Bobby Jindal
-
ట్రంప్ కేబినెట్లో బాబీ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన ట్రంప్ కేబినెట్లో భారతీయ అమెరికన్ బాబీ జిందాల్‌కు స్థానం లభించనుందని మీడియా పేర్కొంటోంది. జిందాల్ లూసియానా గవర్నర్‌గా రెండు సార్లు పనిచేయడం తెలిసిందే. ట్రంప్ కేబినెట్లో జిందాల్‌కు స్థానం దక్కితే.. ఆ పదవి పొందిన తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డులకెక్కుతారు. అంతేకాకుండా యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికరుున రెండవ అమెరికన్ అవుతారు.బెన్ కార్సన్‌తో కలసి జిందాల్‌ను ఆరోగ్య కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వీరిద్దరూ రిపబ్లికన్ పార్టీ తరఫున దేశాధ్యక్ష ఎన్నికలకు పోటీపడడం తెలిసిందే. సుప్రీం జడ్జీల నామినీల్లో అముల్! అమెరికా సుప్రీంకోర్టు జడ్జి పదవి కోసంట్రంప్ తయారుచేసుకున్న జాబితాలో భార తీయ అమెరికన్ జడ్జి అముల్ థాపర్(47) చోటు దక్కించుకున్నారు. ముగ్గురు సుప్రీం జడ్జీల ఎంపిక కోసం 21 మందితో కూడిన ఈ జాబితాలో అముల్ గట్టి అభ్యర్థి. -
అధ్యక్ష రేసు నుంచి తప్పుకొన్న బాబీ జిందాల్
లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. 2016లో జరగనున్న అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీలో ఉన్న ఆయన.. మంగళవారం తన ప్రచారాన్ని నిలిపివేశాడు. ఈ సందర్భంగా జిందాల్ మాట్లాడుతూ రిపబ్లికన్ పార్టీ తరపున మరో అభ్యర్థిని తాను బలపరచదలచుకోలేదన్నారు. అయితే పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి మద్దతు ఇస్తానని తెలిపారు. అధ్యక్ష రేసు కోసం ఎంతో సమయాన్ని విధానాల తయారీకి, ఇతరత్రా విషయాల కోసం వెచ్చించినట్లు వెల్లడించాడు. అయితే ఇది తనకు సరైన సమయం కానందున రేసు నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావించినట్లు తెలిపాడు. బాబీ జిందాల్ తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీ తరపున ఇంకా బరిలో 14 మంది అభ్యర్థులు మిగిలారు. బాబీ జిందాల్ తన ప్రచారంలో మొదటగా ఎన్నికలు జరిగే లోవా ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. అయితే అక్కడి ఓటర్ల నుంచి ఆశించినంత మేర ఆదరణ జిందాల్‌కు లభించలేదు. అంతేకాకుండా రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న బలమైన ఇతర అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, బెన్ కార్సన్ల నుంచి ఎదురవుతన్న పోటీలో జిందాల్ వెనుకబడ్డాడు. నిధుల సమీకరణలో కూడా జిందాల్‌కు నిరాశ తప్పలేదు. వీటన్నింటి దృష్ట్యా ప్రాక్టికల్‌గా ఆలోచించి జిందాల్ పోటీ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
'అరెస్టుకు ఆమె ఒక్క ఈమెయిల్ దూరంలో ఉన్నారు'
