బాబీగానే ఉండనివ్వండి..!
సందర్భం
విదేశాల్లో ప్రతి విజయగాథలోనూ ‘ఇండియన్’ కోసం చూసే మానసిక స్థితి నుంచి మనం బయటపడాలి. మన తీరాన్ని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లినవారు మనవారు కానే కారు.
అతడు అతిపెద్ద సవా లును స్వీకరించాడు. కానీ బాబీ జిందాల్ అమెరికా అధ్యక్షుడు లేదా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి కి అభ్యర్థి అవుతాడో లేదో మనకు తెలీదు. అమెరికాలో ఒక రాష్ట్ర గవర్నర్‌గా, కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికైన భార త సంతతికి చెందిన తొలి వ్యక్తిగా తను వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షు డవుతారని కూడా భావిస్తున్నారు. తన రంగు పట్ల పెద్దగా పట్టింపులేని బరాక్ ఒబామాలాగే, జిందాల్ మూలం విషయంలో కూడా అమెరికన్లకు పెద్దగా పట్టింపు ఉండకూడదు. అలా ఉన్నట్లు కూడా కనిపించడం లేదు.
అయితే, భారత సంతతి అమెరికన్‌గా తన గుర్తింపును తృణీకరించినందున బాబీ జిందాల్ భారత్‌లో వార్తల్లో కొనసాగుతూ వస్తున్నారు. అమెరికాలోనే పుట్టినందున తాను అమెరికా పౌరుడినేనని బాబీ భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం అసంగతమైన విషయం చోటుచేసుకుంది. తన వాదనను నిరూపించుకో వడానికి బాబీ తన అసలు రంగుకంటే ఎక్కువ తెల్లగా ఉండే తైల వర్ణ చిత్రాన్ని ప్రదర్శించు కునేంత వరకు పోయాడు. తాను అమెరికన్‌ని మాత్రమే అని జిందాల్ పేర్కొనడం సరైనదే. అతడిని వ్యతిరేకించడానికి మనమెవ్వరం?
అతడు అమెరికాకు వలస వచ్చిన కుటుం బానికి చెందిన వాడు. తను భారత్‌కు చేసిందేమీ లేదు. భారత్‌తో తనకెలాంటి సంబంధమూ లేదు. తన పౌరసత్వ స్థాయికి ‘ఇండియన్’ని జోడించడానికి అతడు తిరస్కరించడం ఏమంత ప్రాధాన్యత కలిగిన విషయం కాదు. యూఎస్ వంటి నానావిధమైన జాతులు కల దేశంలో వివిధ భౌగోళిక మూలాలకు చెందిన ప్రజలు, జాతులు తామెక్కడినుంచి వచ్చామన్నది పెద్దగా పట్టించుకోలేరు. అయితే నల్లజాతి ప్రజలను వేరు చేసి చూపడానికి ‘ఆఫ్రో-అమెరికన్’ వంటి పదబంధాలను వాడే ధోరణి కూడా అక్కడ కొనసాగుతోంది. కానీ అది అమెరికన్ సమస్య.
బాబీ జిందాల్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు పీయూష్. తర్వాత అతడు తన పేరును బాబీ అని మార్చుకున్నాడు. పంజాబ్‌లోని మలెర్‌కోట్లా నుంచి తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లిన తర్వాత కొంత కాలానికే బాబీ పుట్టాడు. ఈ విషయంలో తన జాతీయత గురించి తను చెప్పుకునేది నిజమే. తను అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభుత్వ పదవి చేపట్టాలనుకున్న వ్యక్తి తన జీవితానికి సంబం ధించిన వాస్తవాలకు కట్టుబడాలని కోరుకుంటా డు కాబట్టి ఈ అంశంలో జిందాల్ వైఖరి ప్రశంస నీయమే. ఒక హైపన్‌తో ‘ఇండియన్’ అనే ఉపసర్గను తన పేరుకు జోడించడం వల్ల పెద్దగా మార్పేమీ జరగదు. అలాగే తన విశ్వాసాలను మార్చుకునే హక్కు కూడా అతడికి ఉంది. అతడు క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు కూడా.
