అధ్యక్ష రేసు నుంచి తప్పుకొన్న బాబీ జిందాల్
లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. 2016లో జరగనున్న అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీలో ఉన్న ఆయన.. మంగళవారం తన ప్రచారాన్ని నిలిపివేశాడు. ఈ సందర్భంగా జిందాల్ మాట్లాడుతూ రిపబ్లికన్ పార్టీ తరపున మరో అభ్యర్థిని తాను బలపరచదలచుకోలేదన్నారు. అయితే పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి మద్దతు ఇస్తానని తెలిపారు. అధ్యక్ష రేసు కోసం ఎంతో సమయాన్ని విధానాల తయారీకి, ఇతరత్రా విషయాల కోసం వెచ్చించినట్లు వెల్లడించాడు. అయితే ఇది తనకు సరైన సమయం కానందున రేసు నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావించినట్లు తెలిపాడు. బాబీ జిందాల్ తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీ తరపున ఇంకా బరిలో 14 మంది అభ్యర్థులు మిగిలారు.
బాబీ జిందాల్ తన ప్రచారంలో మొదటగా ఎన్నికలు జరిగే లోవా ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. అయితే అక్కడి ఓటర్ల నుంచి ఆశించినంత మేర ఆదరణ జిందాల్కు లభించలేదు. అంతేకాకుండా రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న బలమైన ఇతర అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, బెన్ కార్సన్ల నుంచి ఎదురవుతన్న పోటీలో జిందాల్ వెనుకబడ్డాడు. నిధుల సమీకరణలో కూడా జిందాల్‌కు నిరాశ తప్పలేదు. వీటన్నింటి దృష్ట్యా ప్రాక్టికల్‌గా ఆలోచించి జిందాల్ పోటీ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.