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ అరెస్టు అవడానికి కేవలం ఒక్క ఈమెయిల్ దూరంలో ఉన్నారని లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ వ్యాఖ్యానించారు. కోర్టు ప్రొసిడింగ్స్‌లో ఆమె చెప్పిన అబద్దాలు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగత మెయిల్స్ సమాచారం వాడుకున్న విషయాలు బయట పడతాయని ఆయన పేర్కొన్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరఫున బాబీ జిందాల్ అమెరికా అధ్యక్షపదవి బరిలో ఉన్న విషయం విదితమే. స్టేట్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో ఆమె మెయిల్స్ ను బహిర్గతం చేయాల్సిందిగా వచ్చిన ఆదేశాల అనుసారం హిల్లరీ ఈ సమాచారాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా జిందాల్ మాట్లాడుతూ.. హిల్లరీ ఇకనైనా చైనీస్ ప్రభుత్వాన్నిడాక్యుమెంట్లు డంప్ చేయవద్దని వేడుకోవడం మంచిదంటూ హెచ్చరించారు. ఇందులో భాగంగా పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయని జిందాల్ చెప్పారు. టాప్ సిక్రెట్ అని రాసి ఉంచిన మెయిల్స్ కొన్నింటిన క్లింటన్ తాను సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు సర్వర్ నుంచి వాడుకున్నట్లు బహిర్గతమయ్యాయి. 2009-2011 మధ్య కాలంలో డిపార్ట్మెంట్ ఉద్యోగులు కొన్ని మెయిల్స్ చేశారని, అందులో కొన్ని హిల్లరీకి పంపినట్లు ఈ ఘటనతో బయటపడింది. -
ఫేస్బుక్లో జిందాల్ హవా
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బాబీ జిందాల్ ఇప్పుడు ఫేస్బుక్లో హవా సృష్టిస్తున్నారు. జిందాల్‌కు ఫేస్బుక్లో 21 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, 49 లక్షల మంది ఆయనతో సంభాషణలు జరుపుతున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులలో ఎక్కువగా చర్చలో ఉన్న వారిలో పదో వ్యక్తిగా బాబీ జిందాల్ నిలిచారు. ఆయనతో పాటు టెక్సాస్ మాజీ గవర్నర్ రికీ పెర్రీ కూడా ఈ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. అయితే వీళ్లిద్దరినీ ఫాక్స్ న్యూస్ తమ రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌కు పిలవలేదు. కానీ బాబీ జిందాల్, పెర్రీ ఇద్దరూ మాత్రం గురువారం రాత్రి జరిగిన హేపీ అవర్ డిబేట్లో పాల్గొన్నారు. పెర్రీకి 24 లక్షల మంది ఫాలోవర్లుండగా 73 లక్షల మంది ఆయనతో సంభాషణలు జరుపుతున్నారు. అందరికంటే అగ్రస్థానంలో బిజినెస్ టైకూన్ డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆయనకు 2.62 కోట్ల మంది ఫాలోవర్లుండగా 13.56 కోట్ల మంది సంభాషణలు జరుపుతున్నారు. ఆయన తర్వాతి స్థానంలో ఫ్లోరిడా మాజీ గవర్నర్ జెబ్ బుష్ ఉన్నారు. -
వెనుకబడ్డ బాబీ జిందాల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో నిలిచిన ఇండియన్-అమెరికన్ బాబీ జిందాల్ ఎన్నికల నిధుల వేటలో వెనుకబడ్డారు. గత వారంలో రోజుల్లో ఆయన 579,000 డాలర్లు సేకరించారు. ఎన్నికల ప్రచారం కోసం ఆయన ఇప్పటివరకు 9 మిలియన్ డాలర్లుపైగా పోగుచేశారు. తనతో పాటు అధ్యక్ష బరిలో నిలిచిన డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థులతో పోలిస్తే విరాళ సేకరణలో జిందాల్ వెనుకబడ్డారు. సొంత పార్టీలో జిందాల్ కు పోటీలో నిలిచిన ఫ్లోరిడా గవర్నర్ జెబ్ బుష్ 16 రోజుల్లోనే 11.4 మిలియన్ డాలర్లు కూడగట్టారు. డెమొక్రటిక్ పార్టీ తరపున బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ ఖాతాలో దాదాపు 47.5 మిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ ఏడాదిలోగా 100 డాలర్లు సేకరించాలని హిల్లరీ లక్ష్యంగా పెట్టుకున్నారు. -
బాబీగానే ఉండనివ్వండి..!
