
ఏపీ కేబినెట్ కూర్పు ఖరారు: ఐదుగురు ఔట్
ఉత్కంఠకు తెరదించుతూ తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేశారు.
- నేడే విస్తరణ
- ఫిరాయింపుదారులకు చంద్రబాబు పెద్దపీట
- ఉదయం 9.22 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
- కొత్తగా 11 మందికి అవకాశం
- వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చినవారిలో నలుగురికి చాన్స్
- ఐదుగురు మంత్రులకు ఉద్వాసన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. కేబినెట్‌లో కొత్తగా 11 మందికి అవకాశం దక్కింది. జిల్లాల్లో రాజకీయ, సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. మంత్రుల జాబితాను గవర్నర్ నరసింహన్‌కు పంపించినట్లు సమాచారం.
ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో 20 మంది సభ్యులున్నారు. వాస్తవంగా 26 మందికి అవకాశం ఉంది. 5గురి తొలగింపు, కొత్తగా 11 మంది చేరికతో సీఎంతో సహా మంత్రుల సంఖ్య 26కు చేరనుంది. కొత్త మంత్రులుగా 11 మందితో ఆదివారం ఉదయం 9.22 గంటలకు వెలగపూడి సచివాలయం వద్ద గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కిమిడి మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, రావెల కిషోర్‌బాబు, పల్లె రఘునాథ్‌రెడ్డిలను కేబినెట్ నుంచి తొలగించారు.
ప్రత్తిపాటి కొనసాగింపునకే బాబు మొగ్గు
రావెల కిషోర్‌బాబు పలు వివాదాల్లో చిక్కుకోవడంతో మంత్రివర్గం నుంచి తప్పించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో చురుగ్గా పనిచేయలేకపోవ డంతో తొలగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని పీతల సుజాతకు ఉద్వాసన పలికారు. కళా వెంకట్రావుకు అవకాశం ఇవ్వాల్సి రావడంతో అదే కుటుంబానికి చెందిన కిమిడి మృణాళినిని పక్కకు తప్పించారు. పనితీరు సరిగా లేదనే నెపంతో పల్లె రఘునాథ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కూడా తొలగించాలని నిర్ణయించినా అగ్రిగోల్డ్ ఉదంతంతో ఆయన వేటు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం
వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన కర్నూలు జిల్లాకు చెందిన భూమా అఖిలప్రియ(ఆళ్లగడ్డ), చిత్తూరు నుంచి అమర్‌నాథ్‌రెడ్డి(పలమనేరు), వైఎస్సార్ జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి(జమ్మలమడుగు), విజయనగరం జిల్లా నుంచి సుజయకృష్ణ రంగారావు(బొబ్బిలి)కు అవకాశం కల్పించారు. ఫిరాయింపుదారులను మంత్రివర్గంలోకి తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయనే అనుమానం ఉన్నప్ప టికీ న్యాయ నిపుణులతో చర్చించి, మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
కొత్తపల్లి జవహర్‌కు అనూహ్యంగా
ఉభయ గోదావరి జిల్లాల నుంచి జ్యోతుల నెహ్రూ, వేటుకూరి శివరామరాజు, షరీఫ్‌లకు మంత్రి పదవులు దక్కడం ఖాయమనుకున్నా సమీకరణల్లో అవకాశం లేకుండా పోయింది. పశ్చిమ గోదావరి నుంచి అనూహ్యంగా కొత్తపల్లి జవహర్‌కు చోటు కల్పించడంతో ఆ జిల్లా నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. మైనారిటీ కోటాలో కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు మంత్రి పదవి ఖరారు చేసినా ఆఖరి నిమిషంలో ఆయనకు మొండిచేయి చూపారు. ప్రస్తుత మంత్రివర్గంలో ముగ్గురు మహిళలుండగా వారిలో పీతల సుజాత, మృణాళినికి ఉద్వాసన పలికారు. కొత్తగా అఖిల ప్రియకు చోటు కల్పించారు. మైనారిటీలు, గిరిజనులకు ఈసారి కూడా అవకాశం కల్పించలేదు. అనంతపురం జిల్లాలో పల్లె రఘునాథరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించారు. ఆయనను చీఫ్‌విప్‌గా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.
