రాహుల్ గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ సభ్యుడొకరు లోక్సభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈశాన్య ముంబై ఎంపీ అయిన కిరీట్ సోమయ్య స్పీకర్కు ఈ నోటీసు అందజేశారు. దీనిపై ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. గురువారం నాడు రాహుల్ గాంధీ పార్లమెంటులో మాట్లాడుతూ ప్రధానమంత్రివి 'ప్రతీకార రాజకీయాలు' అంటూ ప్రస్తావించడం తెలిసిందే.
తన నియోజకవర్గమైన అమేథీలో ఫుడ్ పార్కును రద్దుచేయాలనుకుంటున్నారని ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ సోమయ్యతో పాటు కొందరు బీజేపీ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. కానీ ఆ సమయానికి రాహుల్ సభలో లేరు. నినాదాల కారణంగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో స్పీకర్ సభను పావుగంట సేపు వాయిదా వేశారు. రాహుల్ సభను తప్పుదోవ పట్టించారని, వాస్తవానికి ఫుడ్ పార్కును నిర్వహించలేమంటూ సదరు కంపెనీయే వెనక్కి వెళ్లిందని కిరీట్ సోమయ్య అన్నారు.