
'అప్పుడు ఒకటే.. ఇప్పుడు మూడు...'
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, మిత్రపక్షాల మధ్య సీట్ల లొల్లి మొదలైంది. తమకే అత్యధిక సీట్లు ఇవ్వాలని మిత్రపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ 102 సీట్లకే పరిమితం కావాలని బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) సూచించింది.
గత ఎన్నికల్లో బీజేపీ 102 స్థానాల్లో పోటీ చేసి మిత్రపక్షమైన జేడీ(యూ)కు 141 సీట్లు కేటాయించిందని, ఇప్పుడు అదేవిధంగా చేయాలని కేంద్ర మంత్రి, ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వవాహ అన్నారు. గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక మిత్రపక్షం మాత్రమే ఉందని, ఈసారి మూడు మిత్రపక్షాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
తమ పార్టీ 67 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటుందని చెప్పారు. మరో మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ(ఎల్ జేపీ) 74 సీట్లు అడుగుతోందని తెలిపారు. అలాగే మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందూస్థాన్ అవామీ మోర్చా(హెచ్ ఏఎం)కు కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి వుంటుందన్నారు.
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పాట్నా పర్యటన నేపథ్యంలో ఉపేంద్ర కుష్వవాహ సీట్ల సర్దుబాటుపై స్పందించారు. బిహార్ లోని 243 స్థానాల్లో సొంత బలంతో 185 గెలవాలనుకుంటున్నట్టు ఈ ఏడాది ఆరంభంలో అమిత్ షా ప్రకటించారు.