శాంతి విఘాతమే లక్ష్యంగా..! | Braveheart Rockey's courage saved the day for BSF | Sakshi
Sakshi News home page

శాంతి విఘాతమే లక్ష్యంగా..!

Published Fri, Aug 7 2015 12:57 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

జమ్మూలో సంతాప కార్యక్రమానికి కానిస్టేబుల్ రాకీ పార్థివదేహాన్నీ తీసుకొస్తున్న అధికారులు - Sakshi

జమ్మూలో సంతాప కార్యక్రమానికి కానిస్టేబుల్ రాకీ పార్థివదేహాన్నీ తీసుకొస్తున్న అధికారులు

పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు
* పార్లమెంట్లో హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రకటన

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో నెలకొన్న ప్రశాంత పరిస్థితిని చెదరగొట్టే లక్ష్యంతో పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు చేస్తున్న దాడుల్లో భాగమే బుధవారం నాటి ఉధంపూర్ ఉగ్రదాడి అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నా రు.  ఉగ్రవాదంపై పోరుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. దాడికి సంబంధించి గురువారం పార్లమెంటు ఉభయసభల్లో ఆయన ఒక స్వచ్ఛంద ప్రకటన చేశారు. బందీ గా చిక్కిన ఉగ్రవాదిని విచారించినప్పుడు, వారు భారత్‌లోకి ఎలా వచ్చారు? వారి ప్రణాళిక, లక్ష్యాలు ఏంటి? అనే విషయాలు వెల్లడవుతాయన్నారు.

పాక్ నుంచి నెలలో ఐదు చొరబాటు యత్నాలు చోటు చేసుకోగా.. నాలుగింటిని తిప్పికొట్టి, 8 మంది ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయన్నారు. ఉధంపూర్ ఘటనను పార్లమెంటుకు వివరిస్తూ..సజీవంగా చిక్కిన ఉగ్రవాది పేరు మొహమ్మద్ నవేద్ యాకూబ్ అని, పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందినవాడని తెలిపారు. అతడిని జమ్మూలో అధికారులు విచారిస్తున్నారన్నారు. నవేద్‌తో పాటు ఉగ్రదాడిలో పాల్గొని బీఎస్‌ఎఫ్ జవాన్ల ప్రతిదాడిలో చనిపోయిన వ్యక్తి పేరు మొహమ్మద్ నొమెన్ అలియాస్ నోమిన్ అని, అతడు పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌కు చెందినవాడని రాజ్‌నాథ్ వివరించారు.

 టైస్టుల నుంచి రెండు ఏకే 47 తుపాకులు, కొన్ని గ్రెనేడ్లు, కొంత మందుగుండు సామగ్రిని స్వాధీనపర్చుకున్నామన్నారు. ఉగ్రవాదుల దాడిలో బీఎస్‌ఎఫ్ జవాన్లు రాకీ(హరియాణ), శుభేందు రాయ్(పశ్చిమబెంగాల్)  ప్రాణాలు కోల్పోయారని, 14 మంది జవాన్లు గాయపడ్డారన్నారు. మృతుల కుటుంబీకులకు పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, ఆ ఘటనలో అత్యంత ధైర్యసాహసాలు చూపినవారికి శౌర్య పురస్కారాలందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న గ్రామస్తుల ధైర్యసాహసాలను ప్రశంసించారు.
 
ఐఎస్‌ఐ మద్దతుతోనే..!: ఉధంపూర్ ఉగ్రదాడికి పాల్పడినవారు సుశిక్షిత ఆత్మాహుతిదళ సభ్యులని తమ ప్రాథమిక విచారణలో తేలింద ని జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. వారి కి పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్‌ఐ)మద్దతుందని స్పష్టమైందన్నా రు. భారత్‌లో ఇటీవలి ఉగ్రదాడుల తీరు చూస్తుంటే.. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపే కార్యక్రమాన్ని ఐఎస్‌ఐ మరింత ఉధృతం చేసినట్లు కనిపిస్తోందని న్యూఢిల్లీలోని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. గురుదాస్‌పూర్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద లభించిన సమాచారం మేరకు పంజాబ్‌లో 2 ఆలయాలు ఒక కాలేజ్‌సహా 13 చోట్ల దాడులకు వ్యూహాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోందన్నారు.
 
ఇంటలిజెన్స్ సమాచారం లేదు: బీఎస్‌ఎఫ్
ఉధంపూర్ ఉగ్రదాడికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక నిఘా సమాచారం తమకు అందలేదని బీఎస్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్ డీకే పాఠక్ తెలిపారు. గత రెండు దశాబ్దాల్లో జమ్ము, శ్రీనగర్ హైవేపై ఇలాంటి దాడి జరగలేదని, అందువల్లే ఈ రహదారిని సాధారణంగా సురక్షితమైనదిగా భావిస్తామన్నారు. సరిహద్దులో చొరబాట్లకు అవకాశమున్న ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఉధంపూర్ దాడి లో మృతి చెందిన జవాన్లు రాకీ, శుభేందు రాయ్‌లకు జమ్మూ ప్రాంత ఐజీ రాకేశ్ శర్మ నేతృత్వంలో జమ్మూలోని కార్యాలయంలో బీఎస్‌ఎఫ్ దళాలు నివాళి ఘటించాయి. అనంతరం మృతదేహాలను వారివారి స్వస్థలాలకు పంపించారు. వారిద్దరి త్యాగం  సహచరుల ప్రాణాలను కాపాడిందని శర్మ కొనియాడారు.
 
మమ్మల్ని చంపేస్తారు: నవేద్ సజీవంగా పట్టుబడటంతో తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని అతని తండ్రి మొహమ్మద్ యాకుబ్ వాపోయాడు. విచారణలో నవేద్ ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు ఓ విలేకరి ఫోన్ చేయగా యాకుబ్ గాబరాపడుతూ దాదాపు 80సెకన్లు మాట్లాడాడు. ‘మమ్మల్ని బతకనివ్వరు. లష్కరే మా వెంటపడుతోంది. సైన్యమూ వెంటాడుతోంది’ అని ఆందోళనతో చెప్పాడు. నవేద్ సజీవంగా పట్టుబడతాడని లష్కరే అనుకోలేదు. అందుకే ఇప్పుడు మమ్మల్ని వెంటాడుతోంద’ని చెప్పాడు. గాబరాపడుతూ ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ప్రయత్నిస్తే స్విచాఫ్ చేసి ఉంది.
 
44 ప్రాణాలు కాపాడిన వీరత్వం
* ఒంటరిగా ముష్కరులను ఎదుర్కొన్న కానిస్టేబుల్ రాకీ
జమ్మూ: జమ్మూ, శ్రీనగర్ హైవేపై బుధవారం ఉదయం.. బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌లోని డజనుకు పైగా వాహనాలు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాయి. వాటిలో డార్క్‌గ్రీన్ కలర్‌లో ఉన్న బస్‌లో 44 మంది జవాన్లున్నారు. వారిలో కొందరు సెలవులకు స్వస్థలాలకు వెళ్తున్నవారైతే, మరికొందరు సెలవు ముగించుకుని డ్యూటీకి తిరిగివస్తున్నవారు. వారెవ్వరి వద్ద ఆయుధాల్లేవు. వారికి రక్షణగా ఉన్న కానిస్టేబుల్.. 25 ఏళ్ల రాకీ వద్ద మాత్రమే ఆయుధముంది.

ఉధంపూర్ దాటిన తరువాత మిస్రోలీ వద్ద మిగతా వాహనాలకు ఈ బస్సు కాస్త దూరమైంది. ఇంతలో అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఇద్దరు సాయుధులు డ్రైవర్‌పై తూటాల వర్షం కురిపించారు. బస్సు టైర్లను పేల్చేశారు. బస్సు వెనుకకు వచ్చి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించసాగారు. ఒకవేళ వాళ్లు బస్‌లోకి వస్తే.. పరిస్థితి దారుణంగా ఉండేది. మృతుల సంఖ్య భారీగా పెరిగేది. కానీ ఆ ముష్కరుల ప్రయత్నాన్ని తన యూనిట్లో రాక్‌ఫోర్స్‌గా పేరున్న కానిస్టేబుల్ రాకీ సమర్ధంగా తిప్పికొట్టాడు.

వారిపై ఎడతెరిపి లేకుండా బుల్లెట్ల వర్షం కురిపించాడు. తన శరీరంలోకి తూటాలు దూసుకుపోతున్నా పట్టించుకోకుండా వీరోచితంగా ఎదురుదాడి కొనసాగించాడు. వారిని బస్‌లోకి రాకుండా నిలువరించాడు. ఇద్దరిలో ఒక టైస్ట్‌ను తుదముట్టించాడు. మరో టైస్ట్ తన చేతిలోని గ్రెనేడ్‌ను బస్సులోకి విసిరేందుకు ప్రయత్నిస్తుండగా, అందుకు సమయం ఇవ్వకుండా కాల్పులు కొనసాగించాడు. దాంతో ఆ టైస్ట్ చేతిలోని గ్రెనేడ్ బస్సు పక్కగా పడి పేలిపోయింది. దాని శకలాలు గుచ్చుకుని జవాన్లకు గాయాలయ్యాయి. చివరకు, రాకీని ఎదిరించడం అసాధ్యమని అర్థమై, ఆ ఉగ్రవాది పలాయనం చిత్తగించాడు.
 
తమ్ముడు కూడా సైన్యంలోకే!
రాకీ మరణంతో ఆయన స్వస్థలం హరియాణ లోని చిన్న గ్రామం రామ్‌గఢ్ మజ్రా చిన్నబోయింది. రెండు వారాల క్రితమే ఇంటికి వచ్చాడంటూ తండ్రి ప్రీత్‌పాల్ గుర్తు చేసుకున్నాడు. దేశంకోసం ప్రాణాలిచ్చిన తన కుమారుడిని చూసి దేశం గర్విస్తోందన్నారు. రాకీ తమ్ముడు రోహిత్ కూడా సైన్యంలో చేరేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం. చెల్లి నేహా నర్సింగ్ కోర్సు చేస్తోంది. రెండున్నరేళ్ల క్రితమే రాకీ బీఎస్‌ఎఫ్‌లో చేరాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement