అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాబీ జిందాల్!
అమెరికా లాంటి అగ్రరాజ్యానికి ఓ భారతీయుడు అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుందా? అవునంటున్నారు అక్కడి నాయకులు. 2016లో అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి, ప్రస్తుత లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ పోటీ పడతారని ఆ రాష్ట్రానికి చెందిన ఓ సెనేటర్ చెబుతున్నారు. ఆయన తప్పకుండా పోటీ చేస్తారని, ఆయన చాలా మంచి అభ్యర్థి అని సెనేటర్ డేవిట్ విటెర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తనకు బాబీ జిందాల్ అంటే ఇష్టమని, ఆయన నాయకత్వం అంటే గౌరవం ఉందని, ఆయన రాజకీయ విలువలన్నింటితో తాను ఏకీభవిస్తానని చెప్పారు.
బాబీ జిందాల్ అధ్యక్ష పదవికి పోటీ పడతారంటే ఇక్కడ అందరూ సంతోషిస్తారని, అందరి దృష్టీ ఇటువైపే ఉంటుందని కూడా సెనేటర్ విటెర్ చెప్పారు. జిందాల్ లూసియానా గవర్నర్గా ఇప్పటికి రెండోసారి పనిచేస్తున్నారు. ఆయన పదవీకాలం 2015తో ముగుస్తుంది. ఎటూ మూడోసారి ఆ రాష్ట్రానికి గవర్నర్గా పోటీ చేయలేరు. వెటెర్ ఈసారి గవర్నర్ పదవికి పోటీ పడతారని భావిస్తున్నారు. అశేష ప్రజాదరణ ఉన్న బాబీ జిందాల్ అధ్యక్ష పదవికి సరైన అభ్యర్థి అని పలువురు భావిస్తున్నారు.