సందర్భం విదేశాల్లో ప్రతి విజయగాథలోనూ ‘ఇండియన్’ కోసం చూసే మానసిక స్థితి నుంచి మనం బయటపడాలి. మన తీరాన్ని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లినవారు మనవారు కానే కారు. అతడు అతిపెద్ద సవా లును స్వీకరించాడు. కానీ బాబీ జిందాల్ అమెరికా అధ్యక్షుడు లేదా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి కి అభ్యర్థి అవుతాడో లేదో మనకు తెలీదు. అమెరికాలో ఒక రాష్ట్ర గవర్నర్‌గా, కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికైన భార త సంతతికి చెందిన తొలి వ్యక్తిగా తను వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షు డవుతారని కూడా భావిస్తున్నారు. తన రంగు పట్ల పెద్దగా పట్టింపులేని బరాక్ ఒబామాలాగే, జిందాల్ మూలం విషయంలో కూడా అమెరికన్లకు పెద్దగా పట్టింపు ఉండకూడదు. అలా ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. అయితే, భారత సంతతి అమెరికన్‌గా తన గుర్తింపును తృణీకరించినందున బాబీ జిందాల్ భారత్‌లో వార్తల్లో కొనసాగుతూ వస్తున్నారు. అమెరికాలోనే పుట్టినందున తాను అమెరికా పౌరుడినేనని బాబీ భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం అసంగతమైన విషయం చోటుచేసుకుంది. తన వాదనను నిరూపించుకో వడానికి బాబీ తన అసలు రంగుకంటే ఎక్కువ తెల్లగా ఉండే తైల వర్ణ చిత్రాన్ని ప్రదర్శించు కునేంత వరకు పోయాడు. తాను అమెరికన్‌ని మాత్రమే అని జిందాల్ పేర్కొనడం సరైనదే. అతడిని వ్యతిరేకించడానికి మనమెవ్వరం? అతడు అమెరికాకు వలస వచ్చిన కుటుం బానికి చెందిన వాడు. తను భారత్‌కు చేసిందేమీ లేదు. భారత్‌తో తనకెలాంటి సంబంధమూ లేదు. తన పౌరసత్వ స్థాయికి ‘ఇండియన్’ని జోడించడానికి అతడు తిరస్కరించడం ఏమంత ప్రాధాన్యత కలిగిన విషయం కాదు. యూఎస్ వంటి నానావిధమైన జాతులు కల దేశంలో వివిధ భౌగోళిక మూలాలకు చెందిన ప్రజలు, జాతులు తామెక్కడినుంచి వచ్చామన్నది పెద్దగా పట్టించుకోలేరు. అయితే నల్లజాతి ప్రజలను వేరు చేసి చూపడానికి ‘ఆఫ్రో-అమెరికన్’ వంటి పదబంధాలను వాడే ధోరణి కూడా అక్కడ కొనసాగుతోంది. కానీ అది అమెరికన్ సమస్య. బాబీ జిందాల్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు పీయూష్. తర్వాత అతడు తన పేరును బాబీ అని మార్చుకున్నాడు. పంజాబ్‌లోని మలెర్‌కోట్లా నుంచి తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లిన తర్వాత కొంత కాలానికే బాబీ పుట్టాడు. ఈ విషయంలో తన జాతీయత గురించి తను చెప్పుకునేది నిజమే. తను అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభుత్వ పదవి చేపట్టాలనుకున్న వ్యక్తి తన జీవితానికి సంబం ధించిన వాస్తవాలకు కట్టుబడాలని కోరుకుంటా డు కాబట్టి ఈ అంశంలో జిందాల్ వైఖరి ప్రశంస నీయమే. ఒక హైపన్తో ‘ఇండియన్’ అనే ఉపసర్గను తన పేరుకు జోడించడం వల్ల పెద్దగా మార్పేమీ జరగదు. అలాగే తన విశ్వాసాలను మార్చుకునే హక్కు కూడా అతడికి ఉంది. అతడు క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు కూడా. ఒక విలక్షణమైన అర్హతతో ముడిపడనటు వంటి గుర్తింపు సమస్య మన దేశంలో భారతీ యులను చికాకుపర్చడం వింతగొలుపుతుంది. అందులోనూ అమెరికాకు నిత్యం ప్రయాణాలు కొనసాగిస్తూ అమెరికా పాస్‌పోర్ట్ లభిస్తే పండు గ చేసుకునేటటువంటి పౌరులున్న మన దేశంలో ఇలా జరగటమే ఒక వింత. అమెరికా పాస్ పోర్ట్ పొందటమం టేనే తమ భారతీయ పౌరసత్వాన్ని వదులు కోవటమని అర్థం. అమెరికాలో ఒక స్టూడెంట్ వీసా, ఉద్యోగం, గ్రీన్ కార్డ్, తర్వాత అక్కడే పౌరసత్వం కోసం భారతీ యులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. దీన్ని ఒకప్పుడు ‘మేథోవలస’ అనేవాళ్లు. ప్రతిభ అనేది ప్రపంచవ్యాప్త చలనంగా మారి పోయిన కాలంలో (పైలట్ల కొరత కారణంగా విమానయాన సంస్థలు దేశీయ మార్గాల్లో విమాన చోదకత్వానికి కూడా అధిక వేతనాలు ఇచ్చి పరదేశీయులను నియమించుకుంటు న్నంత వరకు) ఇదేమంత తీవ్రమైన అడ్డంకి కాదు. మంచి అవకాశాలను పరిమితంగా అందించే పేలవమైన వ్యవస్థల కారణంగా దేశా న్ని కూడా ఇందుకు తప్పుపట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటీ.. చివరకు ఐఐఎమ్‌లు, ఐఐటీల స్వతంత్ర ప్రతిపత్తిని కూడా రాజకీయనేతలు దెబ్బతీస్తున్న నేపథ్యంలో భారత్‌కు ఈ మేథో వలస అవసరమనే ఎవరైనా చెబుతారు. విదేశాల్లోని ప్రతి విజయగాథలోనూ ‘ఇండియన్’ కోసం చూసే మానసిక స్థితి నుంచి మనం బయటపడవలసిన సమయం ఇది. అ యితే ‘ఇండియన్’ అని అండర్లైన్ చేయడం ద్వారా మనది కాని వైభవం కోసం చూడటం అనేది ఒక వేలంవెర్రిలా మారింది (భారత సంతతి వ్యక్తి ఈ బహుమతి గెల్చుకున్నారు, టాప్ కార్పొరేట్ ఉద్యోగం సాధించారు లేదా సైన్స్‌లో అద్భుతమైన ఆవిష్కరణ కనిపెట్టారు వంటివి ఈ కోవకు చెందినవే). పైగా వార్తా పత్రికల్లో ఇలాంటి వార్తలను నిత్యం పేర్కొంటూ వస్తున్నారు. నిజానికి ఇలాంటి వార్తలు అలాంటి గుర్తింపును నొక్కి చెప్పడంతో ప్రారంభమ వుతుంటాయి. ఇలాంటి ఆరాధనా తత్వం ఎంత వింత స్థాయికి చేరుకున్నదంటే, ఇటీవల ఆస్ట్రేలియా లో తన మనవడిని కాపాడటానికి ఒక తాత నడుస్తున్న రైలునుంచి ఎగిరి దుమికితే ఆ వార్త ‘ఇండియన్ గ్రాండ్‌ఫాదర్’ అయి కూర్చుంది. మనవడి కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టబోయిన ఆ వ్యక్తి జాతీయతను ఆస్ట్రేలియన్ వార్తా పత్రికలు వార్త చివరలో మాత్రమే పొందుపర్చాయి. అది నిజంగా సంబరమే అవుతుంది కానీ మన పురా వైభవానికి పరవశిం చడంలా ఉండదు. గూగుల్‌లో ఇండియాలో పుట్టిన వ్యక్తి (ఇండియా బార్న్) అనే పదం కోసం వెతికితే 4,98,00,000 ఫలితాలు కనిపిస్తా యి. అదే భారత సంతతి (ఇండియన్ ఆరిజన్) అనే పదం కోసం వెతికితే 2,75,00,000 ఫలితా లు కనిపిస్తాయి. దీంట్లో గర్వపడాల్సింది ఏముంది? ఒక విషయాన్ని మనం మర్చిపోవద్దు. మన తీరాన్ని, మన గడ్డను శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లినవారు ఇకపై మనవారు కానే కారు. ఇక బాబీ జిందాల్ విషయానికి వస్తే ఆయన ఇండియాలో పుట్టనే లేదు. అతడినీ, అతడిలాంటి వారినీ అలాగే ఉండనిద్దాం. మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
ఒబామా, హిల్లరీలపై జిందాల్ విమర్శలు
వాషింగ్టన్: స్వలింగ సంపర్కుల వివాహాలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అభిప్రాయాలను భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ విమర్శించారు. ఓపినియన్ పోల్స్ ఆధారంగా 'గే' పెళ్లిళ్లపై వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు మాదిరిగానే వారు కూడా ఓపినియన్ పోల్స్ చదివి తమ దృక్పథాన్ని వ్యక్త పరిచారని విమర్శించారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ అమెరికా సాధించిన విజయమని ఒబామా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మైలురాయి అని హిల్లరీ ప్రశంసించారు. అయితే క్తైస్తవ మతాచారం ప్రకారం వివాహాలపై తనకు నిశ్చితాభిప్రాయం ఉందని జిందాల్ తెలిపారు. కోర్టు తీర్పు ఆధారంగా తన అభిప్రాయాన్ని మార్చుకోనని స్పష్టం చేశారు. పెళ్లి అనేది స్త్రీ, పురుషుడు మధ్య జరిగేది అని పేర్కొన్నారు. ఎన్ బీసీ న్యూస్ ఆదివారం నిర్వహించిన 'మీట్ ద ప్రెస్'లో జిందాల్ పాల్గొన్నారు. 44 ఏళ్ల రిపబ్లికన్ పార్టీ తరపు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. -
బాబీ జిందాల్ మనోడేనా ?
హైదరాబాద్: రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న లూసియానా 55వ గవర్నర్, భారత సంతతికి చెందిన యువ రాజకీయ నాయకుడు బాబీ జిందాల్ మనోడేనా ? అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సముచిత స్థానం కల్పిస్తారా? వర్ధమాన దేశమైన భారత్ అభివృద్ధికి ఏరకంగానైనా సాయపడే వ్యక్తేనా ? అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం కోసం కృషి చేస్తారా ? భారత్‌లోని పంజాబ్ నుంచి వలసపోయిన ఓ కుటుంబంలో కన్ను తెరిచిన జిందాల్ పుణికిపుచ్చుకున్న సంస్కృతి ఏమిటి? రాజకీయంగా ఆయన ఎదుగుదలను, అమెరికాలో ఏ వర్గాలకు ఆయన ప్రాతినిథ్యం వహించారో, ప్రస్తుతం ఏ వర్గాల ప్రయోజనాల కోసం పరితపిస్తున్నారో! అన్న అంశాలను విశ్లేషిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. వాస్తవంగా పియూష్ జిందాల్ అని తల్లిదండ్రులు పెట్టిన పేరులోని ‘పియూష్’ అనే భారతీయ నామాన్ని ఆయన తొలగించుకొని ఆ స్థానంలో బాబీ అని తగిలించుకున్నారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని వదిలేసినా ఆయన వేషధారణలోగాని, మాట్లాడే భాష, ఆ భాష యాసలోగానీ ఆహార అలవాట్లలోగానీ ఎక్కడా భారతీయత కనిపించదు. ఇక్కడ అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల్లో ప్రధానంగా రెండు రకాల వారున్నారనే విషయాన్ని ప్రస్తావించాలి. మొదటిరకం... అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆహార్యంలోనూ ఆహార అలవాట్లలోనూ భారతీయ సంప్రదాయాలనే పాటించేవారు. భారతీయ కళలు, సంస్కృతిని అభిమానించేవారు. రెండోరకం..అమెరికా సంస్కృతిని అలవర్చుకొని వారి యాసలో, వారి భాషలో మాట్లాడడమే కాకుండా ఆహారపు అలవాట్లతోపాటు అన్నింటా అచ్చం వారిలాగే ప్రవర్తిస్తూ వారిలో భాగమైపోయేవారు. ఈ రెండో రకానికి చెందిన వాడే బాబీ జిందాల్. జిందాల్ ఏ రోజు కూడా భారతీయ కాకస్ గ్రూపులో భాగమైన వ్యక్తి కాదు. భారతీయ ప్రయోజనాల కోసం ఎన్నడూ కృషి చేయలేదు. భారత్ నుంచి వచ్చిన రాజనీయ నాయకులను మర్యాదపూర్వకంగా కలుసుకున్న సందర్భాలు కూడా లేవు. కనీసం తాను భారత సంతతికి చెందిన వ్యక్తిగా ఎన్నడూ చెప్పుకోలేదు. 2003లో మొదటిసారి లూజియానా గవర్నర్‌గా పోటీ చేసినప్పుడు కూడా అమెరికాలోని భారతీయులను పట్టించుకోలేదు. అప్పుడు ఆయన ఓడిపోయారు. తిరిగి 2007లో పోటీ చేసినప్పుడు మాత్రం ఆయన భారతీయ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. ఇతర రాష్ట్రాల నుంచి పోగేసిన భారతీయులను స్వరాష్ట్ర ప్రచారానికి ఉపయోగించుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలిచి అమెరికాలో ఓ రాష్ట్రానికి గవర్నరైన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2011లో తిరిగి ఎన్నికై ఇప్పటికీ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. నల్లజాతీయుల పట్ల వివక్షచూపే వ్యక్తిగా అక్కడి రాజకీయాల్లో ఆయనపై ముద్ర పడింది. లూసియానాలోని న్యూ ఆర్లీయాన్స్ నగరంలో నల్ల జాతీయులు ఎక్కువగా ఉంటారు. కత్రినా తుఫాను కారణంగా అక్కడ నల్లజాతీయులు తీవ్రంగా నష్టపోతే వారి పునరావాసం కోసం కృషి చేయకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. అమెరికాలో నివసిస్తూ వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించి భారతీయ ప్రతిష్టను దిగంతాలకు తీసుకెళ్లిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, హరగోవింద్ ఖురానా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, జుంపా లహరి లాంటి వ్యక్తుల సరసన జిందాల్‌ను చేర్చడం సమంజసమా? రేపు కాలమే సమాధానం చెప్పాలి. -
అమెరికా అధ్యక్ష పోటీలో మనోడు!