ఒక విలక్షణమైన అర్హతతో ముడిపడనటు వంటి గుర్తింపు సమస్య మన దేశంలో భారతీ యులను చికాకుపర్చడం వింతగొలుపుతుంది. అందులోనూ అమెరికాకు నిత్యం ప్రయాణాలు కొనసాగిస్తూ అమెరికా పాస్‌పోర్ట్ లభిస్తే పండు గ చేసుకునేటటువంటి పౌరులున్న మన దేశంలో ఇలా జరగటమే ఒక వింత. అమెరికా పాస్ పోర్ట్ పొందటమం టేనే తమ భారతీయ పౌరసత్వాన్ని వదులు కోవటమని అర్థం. అమెరికాలో ఒక స్టూడెంట్ వీసా, ఉద్యోగం, గ్రీన్ కార్డ్, తర్వాత అక్కడే పౌరసత్వం కోసం భారతీ యులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.
దీన్ని ఒకప్పుడు ‘మేథోవలస’ అనేవాళ్లు. ప్రతిభ అనేది ప్రపంచవ్యాప్త చలనంగా మారి పోయిన కాలంలో (పైలట్ల కొరత కారణంగా విమానయాన సంస్థలు దేశీయ మార్గాల్లో విమాన చోదకత్వానికి కూడా అధిక వేతనాలు ఇచ్చి పరదేశీయులను నియమించుకుంటు న్నంత వరకు) ఇదేమంత తీవ్రమైన అడ్డంకి కాదు. మంచి అవకాశాలను పరిమితంగా అందించే పేలవమైన వ్యవస్థల కారణంగా దేశా న్ని కూడా ఇందుకు తప్పుపట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటీ.. చివరకు ఐఐఎమ్‌లు, ఐఐటీల స్వతంత్ర ప్రతిపత్తిని కూడా రాజకీయనేతలు దెబ్బతీస్తున్న నేపథ్యంలో భారత్‌కు ఈ మేథో వలస అవసరమనే ఎవరైనా చెబుతారు.
విదేశాల్లోని ప్రతి విజయగాథలోనూ ‘ఇండియన్’ కోసం చూసే మానసిక స్థితి నుంచి మనం బయటపడవలసిన సమయం ఇది. అ యితే ‘ఇండియన్’ అని అండర్‌లైన్ చేయడం ద్వారా మనది కాని వైభవం కోసం చూడటం అనేది ఒక వేలంవెర్రిలా మారింది (భారత సంతతి వ్యక్తి ఈ బహుమతి గెల్చుకున్నారు, టాప్ కార్పొరేట్ ఉద్యోగం సాధించారు లేదా సైన్స్‌లో అద్భుతమైన ఆవిష్కరణ కనిపెట్టారు వంటివి ఈ కోవకు చెందినవే). పైగా వార్తా పత్రికల్లో ఇలాంటి వార్తలను నిత్యం పేర్కొంటూ వస్తున్నారు. నిజానికి ఇలాంటి వార్తలు అలాంటి గుర్తింపును నొక్కి చెప్పడంతో ప్రారంభమ వుతుంటాయి.
ఇలాంటి ఆరాధనా తత్వం ఎంత వింత స్థాయికి చేరుకున్నదంటే, ఇటీవల ఆస్ట్రేలియా లో తన మనవడిని కాపాడటానికి ఒక తాత నడుస్తున్న రైలునుంచి ఎగిరి దుమికితే ఆ వార్త ‘ఇండియన్ గ్రాండ్‌ఫాదర్’ అయి కూర్చుంది. మనవడి కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టబోయిన ఆ వ్యక్తి జాతీయతను ఆస్ట్రేలియన్ వార్తా పత్రికలు వార్త చివరలో మాత్రమే పొందుపర్చాయి. అది నిజంగా సంబరమే అవుతుంది కానీ మన పురా వైభవానికి పరవశిం చడంలా ఉండదు. గూగుల్‌లో ఇండియాలో పుట్టిన వ్యక్తి (ఇండియా బార్న్) అనే పదం కోసం వెతికితే 4,98,00,000 ఫలితాలు కనిపిస్తా యి. అదే భారత సంతతి (ఇండియన్ ఆరిజన్) అనే పదం కోసం వెతికితే 2,75,00,000 ఫలితా లు కనిపిస్తాయి. దీంట్లో గర్వపడాల్సింది ఏముంది?
ఒక విషయాన్ని మనం మర్చిపోవద్దు. మన తీరాన్ని, మన గడ్డను శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లినవారు ఇకపై మనవారు కానే కారు. ఇక బాబీ జిందాల్ విషయానికి వస్తే ఆయన ఇండియాలో పుట్టనే లేదు. అతడినీ, అతడిలాంటి వారినీ అలాగే ఉండనిద్దాం.
మహేష్ విజాపుర్కార్
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com)