బాబీ జిందాల్ మనోడేనా ? | From Piyush to Bobby: How does Jindal feel about his family's past? | Sakshi
Sakshi News home page

బాబీ జిందాల్ మనోడేనా ?

Published Thu, Jun 25 2015 4:32 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

బాబీ జిందాల్ మనోడేనా ? - Sakshi

బాబీ జిందాల్ మనోడేనా ?

హైదరాబాద్: రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న లూసియానా 55వ గవర్నర్, భారత సంతతికి చెందిన యువ రాజకీయ నాయకుడు బాబీ జిందాల్ మనోడేనా ? అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సముచిత స్థానం కల్పిస్తారా? వర్ధమాన దేశమైన భారత్ అభివృద్ధికి ఏరకంగానైనా సాయపడే వ్యక్తేనా ? అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం కోసం కృషి చేస్తారా ? భారత్‌లోని పంజాబ్ నుంచి వలసపోయిన ఓ కుటుంబంలో కన్ను తెరిచిన జిందాల్ పుణికిపుచ్చుకున్న సంస్కృతి ఏమిటి? రాజకీయంగా ఆయన ఎదుగుదలను, అమెరికాలో ఏ వర్గాలకు ఆయన ప్రాతినిథ్యం వహించారో, ప్రస్తుతం ఏ వర్గాల ప్రయోజనాల కోసం పరితపిస్తున్నారో! అన్న అంశాలను విశ్లేషిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

వాస్తవంగా పియూష్ జిందాల్ అని తల్లిదండ్రులు పెట్టిన పేరులోని ‘పియూష్’ అనే భారతీయ నామాన్ని ఆయన తొలగించుకొని ఆ స్థానంలో బాబీ అని తగిలించుకున్నారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని వదిలేసినా  ఆయన వేషధారణలోగాని, మాట్లాడే భాష, ఆ భాష యాసలోగానీ  ఆహార అలవాట్లలోగానీ ఎక్కడా భారతీయత కనిపించదు. ఇక్కడ అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల్లో ప్రధానంగా రెండు రకాల వారున్నారనే విషయాన్ని ప్రస్తావించాలి.

మొదటిరకం... అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆహార్యంలోనూ ఆహార అలవాట్లలోనూ భారతీయ సంప్రదాయాలనే పాటించేవారు. భారతీయ కళలు, సంస్కృతిని అభిమానించేవారు. రెండోరకం..అమెరికా సంస్కృతిని అలవర్చుకొని వారి యాసలో, వారి భాషలో మాట్లాడడమే కాకుండా ఆహారపు అలవాట్లతోపాటు అన్నింటా అచ్చం వారిలాగే ప్రవర్తిస్తూ వారిలో భాగమైపోయేవారు. ఈ రెండో రకానికి చెందిన వాడే బాబీ జిందాల్.

జిందాల్ ఏ రోజు కూడా భారతీయ కాకస్ గ్రూపులో భాగమైన వ్యక్తి కాదు. భారతీయ ప్రయోజనాల కోసం ఎన్నడూ కృషి చేయలేదు. భారత్ నుంచి వచ్చిన రాజనీయ నాయకులను మర్యాదపూర్వకంగా కలుసుకున్న సందర్భాలు కూడా లేవు. కనీసం తాను భారత సంతతికి చెందిన వ్యక్తిగా ఎన్నడూ చెప్పుకోలేదు.

2003లో మొదటిసారి లూజియానా గవర్నర్‌గా పోటీ చేసినప్పుడు కూడా అమెరికాలోని భారతీయులను పట్టించుకోలేదు. అప్పుడు ఆయన ఓడిపోయారు. తిరిగి 2007లో పోటీ చేసినప్పుడు మాత్రం ఆయన భారతీయ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. ఇతర రాష్ట్రాల నుంచి పోగేసిన భారతీయులను స్వరాష్ట్ర ప్రచారానికి ఉపయోగించుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలిచి అమెరికాలో ఓ రాష్ట్రానికి గవర్నరైన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

2011లో తిరిగి ఎన్నికై ఇప్పటికీ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. నల్లజాతీయుల పట్ల వివక్షచూపే వ్యక్తిగా అక్కడి రాజకీయాల్లో ఆయనపై ముద్ర పడింది. లూసియానాలోని న్యూ ఆర్లీయాన్స్ నగరంలో నల్ల జాతీయులు ఎక్కువగా ఉంటారు. కత్రినా తుఫాను కారణంగా అక్కడ నల్లజాతీయులు తీవ్రంగా నష్టపోతే వారి పునరావాసం కోసం కృషి చేయకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నారు.

అమెరికాలో నివసిస్తూ వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించి భారతీయ ప్రతిష్టను దిగంతాలకు తీసుకెళ్లిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, హరగోవింద్ ఖురానా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, జుంపా లహరి లాంటి వ్యక్తుల సరసన జిందాల్‌ను చేర్చడం సమంజసమా? రేపు కాలమే సమాధానం చెప్పాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement