బ్లడ్ కేన్సర్ జన్యువు దొరికింది! | Blocking key gene may treat leukemia | Sakshi
Sakshi News home page

బ్లడ్ కేన్సర్ జన్యువు దొరికింది!

Published Fri, Feb 14 2014 9:33 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

Blocking key gene may treat leukemia

టొరాంటో: ల్యుకేమియా (బ్లడ్ కేన్సర్) వ్యాప్తికి కారణమవుతున్న ఓ కీలక జన్యువును కెనడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జన్యువును క్రియారహితం చేయడం ద్వారా బ్లడ్ కేన్సర్‌ను పూర్తిగా అడ్డుకోవచ్చని వారు భావిస్తున్నారు. ల్యుకేమియాకు జన్యుపరమైన చికిత్సపై నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియెల్ శాస్త్రవేత్తలు ‘బీఆర్‌జీ1’ అనే ఈ జన్యువును గుర్తించారు. బ్లడ్ కేన్సర్ మూలకణాలు విభజన చెందుతూ కణతులను ఏర్పర్చేందుకు ఈ జన్యువే తోడ్పడుతోందని కనుగొన్నారు. ప్రయోగశాలలో జంతువులు, మనుషుల బ్లడ్ కేన్సర్ కణాలపై ప్రయోగంలో.. ఈ జన్యువును అడ్డుకోగా వాటి విభజన పూర్తిగా ఆగిపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

 

ఈ జన్యువు ఆరోగ్యకరమైన రక్తకణాలపై ఎలాంటి ప్రభావం చూపకుండా కేన్సర్ కణాల విభజనను మాత్రమే ప్రేరేపిస్తుంది కాబట్టి.. దీనిని అడ్డుకున్నా ప్రమాదమేమీ ఉండబోదని అంటున్నారు. ప్రస్తుతం కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలతో బ్లడ్ కేన్సర్ కణతులను తొలగించడం సాధ్యం అవుతున్నా.. ఈ కణతులను ఏర్పర్చే మూలకణాలను మాత్రం పూర్తిగా నిర్మూలించడం వీలు కావడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్‌జీ1 జన్యువును అణుస్థాయిలోనే అడ్డుకునే ఔషధాన్ని తయారు చేస్తే గనక.. బ్లడ్ కేన్సర్‌కు శాశ్వత చికిత్స అందుబాటులోకి వచ్చినట్లేనని, తాము ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని పరిశోధకులు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement