బొత్సకు స్వల్పస్థాయిలో బ్రెయిన్ స్ట్రోక్
సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. మాట తడబడటం, నీరసంగా ఉన్నట్టు అనిపించడంతో ఉదయం 11 గంటల సమయంలో ఆయన నేరుగా బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి వెళ్లారు. వెంటనే ఎంఆర్‌ఐ, ఇతర పరీక్షలు నిర్వహించారు. మెదడులో రక్తం గడ్డ (క్లాట్-మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్) కట్టడంతో స్వల్ప స్థాయిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో బొత్సను వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కేర్‌కు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ సోమరాజు, నరాల సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో బొత్సకు వైద్యసేవలు అందిస్తున్నారు. బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డిశ్చార్జి ఎప్పుడు చేయాలనేది నిర్ణయించనున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పరామర్శ
కేర్‌లో చికిత్సపొందుతున్న బొత్సను మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు. బొత్స ఆరోగ్య పరిస్థితి, ఆయనకు అందిస్తున్న వైద్యసేవల గురించి డాక్టర్ సోమరాజును అడిగి తెలుసుకున్నారు.