
కట్నం కింద వేపమొక్క ఇచ్చాడు!
కోట: కట్నం లేకుండా వివాహం చేసుకునే యువకులు కరువైపోతున్న ఈ రోజుల్లో రాజస్థాన్ కోటా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కట్నం కింద ఓ కుటుంబం కట్నంగా వేపచెట్టును తీసుకుని జిల్లా మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఢాకర్ కేరి గ్రామానికి చెందిన శకుంతల కబ్రా తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. ప్రభుత్వ పనులకు సంబంధించిన అప్లికేషన్లు నింపడానికి గ్రామస్థులకు సాయపడుతుంటుంది.
భిల్వారా జిల్లాలోని లడ్ పూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తితో కబ్రాకు ఆమె తండ్రి వివాహం చేయాలని నిశ్చయించారు. ఇందుకోసం లక్ష్మణ్ కుటుంబసభ్యులను సంప్రదించిన ఆయన తన కూతురు, ఒక వేప మొక్కను తప్ప కట్నం ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదని వారితో చెప్పాడు. వరుడి కుటుంబసభ్యులు ఇందుకు అంగీకరించారు. లడ్ పూర్ నుంచి ఓ చిన్న ట్రక్కులో దాదాపు 70 మంది కబ్రా, లక్ష్మణ్ వివాహానికి ఢాకర్ కేరికి తరలివచ్చారు. వారందరి ముందు ఒక వేపమొక్కను తీసుకువచ్చి లక్ష్మణ్ కు కబ్రా తండ్రి అందించాడు.
కొద్ది నిమిషాల్లోనే ఈ విషయం జిల్లా మొత్తం వ్యాపించింది. కట్నం లేకుండా వేపమొక్క తీసుకుని వివాహం చేసుకున్నారంటా.. అంటూ అక్కడి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరకట్నం ఇవ్వకుండా వివాహం చేసుకోవడంపై వధువు కబ్రా మాట్లాడుతూ.. వేప మొక్కను తన వివాహానికి ఆమె తండ్రి కట్నంగా ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. కట్నం కోసం మహిళలను వేధిస్తున్న ఈ రోజుల్లో తన పెళ్లి సమాజానికి ఆదర్శం అవుతుందని చెప్పారు.