లోక్‌సభలో 'జై శ్రీరాం' నినాదాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మలివిడత ప్రస్తుతం జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం నాడు సభ సమావేశం అయినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలోకి అడుగు పెడుతుండగా.. ఒక్కసారిగా బీజేపీ సభ్యులు ఆయనను 'జై శ్రీరాం', 'మోదీ.. మోదీ' అంటూ స్వాగతించారు. సాధారణంగా ప్రధానమంత్రి, ఇతర సీనియర్ నాయకులు ఎవరైనా సభలోకి వస్తున్నప్పుడు గౌరవ సూచకంగా లేచి నిలబడటం, నమస్కారం పెట్టడం లాంటివి కనిపిస్తాయి. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రెండు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించి, మరో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా ఏర్పాటుచేసిన నేపథ్యంలో.. మోదీని అభినందించేందుకు బీజేపీ ఎంపీలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
బుధవారం నాడు లోక్‌సభ సమావేశమైన వెంటనే ముందుగా లోక్‌సభ మాజీ సభ్యుడు భూమా నాగిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం అవుతుండగా మోదీ సభలోకి వచ్చారు. ఆయనతోపాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్ఇర అనంతకుమార్, బీజేపీ చీఫ్ విప్ రాకేష్ సింగ్ కూడా వచ్చారు. దాంతో బీజేపీ సభ్యులంతా ఒక్కసారిగా బల్లలు చరుస్తూ, 'జై శ్రీరాం' అంటూ ఆయనకు స్వాగతం పలికారు. అలా దాదాపు రెండు నిమిషాల పాటు మోదీ.. మోదీ అనే నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇంత ఘన స్వాగతం అందుకున్న మోదీ.. సభలో మాత్రం కొద్దిసేపే ఉన్నారు.