
టీడీపీలో రేగిన చిచ్చు
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోంది. పదవిపై ఆశ పెట్టుకున్నవారు తమను కాదని వేరే వారికి అవకాశం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
సాక్షి, అమరావతి
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోంది. పదవిపై ఆశ పెట్టుకున్నవారు తమను కాదని వేరే వారికి అవకాశం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులివ్వడంతో వారి ప్రత్యర్థులు నేరుగా ముఖ్యమంత్రినే నిలదీశారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసినా పట్టించుకోలేదని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులు, అలకవహించిన వారిని బుజ్జగించేందుకు, తాయిలాలిచ్చి లాలించేందుకు ఎప్పటిమాదిరిగానే చంద్రబాబు సీనియర్లను రంగంలోకి దించారు. పలువురితో స్వయంగా మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి తన వర్గంతో విజయవాడ చేరుకున్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. రామసుబ్బారెడ్డితోపాటు లింగారెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, సతీష్‌రెడ్డి, సుధాకర్ యాదవ్, రమేష్‌రెడ్డిలతో ఆయన సమావేశమై బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఆదినారాయణరెడ్డి మంత్రయినా పార్టీలో ప్రాధాన్యం ఉండేలా ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని, లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేందుకు సీఎంను ఒప్పిస్తానని గంటా చెప్పినా వారు వినలేదని సమాచారం.
అసంతృప్తి... ఆవేదన...
విజయనగరంలో జిల్లాలో వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన సుజయ కృష్ణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మీసాల గీత, కేవీ నాయుడు, సంధ్యారాణి, జగదీష్‌లు సీఎంను కలిసినా ప్రయోజనం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు సైతం ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రిని పట్టుబట్టినా ప్రయోజనం లేకపోవడంతో గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల నరేంద్ర సీఎం నివాసం నుంచి బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైతం తన వర్గీయులను చంద్రబాబుకు వద్దకు పంపి మంత్రివర్గంలోకి చేర్చుకోవాలని డిమాండ్ చేయించినా ఆయన పట్టించుకోలేదు. డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు మంత్రి పదవి ఇప్పించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న ఎంపీ రాయపాటి వర్గం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది.
జీవీ ఆంజనేయులు, ఆలపాటి రాజా, శ్రావణ్‌కుమార్‌లు సీఎం వద్దే తమకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. యరపతినేని శ్రీనివాసరావును సీఎం అంతకు ముందే పిలిచి సర్దిచెప్పారు. మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన పయ్యావుల కేశవ్ తనకు మద్దతుగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని చంద్రబాబుకు వద్దకు పంపినా సీఎం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దెందులూరు ఎమ్మెల్యే తన వర్గాన్ని పంపి మంత్రి పదవి అడిగించినా చంద్రబాబు పట్టించుకోకపోవడంతో నిరాశకు గురయ్యారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన భూమా అఖిలప్రియకు మంత్రివర్గంలో స్థానం కల్పించడంపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు బనగానపల్లె, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వరరెడ్డిలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హతాశులైన మంత్రులు, ఫిరాయింపుదారులు
మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డి, రావెల కిషోర్‌బాబు, పీతల సుజాతలను పిలిచి ఇక మంత్రివర్గంలోకి చోటు లేదని ముఖ్యమంత్రి పిలిచి చెప్పడంతో వారు హతాశుతులయ్యారు. తమను కొనసాగించాలని కోరినా ఆయన పట్టించుకోలేదు. మంత్రి పదవి వస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ), షరీఫ్‌లు తమను పార్టీ మోసం చేసిందని వాపోయారు. మంత్రి పదవి హామీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జ్యోతుల నెహ్రూ, చాంద్‌బాషాలకు మొండిచేయి చూపడంతో వారు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. టీడీపీ తమను వాడుకుని వదిలేసిందని వాపోతున్నారు.
శనివారం ఉదయం నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా ఉన్న వారిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. మంత్రి పదవులు ఇవ్వలేని వారికి మంచి కార్పొరేషన్లు ఇస్తానని, అవసరమైతే ఆర్థికంగానూ ఆదుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నట్లు తెలిసింది. అయినా పలువురు తమకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.