భారీగా శాఖల మార్పు: మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ఒక్కరి దగ్గరే రెండు, మూడు కీలక శాఖలున్నాయి. ఈసారి అలాకాకుండా అందరికీ శాఖలు సమానంగా పంచాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. తన కుమారుడు నారా లోకేశ్‌కు పంచాయతీరాజ్, ఐటీ శాఖలను అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఆ శాఖను నిర్వహిస్తున్న అయ్యన్నపాత్రుడికి మరో శాఖ ఇవ్వాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప శాఖలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖ పనితీరు బాగాలేదని, అవినీతిమయంగా మారిందంటూ ఇప్పటికే పలుమార్లు కేఈ కృష్ణమూర్తిని సీఎం పలు సమావేశాల్లో మందలించారు. ఆ శాఖలో ఆయన మాట చెల్లుబాటుకాకుండా చేయడంతోపాటు అప్రాధాన్యంగా మార్చారు. ఈ నేపథ్యంలో ఆయన శాఖ మారుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
హోంశాఖపై చినరాజప్ప అసలు పట్టుసాధించ లేదని పలుమార్లు చెప్పిన చంద్రబాబు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయనను వేరే శాఖలకు మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావును మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి మరో శాఖకు మార్చనున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను నిర్వహిస్తున్న నారాయణకు రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక శాఖ కేటాయించి అప్పగించనున్నట్లు సమాచారం. శాసనసభలో ప్రతిపక్షాన్ని దూషించి, బాబును మెప్పించిన అచ్చెన్నాయుడికి కీలక శాఖ దక్కనుంది.
మంత్రులతో చంద్రబాబు భేటీ
సీఎం చంద్రబాబు శనివారం రాత్రి తన నివాసంలో మంత్రులతో విడివిడిగా సమావేశమై తన నిర్ణయాలను వివరించారు. మంత్రి యనమల, ఉన్నతాధికారులతో కలిసి మంత్రుల జాబితాను రూపొందించి గవర్నర్‌కు పంపారు. ఉద్వాసన జాబితాలో ఉన్న వారిని రాజీనామా చేయాలని కోరారు.
కొత్త మంత్రులు వీరే...
1. నారా లోకేశ్ (ఎమ్మెల్సీ)
2. కిమిడి కళావెంకట్రావు (ఎమ్మెల్సీ)
3. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (ఎమ్మెల్సీ)
4. నక్కా ఆనంద్‌బాబు (ఎమ్మెల్యే)
5. పితాని సత్యనారాయణ (ఎమ్మెల్యే)
6. కొత్తపల్లి జవహర్ (ఎమ్మెల్యే)
7. కాల్వ శ్రీనివాసులు (ఎమ్మెల్యే)
మంత్రులవుతున్న ఫిరాయింపుదారులు
8. భూమా అఖిలప్రియ (ఎమ్మెల్యే)
9. అమర్‌నాథ్‌రెడ్డి (ఎమ్మెల్యే)
10 ఆదినారాయణరెడ్డి (ఎమ్మెల్యే)
11. సుజయకృష్ణ రంగారావు (ఎమ్మెల్యే)
ఉద్వాసన వీరికే..
1. కిమిడి మృణాళిని
2. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
3. పీతల సుజాత
4. రావెల కిషోర్‌బాబు
5. పల్లె రఘునాథ్‌రెడ్డి
చీఫ్ విప్ మంత్రి అయ్యారు.. మంత్రి చీఫ్ విప్ అయ్యారు
శనివారం రాత్రి ఖరారైన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఓ ఆసక్తికర పరిణామం. మూడేళ్లుగా టీడీపీ చీఫ్ విప్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాలువ శ్రీనివాసులుకు మంత్రిపదవి దక్కగా, మంత్రిగా కొనసాగుతున్న పల్లె రఘునాథరెడ్డిని కేబినెట్ నుంచి తప్పించి చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు. పల్లె నియామకానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
రామసుబ్బారెడ్డికి తాయిలం
వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టడంపై మొదటినుంచి తీవ్ర వ్యతిరేకత కనబర్చిన టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డిని చంద్రబాబు ఎట్టకేలకు బుజ్జగించారు. గవర్నర్‌కోటా ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డిని ఖరారుచేసి, ఆయనను మండలిలో విప్‌గా నియమించనున్నట్లు తెలిసింది.
కొత్తమంత్రులను కలుపుకుంటే జిల్లాలవారీగా మంత్రుల జాబితా ఇలాఉంది..
శ్రీకాకుళం: అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు
విజయనగరం: సంజయ్ కృష్ణ రంగారావు
విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు
తూర్పుగోదావరి: యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప
పశ్చిమగోదావరి: కేఎస్. జవహర్, పితాని సత్యనారాయణ, మాణిక్యాలరావు
కృష్ణా: కామినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర
గుంటూరు: ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు
ప్రకాశం: సిద్ధా రాఘవరావు
నెల్లూరు: నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
కడప: ఆదినారాయణరెడ్డి
కర్నూలు: కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ
అనంతపురం: పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు
చిత్తూరు: నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, అమర్‌నాథ్ రెడ్డి