వాషింగ్టన్: ప్రపంచానికి పెద్దన్నగా చెలామణీ అవుతోన్న అమెరికా దేశానికి అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన వ్యక్తి పోటీ పడతారో లేదో మరి కొద్ది గంటల్లో తేతిపోనుంది. 2016లో జరగనున్న ఎన్నికల రేసు మొదలైన దగ్గర్నుంచి.. 'అతడే గెలుపు గుర్రం' అని అందరిచేతా అనిపించుకున్న లూసీయానా గవర్నర్ బాబీ జిందాల్ మరి కొద్దసేపట్లో తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున బాబీతోపాటు పదకొండు మంది ప్రముఖులు అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. వారిలో మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ సోదరుడు, ఫ్లోరిడా మాజీ గవర్నర్ జెబ్ బుష్, న్యూరో సర్జన్ బెన్ కార్సన్, టెక్సాస్ సెనెటర్ టెడ్ క్రూజ్, హెచ్‌పీ (హ్యులెట్ ప్యాకర్డ్) సంస్థ మాజీ సీఈవో కార్లీ ఫియోరీనా, 2008లో అధ్యక్ష స్థానంకోసం పోటీచేసి ఓడిపోయిన మైక్ హుక్కాబీ తదితరులు ఉన్నారు. అయితే అపారమైన పాలనా అనుభవంతోపాటు సమర్థుడైన నాయకుడిగా పేరుతెచ్చుకున్న బాబీ జిందాల్ రేసులో అందరికంటే ముందున్నారు. పైగా ప్రస్తుతం అత్యంత ప్రధానమైన రిపబ్లికన్ గవర్నర్ల అసోసియేషన్‌కు ఆయన చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అంతేకాదు విధాన పరమైన అంశాల్లో ప్రత్యర్థి డెమోక్రాట్ పార్టీని చీల్చి చెండాడటంలో రిపబ్లికన్ల తరఫున బాబీని మించిన వ్యక్తి ఎవరూ లేరు. ఇప్పటికే ఆయనకు 'వోకల్ క్రిటిక్ ఆఫ్ ఒబామా' అనే పేరుంది. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్‌ను ఇప్పటికే తన విమర్శనాస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు బాబీ జిందాల్. -
‘అమెరికన్లుగా మారడానికే ఇక్కడికొచ్చాం’
వాషింగ్టన్: తన తల్లిదండ్రులు 40 ఏళ్ల కిందట అమెరికాకు వచ్చింది అమెరికన్లుగా మారడానికే తప్ప ఇండియన్ అమెరికన్లుగా పిలిపించుకోవడానికి కాదని భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ అన్నారు. జిందాల్ సోమవారం లండన్ హెన్రీజాక్సన్ సొసైటీలో ప్రసంగించాల్సి ఉన్న నేపథ్యంలో అందులో కొంత భాగాన్ని ఆయనఆఫీసు విడుదల చేసింది. -
అమీ బెరాకు ఏఏహెచ్ఓఏ శుభాకాంక్షలు
వాషింగ్టన్: యూఎస్ చట్టసభకు మరోసారి ఎన్నికైన ఇండియన్ అమెరికన్ అమీ బెరాకు ఆసియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ (ఏఏహెచ్ఓఏ) శుభాకాంక్షలు తెలిపింది. అమీ బెరాకు మద్దతు ఇస్తున్నందుకు తామంతా గర్విస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ఏఏహెచ్ఓఏ ఛైర్మన్ ప్రతీక పటేల్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. యూఎస్ చట్టసభకు ఎన్నికైనా అమీ బెరా ఏఏహెచ్ఓఏలో సభ్యుడని ఆమె గుర్తు చేశారు. ఆయనతో పని చేస్తూ అతిథ్య రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని తెలిపారు. దాదాపు పక్షం రోజుల క్రితం జరిగిన కాలిఫోర్నియాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమీబెరా గెలుపొందారు. 2012లో అమీబెరా యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్‌కు ఎన్నికయ్యారు. యూఎస్ చట్టసభకు ఎన్నికైన మూడో ఇండియన్ అమెరికన్‌గా అమీబెరా చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు బాబీ జిందాల్, దలిప్ సింగ్ సంద్లు ఎన్నికయ్యారు. -
అధ్యక్ష రేసులో మనోడు
ప్రపంచానికి పెద్ద అన్నయ్య అయిన అమెరికా దేశాధ్యక్షుడిగా భారతీయ మూలాలున్న వ్యక్తి ఎన్నికైతే ఎలా ఉంటుంది? అలాంటి అవకాశం త్వరలోనే వచ్చేలా ఉంది. తాజాగా వెలువడుతున్న వరుస కథనాలను బట్టి చూస్తే.. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్న బాబీ జిందాల్ పోటీ చేయొచ్చని తెలుస్తోంది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పార్టీలు తమ అభ్యర్థులు ఎంపిక కసరత్తును మొదలుపెట్టాయి. ఇందుకోసం చర్చల మీద చర్చలు జరుపుతూ మేథోమథనం చేస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ మాత్రం లూసియానా గవర్నర్ బాబీ జిందాల్‌ను నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. లూసియానా గవర్నర్‌గా బాబీ జిందాల్ రెండుసార్లు ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2015తో ముగియనుంది. ఆ తర్వాత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అమెరికాలో స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య రోజురోజూకు పెరిగిపోతుంది. అధ్యక్ష ఎన్నికల్లో వాళ్ల ఓట్లు కూడా చాలా కీలకమే. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాలకు అత్యంత ప్రీతిప్రాతులైన వ్యక్తుల్లో బాబి జిందాల్ ఒకరు. వైట్ హౌస్‌లో కీలక పదవుల్లో పని చేసిన అనుభవం బాబి సొంతం. అటు అమెరికన్లు, ఇటు భారతీయుల మనస్సులు గెలుచుకోగల సత్తా ఒక్క బాబీకే ఉందని రిపబ్లికన్లు భావిస్తున్నారు. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తిమంతమైన 10 మంది వ్యక్తుల్లో బాబీ జిందాల్ ఒకరని ఇటీవల ఓ సర్వేలో తేలింది. దీంతో ఆ పార్టీలో దాదాపు 70 శాతం మంది బాబీవైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే అధ్యక్ష పదవికి అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నాయకులు ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన బాబీ జిందాల్ కుటుంబం పూర్వీకులు అమెరికాకు ఎప్పుడో వలస వెళ్లారు. ఆ కుటుంబం అక్కడ స్థిరపడింది. 1979లో బాబీ జిందాల్ జన్మించారు. అక్కడే ఆయన సైన్స్, న్యాయశాస్త్రాలలో పట్టా పొందారు. సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన బాబీ జిందాల్ దేశాధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. -
‘వైట్‌హౌస్ రేస్’పై ఆలోచిస్తున్నా: బాబీ జిందాల్
వాషింగ్టన్: 2016లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని లూసియానా రాష్ట్ర గవర్నర్, భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ తెలిపారు. దీనిపై తీవ్రంగా ఆలోచిస్తున్నానన్నారు. ‘వైట్‌హౌస్ రేస్’లో పాల్గొనడంపై ఈ నవంబర్ తరవాతే ఏ నిర్ణయమైనా ఉంటుందన్నారు. 2012 అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం అనంతరం తెలివితక్కువగా వ్యవహరించడం ఆపేయాలంటూ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి సూచించి జిందాల్ సంచలనం సృష్టించడం తెలిసిందే. జిందాల్ లూసియానా గవర్నర్‌గా ఇప్పటికి రెండోసారి పనిచేస్తున్నారు. ఆయన పదవీకాలం 2015తో ముగుస్తుంది. ఎటూ మూడోసారి ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా పోటీ చేయలేరు. వెటెర్ ఈసారి గవర్నర్ పదవికి పోటీ పడతారని భావిస్తున్నారు. అశేష ప్రజాదరణ ఉన్న బాబీ జిందాల్ అధ్యక్ష పదవికి సరైన అభ్యర్థి అని పలువురు భావిస్తున్నారు. -
'బరాక్ ఒబామా చేతులెత్తేశారు'
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించడంలో విఫలమైన ఒబామా చేతులెత్తేశారని జిందాల్ ఆరోపించారు. అర్ధిక వ్యవస్థ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషి చేయకుండా.. పరిమితమైన కార్యనిర్వహక చర్యల దృష్టిపెడుతున్నారని జిందాల్ విమర్శించారు. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థను కనీస వేతన అర్ధిక వ్యవస్థ ప్రకటించడం ఓటిమి ఒప్పుకుంటూ తెల్ల జెండాను ఎగురవేయమేనని జిందాల్ వ్యాఖ్యలు చేశారు. ఒబామాతో జరిగిన వివిధ రాష్టాల గవర్నర్ల సమావేశంలో జిందాల్ మాట్లాడుతూ.. ఉభయ పక్షాల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ మరింత పురోగతి సాధించడానికి అవకాశముంది అనే అభిప్రాయాన్ని జిందాల్ వ్యక్తం చేశారు. ఫెడరల్ కాంట్రాక్టర్లకు గంటకు 10.10 డాలర్ల కనీస వేతనాన్ని చెల్లించాలని ఒబామా కార్యనిర్వాహక నిర్ణయం తీసుకోవడాన్ని జిందాల్ తప్పుపట్టారు. తప్పుడు నిర్ణయాలను తీసుకోవడానికి వైట్ హౌజ్ తన శక్తులను వినియోగిస్తోంది అని జిందాల్ ఆరోపించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో ఉన్న జిందాల్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాబీ జిందాల్!
