ నుంచి తీసుకురాను. ఇక్కడి ప్రజల్లో నుంచి వాళ్లు వచ్చి.. ధైర్యంగా నిలబడి బీజేపీని.. ఈ దోపిడీ దొంగల్ని తరిమి కొట్టాలి’’ అని పిలుపునిచ్చారు. అభివృద్ధి కోరుకునే ఇక్కడి గిరిజనులు, దళితులు రోజూ జిరామ్ ఘాటీ తరహా దాడులనే ఎదుర్కొంటున్నారని అన్నారు. ‘‘ఛత్తీస్‌గఢ్ చాలా సహజవనరులతో తులతూగే రాష్ట్రమని పటేల్ నాతో చెప్పారు. ఇక్కడి భూమి, అడవులు, గనులు ప్రజలవి. కానీ బీజేపీ నేతలు వాటన్నింటినీ ప్రజల నుంచి దోచుకుంటున్నారు’’ అని అన్నారు.