
మార్స్‌పైకి చైనా పంపనున్న రోవర్ ఇదే.
పశ్చిమదేశాలు చంద్రుడి మీదికి మానవుణ్ని పంపిన తర్వాతగానీ అంతరిక్ష పరిశోధనలు ప్రారంభించిన చైనా.. అనంతమే హద్దుగా దూసుకుపోతోంది.
బీజింగ్: పశ్చిమ దేశాలు చంద్రుడి మీదికి మానవుణ్ని పంపిన తర్వాతగానీ అంతరిక్ష పరిశోధనలు ప్రారంభించిన చైనా.. అనంతమే హద్దుగా దూసుకుపోతోంది. భద్రతా కారణాలతో అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా తనను దూరం పెట్టిన నాటి నుంచి మరింత కసిగా పరిశోధనలు నిర్వహిస్తోంది. ఆ మేరకు సమీప, దీర్ఘకాలిక భవిష్యత్తులో చేపట్టనున్న ప్రయోగాలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను చైనీస్ స్పేస్ ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది.
2020 నాటికి అంగారక గ్రహం(మార్స్)పైకి సొంత పరిశోధక నౌకను పంపాలని నిర్ణయించినట్లు స్పేస్ ఏజెన్సీ డిప్యూటీ చీఫ్ వూ యాన్హువా తెలిపారు. రోవర్‌ను పంపడమేకాక, మార్స్ ఉపరితలంలో ఉన్న పదార్థాలపై పరిశోధనలు కూడా చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇదే కాకుండా 2018లోగా చంద్రుడి మీది చీకటి ప్రాంతం(the dark side of the moon)లోకి పరిశోధక నౌకను పంపనున్నట్లు, 2030 నాటికి గురుగ్రహం(జుపిటర్), దాని ఉపగ్రహాలపైకి కూడా రోవర్లను పంపనున్నట్లు చైనీస్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. మొత్తంగా మరో 15 ఏళ్లలోపే అంతరిక్ష పరిశోధనల్లో చైనా అగ్రగామిగా మారనుందని యాన్హువా అన్నారు.
మిగతా దేశాలకంటే ఆలస్యంగా 1970 తర్వాత అంతరిక్ష పరిశోధనలకు ఉపక్రమించిన చైనా అనతికాలంలోనే వేగవంతమైన అభివృద్ధిని సాధించి, 2003లో తన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. చంద్రుడిపైకి పరిశోధక వాహనాన్ని పంపడమేకాక అక్కడ (20 టన్నుల బరువుండే) పరిశోధనశాల(ల్యాబ్)ను నిర్మించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. (అంగారక గ్రహంలో మనిషి కట్టబోయే ఇళ్ల డిజైన్!)
అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతోన్న డ్రాగన్ దేశాన్ని నిలువరించాలనుకున్న అమెరికా.. 2011 నుంచి చైనాకు సహకరించడం మానేసిన సంగతి తెలిసిందే. అమెరికన్ కాంగ్రెస్ తీర్మానం మేరకు నాసా.. చైనీస్ స్పేస్ ఏజెన్సీకి సహకరించడం మానేసింది. బుధవారం నాటి ప్రకటనలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించిన చైనీస్ స్పేస్ ఏజెన్సీ.. నాసాతో సంబంధాలు పునరుద్ధరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. (చదవండి: ఏలియన్స్ అన్వేషణలో 'చైనా' ముందంజ)