అమెరికా లాంటి అగ్రరాజ్యానికి ఓ భారతీయుడు అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుందా? అవునంటున్నారు అక్కడి నాయకులు. 2016లో అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి, ప్రస్తుత లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ పోటీ పడతారని ఆ రాష్ట్రానికి చెందిన ఓ సెనేటర్ చెబుతున్నారు. ఆయన తప్పకుండా పోటీ చేస్తారని, ఆయన చాలా మంచి అభ్యర్థి అని సెనేటర్ డేవిట్ విటెర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తనకు బాబీ జిందాల్ అంటే ఇష్టమని, ఆయన నాయకత్వం అంటే గౌరవం ఉందని, ఆయన రాజకీయ విలువలన్నింటితో తాను ఏకీభవిస్తానని చెప్పారు. బాబీ జిందాల్ అధ్యక్ష పదవికి పోటీ పడతారంటే ఇక్కడ అందరూ సంతోషిస్తారని, అందరి దృష్టీ ఇటువైపే ఉంటుందని కూడా సెనేటర్ విటెర్ చెప్పారు. జిందాల్ లూసియానా గవర్నర్‌గా ఇప్పటికి రెండోసారి పనిచేస్తున్నారు. ఆయన పదవీకాలం 2015తో ముగుస్తుంది. ఎటూ మూడోసారి ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా పోటీ చేయలేరు. వెటెర్ ఈసారి గవర్నర్ పదవికి పోటీ పడతారని భావిస్తున్నారు. అశేష ప్రజాదరణ ఉన్న బాబీ జిందాల్ అధ్యక్ష పదవికి సరైన అభ్యర్థి అని పలువురు భావిస్తున్నారు. -
నిక్కీ హేలీకి నిధులు సేకరిస్తా: జిందాల్
దక్షిణ కరోలినా గవర్నర్‌గా మరోసారి ఎన్నికయ్యేందుకు నిక్కీ హేలీకి సహకరించాలని ప్రముఖ కన్జర్వేటివ్ నాయకులను లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ కోరారు. తన స్నేహితురాలైన నిక్కీ హేలీ ద్వితీయ పర్యాయం దక్షిణ కరోలినా గవర్నర్ పీఠాన్ని అధిష్టించేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన మద్దతుదారులకు బాబీ జిందాల్ ఈ-మెయిల్ సందేశం పంపారు. 41 ఏళ్ల నిక్కీ హేలీ ప్రస్తుతం దక్షిణ కరోలినా గవర్నర్‌గా కొనసాగుతున్నారు. చిన్న వయసులో అమెరికాలో గవర్నర్ పదవిని చేపట్టిన భారత సంతతి మహిళగా ఆమె ఖ్యాతికెక్కారు. కాగా, మరోసారి గవర్నర్ పదవిపై గురిపెట్టిన నిక్కీ హేలీ... బాబీ జిందాల్, టెక్సాస్, విస్కాన్సిన్ గవర్నర్లు సమక్షంలో సోమవారం ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిక్కీ హేలీ ప్రచారానికి నిధులు సేకరించేందుకు సిద్ధగా ఉన్నానని ఈ సందర్భంగా బాబీ జిందాల్ ప్రకటించారు. 20 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ నిధులిచ్చి సహకరించాలని రిపబ్లికన్లను ఆయన కోరారు. -
బాబీ జిందాల్‌కు పెరుగుతున్న మద్దతు
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీపడేందుకు భారతీయ సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ అన్ని విధాల అర్హుడైన వ్యక్తి అని ఆ రాష్ట ప్రజలు భావిస్తున్నారని తాము చేపట్టిన సర్వేలో వెల్లడైందని రిపబ్లికన్ పార్టీ మంగళవారం ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు 2016లో దేశాధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో లూసియానా రాష్ట్ర ప్రజలు బాబీ జిందాల్ వైపు మొగ్గు చూపుతున్నారని ఆ సర్వే పేర్కొంది. కాగా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాకు అనుకూలంగా 37 శాతమే ఓటు వేశారని వెల్లడించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒబామా హెల్త్ కేర్ చట్టంపై సంతకం చేయడంతో స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా అమెరికన్లు ఆ చట్టాన్ని ఒబామా కేర్ అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే బాబీ జిందాల్ వరుసగా రెండో సారి లూసియానా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే మూడో సారి ఆయన ఆ పదవిని చేపట్టేందుకు అంతగా ఇష్టపడటం లేదని పలువురు వెల్లడిస్తున్నారు.