కొత్తవారికి టికెట్లివ్వొద్దు..!
* టీఆర్‌ఎస్ ఎత్తులకు.. మనం చిత్తుకావొద్దు
* అధికార పార్టీ ‘ఆకర్ష్’పై.. అనుమానాలెన్నో..
* కొత్తవాళ్లు పోటీ నుంచి తప్పుకొనే ప్రమాదం
* బీజేపీ అభ్యర్థులు గెలవడంతో పాటు పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవడమూ ముఖ్యమే
* గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ సీనియర్ల చర్చ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీలోని సీనియర్ నేతలకు, అంకితభావం ఉన్న నాయకులకే కార్పొరేటర్లుగా టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ సీనియర్లు కోరుతున్నారు.బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కూడా ఈ అభిప్రాయాన్నే ఏకీభవిస్తున్నదని వారు చెబుతున్నారు.
అధికార టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాన్ని శాసన మండలి ఎన్నికల్లో గమనించిన బీజేపీ సీనియర్లు.. పార్టీలో కొత్త నేతలకు అవకాశం ఇచ్చే విషయాన్ని చాలా సీరియస్‌గా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులు, ఆర్థిక వనరులు, ఇతర అంశాలపై బీజేపీ రాష్ట్ర నేతలు, గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నాయకులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాత, కొత్త నేతలకు టికెట్లు ఇచ్చే అంశంపై చాలాసేపు చర్చ జరిగింది. ఎన్నికల్లో ఓడిపోయినా, గెలిచినా.. పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినవారికే ప్రాధ్యాన్యతనివ్వాలని కొందరు నేతలు ప్రతిపాదించారు. బీజేపీతో సైద్ధాంతిక అనుబంధం ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని, లేకుంటే అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు కొత్త ఎత్తులు వేస్తూ పార్టీ అభ్యర్థులను ఉపసంహరింపజేసే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరించారు.
పార్టీలో చేరడం.. అధికార పార్టీలోకెళ్లేందుకేనా?
దీంతోపాటు ఎన్నికలు రాగానే పార్టీలో చేరడం, ఆ తరువాత అధికార పార్టీలో చేరిపోవడం కొందరు నేతలకు అలవాటుగా మారిపోయిందని ఆ పార్టీ ముఖ్యులు అభిప్రాయపడ్డారు. టికెట్ల కోసమే పార్టీలోకి వచ్చినవారికి టికెట్లు ఇచ్చాక.. గెలిచినవారైనా, ఓడిపోయినవారైనా అధికారపార్టీలోకి వెళ్లిపోతున్నారని వారన్నారు. ఇలా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం, వారికోసం పార్టీ పాత నేతలు పనిచేయడంవల్ల సీనియర్లలో నిరుత్సాహం నెలకొంటుందన్నారు. ఇక ఎప్పటికైనా పనిచేయడమే తప్ప.. మాకు అవకాశాలు రావనే నిస్పృహ వారిలో నెలకొంటున్నదని వాదించారు.
ఉపసంహరణలతో.. కొత్త సంప్రదాయం
ఇతర పార్టీల అభ్యర్థులను పోటీలో లేకుండా చేయాలనే కొత్త రాజకీయ సంప్రదాయానికి టీఆర్‌ఎస్ తెరలేపిందని, ఈ అంశంపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని బీజేపీ నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. పార్టీ టికెట్ తీసుకుని, నామినేషన్లకు గడువు పూర్తయిన తర్వాత ఉపసంహరింపజేసుకుంటే బీజేపీ శ్రేణుల్లో నిరాశా, నిస్పృహలు తప్పవని నేతలు అభిప్రాయపడ్డారు.
అందుకోసమే టికెట్లు ఇవ్వడానికి ముందుగానే.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విషయంలో సమగ్ర సమాచారంతో టికెట్ ఇచ్చే విషయమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల్లో గెలుపు అభ్యర్థి ఎంత ముఖ్యమో, ఆ తరువాత వారు పార్టీలోనే ఉండేలా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమనే నిర్ణయానికి బీజేపీ నేతలు వచ్చారు. దీనికోసం అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.