డ్రైవర్కు గుండెపోటు.. పాదచారులపైకి బస్సు
అది దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతం. సమయం సాయంత్రం 4 గంటలు. ఓ బస్సు ఉన్నట్టుండి అటూ ఇటూ తిరిగిపోతూ పాదచారులను ఢీకొంది. దాంతో గుర్తుతెలియని ఓ వ్యక్తి చనిపోయాడు కూడా. ఎందుకలా జరుగుతోందని బస్సులో ఉన్నవాళ్లు కూడా ఖంగారు పడ్డారు. తీరాచూస్తే.. బస్సు నడుపుతున్న డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. స్టీరింగ్ వీల్ మీద వాలిపోయాడు.
ఈ ఘటనలో సంతోష్ కుమార్ (19), ఆయన అన్న మహేందర్ కుమార్ (24), మరో పాదచారి రాజేష్ కుర్మా (45) తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ వాజిద్ అలీని ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. తమవద్దకు ఐదుగురు పేషంట్లను తీసుకొచ్చారని, వాళ్లలో ఇద్దరు తెచ్చేసరికే మరణించారని సుశ్రుత ట్రామ సెంటర్ సీఎంఓ డాక్టర్ ఎస్ఎం బస్నా తెలిపారు.